- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లేద్ర లేవగానే తలతిరగడం.. ఇలా ఎందుకు జరుగుతుంది?
ఆ క్షణంలో రక్తపోటు(BP) తగ్గడం వల్ల మెదడుకు తగినంత ఆక్సిజన్ అందక, తల తిరగడం లేదా బలహీనత ఆవహించడం సంభవిస్తుంది.

దిశ, ఫీచర్స్ : నిద్రపోయి లేదా కూర్చొని ఉండి సడెన్‌గా పైకిలేచి నిలవడగానే కొందరికి వెంటనే తలతిరగడం, చూపు మసకబారడం లేదా కొద్దగా మూర్ఛపోయినట్లు అనిపించడం సాధారణం. రెగ్యులర్‌గా ఇలా జరుగుతుంటే గనుక అనుమానించాల్సిందే. ఎందుకంటే ఇది ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ (Orthostatic Hypotension) కావచ్చు అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఏమిటీ సమస్య, ఎందుకు వస్తుంది?
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ ప్రధాన కారణం గురుత్వాకర్షణ శక్తి(Gravity). అంటే.. నిలబడిన వెంటనే ఇది పనిచేయడం కారణంగా రక్తం కాళ్లు, కాళ్ల దిగువ భాగంలో పూల్ (pool) అయి చేరుతుంది. ఫలితంగా మెదడుకు వెళ్లాల్సిన రక్త పరిమాణం హఠాత్తుగా తగ్గిపోతుంది. శరీరం దీన్ని సర్దుబాటు చేసి మెదడుకు తగినంత రక్తం పంపించడానికి కొన్ని సెకన్ల సమయం తీసుకుంటుంది. కాబట్టి ఆ క్షణంలో రక్తపోటు(BP) తగ్గడం వల్ల మెదడుకు తగినంత ఆక్సిజన్ అందక, తల తిరగడం లేదా బలహీనత ఆవహించడం సంభవిస్తుంది. సాధారణంగా 3 నిమిషాల్లోపు సిస్టలిక్ బీపీ 20 mmHg లేదా డయాస్టలిక్ బీపీ 10 mmHg తగ్గితే దీనిని ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటారు.
ఎవరికి ఎక్కువగా వస్తుంది?
వృద్ధులు (65 సంవత్సరాలు పైబడినవారు), డీహైడ్రేషన్ (నీరు తక్కువ తాగేవారు) బాధితులు, బీపీ, డయాబెటిస్, డిప్రెషన్ వంటి వాటికి మందులు వాడేవారు ఎక్కువగా దీనిబారిన పడుతుంటారు. అలాగే గుండె సమస్యలు, పార్కిన్సన్స్, డయాబెటిస్ న్యూరోపతి ఉన్నవారిని కూడా ఇది వేధిస్తుంది. అలాగే ఏదైనా అనారోగ్య లేదా వృద్ధాప్య సమస్యలతో దీర్ఘకాలం పడుకుని ఉండి.. లేచేవారిలో కూడా ఇలా జరుగుతుంది. గర్భిణులు, కొంతమంది యువకులు, ముఖ్యంగా హైట్ ఎక్కువగా ఉండే వ్యక్తుల్లో ఇది రావచ్చు.
లక్షణాలు
*తల తిరగడం (డిజీనెస్)
*చూపు మసకబారడం లేదా చీకటిగా కనిపించడం
*బలహీనత, తలనొప్పితోపాటు తల తిరగడం
*గుండె వేగంగా కొట్టుకోవడం
*వికారం లేదా మూర్ఛ పోయినట్లు అనిపించడం
*కొన్ని సందర్భాల్లో నిజంగా మూర్ఛ పోవడం (fainting / syncope)
నష్టాలు
ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ వల్ల వృద్ధులు కిందపడిపోతుంటారు. దీంతో గాయపడటం, ఎముకలు విరగడం వంటివి జరగవచ్చు. కాబట్టి జాగ్రత్తలు ముఖ్యం. కొన్నిసార్లు తలకు గాయాలు కావచ్చు. దీర్ఘకాలికంగా ఉంటే మెదడు, గుండె సమస్యలు పెరగుతాయి. జీవిత నాణ్యత తగ్గుతుంది. అరుదుగా వృద్ధుల్లో ప్రాణాంతకం కావచ్చు.
నివారణ & చికిత్స?
*నెమ్మదిగా లేవడం (ముందు కూర్చుని, ఆ తర్వాత నిలబడటం)
*రోజుకు 2.5–3 లీటర్ల నీరు తాగడం
*ఉప్పు అధికంగా ఉన్న ఆహారం (డాక్టర్ సలహాతో) తీసుకోవడం
*నిద్ర పోతున్నప్పుడు కాళ్ల కింద ఎత్తైన దిండు వేసుకొని పడుకోవడం
*కాంప్రెషన్ సాక్స్ వాడడం
చికిత్స: కారణాన్ని బట్టి డాక్టర్లను మందులు వాడటం లేదా మార్చడం వంటివి సూచిస్తారు.
*ఫ్లూడ్ & సాల్ట్ ఇంటేక్ పెంచడం
*మందులు (మిడోడ్రిన్, ఫ్లూడ్రోకార్టిసోన్ వంటివి) వాడటం- డాక్టర్ సలహాతో మాత్రమే
*దీర్ఘకాలిక సమస్య అయితే కార్డియాలజిస్ట్ లేదా న్యూరాలజిస్ట్‌ను సంప్రదించాలి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ఇది వైద్యుల ప్రత్యక్ష సలహాలకు ప్రత్యామ్నాయం కాదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే డాక్టర్లను సంప్రదించగలరు.






