- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ప్రభుత్వ సలహాదారు.. డా. నోరి దత్తాత్రేయుడికి ‘పద్మభూషణ్’ పురస్కారం
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన క్యాన్సర్ వైద్య నిపుణులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడికి అరుదైన గౌరవం దక్కింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన క్యాన్సర్ వైద్య నిపుణులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడికి అరుదైన గౌరవం దక్కింది. వైద్యరంగంలో, ముఖ్యంగా క్యాన్సర్ పరిశోధనలు, అత్యాధునిక చికిత్సలో ఆయన అందించిన అసమాన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆయనను ప్రతిష్టాత్మక ‘పద్మభూషణ్’ పురస్కారంతో సత్కరించింది. మంగళవారం భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా డాక్టర్ నోరి ఈ అత్యున్నత పౌర పురస్కారాన్ని సగర్వంగా అందుకున్నారు.
క్యాన్సర్ చికిత్సలో సిద్ధహస్తులు..
అమెరికాలోని అగ్రశ్రేణి వైద్యుల్లో ఒకరిగా కీర్తి గడించిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, సుప్రసిద్ధ భారతీయ వైద్యుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ప్రఖ్యాత రేడియేషన్ ఆంకాలజిస్ట్ అయిన ఆయన.. ముఖ్యంగా మహిళల్లో వచ్చే క్యాన్సర్ వ్యాధులను నయం చేయడంలో సిద్ధహస్తులు. వైద్య రంగానికి ఆయన చేసిన విశేష కృషికి గాను గతంలోనే భారత ప్రభుత్వం ఆయనను ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించింది.
తెలంగాణ క్యాన్సర్ కేర్‌కు వెన్నెముకగా..
అమెరికాలో స్థిరపడినప్పటికీ, మాతృభూమిపై మక్కువతో తెలంగాణ రాష్ట్ర వైద్య రంగానికి ఆయన తన వంతు సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వానికి అధికారిక సలహాదారుగా కొనసాగుతున్న డాక్టర్ నోరి, రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధి నివారణకు, ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించే అంశాలపై ఆయన ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేయనున్నారు. క్యాన్సర్ మహమ్మారిపై పోరాటంలో ఎంతోమందికి ప్రాణదానం చేసిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడికి ‘పద్మభూషణ్’ దక్కడం పట్ల వైద్య లోకం, రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






