- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్ రెడ్డి దేవుడినే మోసం చేశాడు : మాజీ మంత్రి హరీశ్ రావు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలోని శ్రీశ్రీ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు, సీఆర్ నమోదు అవగాహన సదస్సుకు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

దిశ, అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలోని శ్రీశ్రీ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు, సీఆర్ నమోదు అవగాహన సదస్సుకు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై అశ్వారావుపేట నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి పాల్గొన్న పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అశ్వారావుపేటలో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఇంత జోష్ ఉంటుందని అనుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోని అచ్చంపేటకు వెళ్లినా, అశ్వారావుపేటకు వచ్చినా "మళ్లీ కేసీఆర్ రావాలి" అనే ఒకటే మాట వింటున్నానని చెప్పారు. మార్పు రావాలని, మాటలు చెప్పేవారు కాదు, చేతలు చూపే కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.
కేసీఆర్ ఎన్నికల ముందు హామీ ఇవ్వకపోయినా ప్రజలకు అవసరమైన ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని తెలిపారు. మేనిఫెస్టోలో లేకపోయినా, ఓట్ల కోసం చెప్పకపోయినా కల్యాణలక్ష్మి వంటి గొప్ప పథకాన్ని అమలు చేసి 13 లక్షల మంది పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు రూ.13 వేల కోట్లు వెచ్చించారని గుర్తుచేశారు. ఎన్నికల హామీలో లేని రైతుబంధును కూడా అమలు చేశామని, కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా రైతుబంధు ఆపకుండా 11 విడతల్లో రూ.73 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవానికి వెళ్లిన వారికి కేసీఆర్ కిట్‌తో పాటు రూ.12 వేల ఆర్థిక సహాయం అందించి తల్లి, బిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు. అలాగే మిషన్ భగీరథ వంటి అనేక పథకాలను ఎన్నికల హామీలతో సంబంధం లేకుండా అమలు చేశారని చెప్పారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చిందని, కేసీఆర్ రూ.10 వేలు ఇస్తానంటే తాము రూ.15 వేలు ఇస్తామని, కేసీఆర్ పెళ్లికి లక్ష రూపాయలు ఇస్తే తులం బంగారం కూడా జోడిస్తామని చెప్పారని, కానీ అవన్నీ హామీలుగానే మిగిలిపోయాయని విమర్శించారు.
రేవంత్ రెడ్డి దేవుడినే మోసం చేశాడు
రూ.2 లక్షలకుపైగా రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీల వీడియోలను ఎల్ఈడీ స్క్రీన్‌పై ప్రదర్శించారు. దీనిపై స్పందిస్తూ... సీఎం మాట నమ్మి వడ్డీలకు అప్పు తెచ్చి రుణాలు చెల్లించిన రైతులు ఇప్పుడు వడ్డీలపై వడ్డీలు కడుతున్నారని, కానీ రుణమాఫీ మాత్రం జరగలేదన్నారు. భూమి బద్దలైనా, అటు సూర్యుడు ఇటు పొడిచినా రుణమాఫీ చేస్తాం అని చెప్పి ఇప్పుడు మాట తప్పారని ఆరోపించారు. భద్రాద్రి శ్రీరాముడిపై ఒట్టు పెట్టి మాట తప్పిన రేవంత్ రెడ్డిని ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. "దేవుడినే మోసం చేసినవాడు ప్రజలను మోసం చేయడా? దేవుడిపైనా భయం లేకుండా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ప్రజలు దీనిని గమనించాలి" అని అన్నారు.
మధిర రైతు ఆశీర్వాద సభ పేరు మార్చుకోవాలి
ఈ నెల 30న మధిరలో రైతు ఆశీర్వాద సభకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని, యాసంగి రైతుబంధు ఎగ్గొట్టి ఇప్పుడు వానాకాలం రైతుబంధు ఇస్తామని చెబుతారని అన్నారు. ఎకరానికి ఇస్తారా, రెండు ఎకరాల వారికి ఇస్తారా అనేది కూడా స్పష్టత లేదన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రైతులు సీఎం రేవంత్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరుతున్నారని, కానీ రైతులు ఎందుకు ఆశీర్వదించాలని ప్రశ్నించారు. దేవుడి పై ఒట్టు పెట్టి మాట తప్పినందుకా? మూడుసార్లు రైతుబంధు ఇవ్వకుండా రూ.29 వేల కోట్లు బకాయి పెట్టినందుకా.. అసెంబ్లీ సాక్షిగా పంటల బీమా ఇస్తామని చెప్పి అమలు చేయనందుకా.. మొక్కజొన్న, మిర్చి, పామాయిల్ రైతులకు అవసరమైనంత యూరియా ఇవ్వకపోయినందుకా రైతులు ఆశీర్వదించాలని ప్రశ్నించారు. వడ్ల కొనుగోలులో తరుగుతీస్తే తోలు తీస్తానన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు రైస్ మిల్లర్ల చేతిలో తోలుబొమ్మగా మారిపోయారని విమర్శించారు. మధిరలో నిర్వహించే రైతు ఆశీర్వాద సభను రైతు క్షమాపణ సభగా పేరు మార్చాలని, రైతు డిక్లరేషన్ పేరుతో చేసిన మోసానికి, నెరవేర్చని హామీలకు రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మంత్రులు చేసింది గుండు సున్న.. సీతారామ ప్రాజెక్టును 80 శాతం పూర్తి చేసి వదిలేశామని, మిగిలిన 20 శాతం పూర్తి చేసే సామర్థ్యం ఈ ప్రభుత్వానికి లేదన్నారు. ప్రాజెక్టును పూర్తిగా అటకెక్కించారని ఆరోపించారు. గేట్లు సకాలంలో ఎత్తకపోవడంతో ప్రభుత్వ నిర్లక్ష్యం, మానవ తప్పిదం కారణంగా అశ్వారావుపేట మండలంలోని పెదవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయిందన్నారు. వేల ఎకరాలు నష్టపోతుంటే రెండేళ్లుగా ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్టు ఒక్కటీ లేదన్నారు. ఖమ్మం జిల్లాలో పెదవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయిందని, మహబూబ్‌నగర్ జిల్లా వట్టేం పంప్ హౌస్ మునిగిపోయిందని, ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని, సుంకిశాల ప్రాజెక్టు కూలిపోయినా ఇప్పటికీ పునర్నిర్మాణం చేపట్టలేదని విమర్శించారు.
ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించారు..
కేసీఆర్ హయాంలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చారని, ఇప్పుడు కేవలం తొమ్మిది గంటలే విద్యుత్ వస్తోందన్నారు. రైతు డిస్కం పేరుతో సోలార్ విద్యుత్ ఇస్తామని చెబుతున్నారని, దీంతో పగటి పూట మాత్రమే కరెంటు వస్తుందని, పామాయిల్ తోటలకు అది ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. ఎస్టీ కార్పొరేషన్‌కు రూ.257 కోట్లు, ఎస్సీ కార్పొరేషన్‌కు రూ.5,400 కోట్లు కేటాయించామని ప్రభుత్వం చెబుతున్నా, ఒక్క రూపాయి కూడా లబ్ధిదారులకు అందలేదన్నారు. ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నా వారు చేసింది గుండు సున్నేనని, రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న విద్య, హోం, మున్సిపల్ శాఖల పనితీరు కూడా గుండు సున్నేనని విమర్శించారు. ఢిల్లీకి సంచులు మోసే శాఖలో మాత్రమే రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతున్నాడు" అని వ్యాఖ్యానించారు. సిద్దిపేటకు వచ్చి 45 రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేస్తానన్నారని, అందరికీ ఇస్తానన్నారని, కానీ ఒకటి, రెండు ఎకరాల రైతులకు మాత్రమే డబ్బులు వచ్చాయని అన్నారు.
మంత్రి జూపల్లికి మతి ఉందా ?
తాము ఇచ్చిన బోనస్ మూడు రైతుబంధులకు సమానమని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఒకసారి రూ.1,500 కోట్లు, మరోసారి రూ.1,200 కోట్లు కలిపి రూ.3 వేల కోట్లలోపే బోనస్ ఇచ్చారని, కానీ రైతుబంధు పేరుతో ఎగ్గొట్టింది రూ.29,350 కోట్లని తెలిపారు. అసలు లెక్కలు తెలుసుకుని మాట్లాడాలని, ఇదే అంశంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని చెప్పారు. మంత్రి జూపల్లి మతి లేకుండా మాట్లాడుతున్నట్లు అనిపిస్తోందని విమర్శించారు. కార్యకర్తలను వేధిస్తే వదిలిపెట్టం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టాలని ఎప్పుడూ ఆలోచించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం కేసులు పెట్టి కార్యకర్తలను వేధిస్తున్నారని ఆరోపించారు. అశ్వారావుపేట మండలం మల్లాయిగూడెం మాజీ సర్పంచ్ నారం రాజశేఖర్ పామాయిల్ తోటలను రెండుసార్లు నరికివేసినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు.
చండ్రుగొండ మండలానికి చెందిన పోడియం రవి, వెంకటేశ్వర్లును వేధిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని బాధితులకు భరోసా ఇచ్చారు.
అశ్వారావుపేటకు మంచి భవిష్యత్తు: మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అశ్వారావుపేట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో సీతారామ ప్రాజెక్టును కేసీఆర్ ప్రారంభించారని, దానిని ఆచరణలో పెట్టేందుకు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అహర్నిశలు శ్రమించారని పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా పనుల్లో జాప్యం జరిగిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు గడిచినా సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. రానున్న బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సీతారామ ప్రాజెక్టు పూర్తవుతుందని, అశ్వారావుపేట ప్రాంతం గోదావరి జలాలతో తడవాలంటే మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాల్సిందేనన్నారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి ఆరు నెలలకు రైతుబంధు అందేదని, భేదభావం లేకుండా అందరికీ రైతుబంధు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. రిజర్వేషన్ అనుకూలించక వలస వచ్చి గోదావరి జలాలతో అక్కడి ప్రజల కాళ్లు కడుగుతామని చెప్పినవారు, మీటర్ నొక్కి నీళ్లు వదిలి ఫొటోలకు ఫోజులిచ్చిన మంత్రులు తప్ప ఈ గిరిజన ప్రాంతానికి దమ్మున్న పని చేసిన వారు లేరని విమర్శించారు.
ప్రస్తుతం మంత్రులుగా ఉన్న కొందరు గతంలో హరీశ్ రావు ఇంటి ముందు పడిగాపులు కాసిన రోజులు గుర్తున్నాయని, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన రాజకీయ భిక్షతో పదవులు పొంది ఇప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థికి అవకాశం రాలేదని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గానికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. బుగ్గపాడు ఫుడ్ పార్క్‌లో భూములను తక్కువ ధరలకు మంత్రుల కుమారులు బినామీల పేర్లతో కొనుగోలు చేశారని ఆరోపించారు. బుగ్గపాడు కోసం సీతారామ ప్రాజెక్టు మట్టిని తరలిస్తూ కోట్లాది రూపాయల విలువైన భూమిని దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాకు చెందిన వ్యవసాయ, రెవెన్యూ శాఖ మంత్రుల భూములు వందల ఎకరాల నుంచి వేల ఎకరాలకు పెరిగాయని, కానీ అశ్వారావుపేట గిరిజనుల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదన్నారు. గత రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో దోపిడీ రాజ్యం, దండుపాళ్యం ముఠా తరహా పాలన మాత్రమే సాగుతోందని, ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. వృద్ధాప్య పింఛన్లను రూ.2,000 నుంచి రూ.4,000కు పెంచుతామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్న పథకం, చదువుకునే ఆడపిల్లలకు స్కూటర్లు, పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని నిలదీశారు.






