- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుల్తానాబాద్‌లో రూ.7 కోట్ల CMR రైస్ స్కాం
రైస్ మిల్లుల పేరుతో ప్రభుత్వాన్ని కోట్ల రూపాయల మేర మోసం చేస్తూ, సీఎంఆర్ బియ్యాన్ని అక్రమంగా విక్రయించిన ఇద్దరు రైస్ మిల్లు నిర్వాహకులను సుల్తానాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, సుల్తానాబాద్: రైస్ మిల్లుల పేరుతో ప్రభుత్వాన్ని కోట్ల రూపాయల మేర మోసం చేస్తూ, సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) బియ్యాన్ని అక్రమంగా విక్రయించిన ఇద్దరు రైస్ మిల్లు నిర్వాహకులను సుల్తానాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సౌభాగ్యలక్ష్మి ఇండస్ట్రీస్‌కు చెందిన బండారి మారుతి, భాగస్వామి సౌఖ్యం అంజయ్యలు ప్రభుత్వానికి అందించాల్సిన వేలాది మెట్రిక్ టన్నుల బియ్యాన్ని దారి మళ్లించి భారీ ఎత్తున ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో ఒక్క సౌభాగ్యలక్ష్మి ఇండస్ట్రీస్ ద్వారానే ప్రభుత్వానికి సుమారు రూ.7 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు.
మంగళవారం సుల్తానాబాద్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రామగుండం డీసీపీ భూక్య రామ్‌రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, కరీంనగర్ జిల్లా కట్టరాంపూర్ భగత్‌నగర్‌కు చెందిన బండారి మారుతి, హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరు గ్రామానికి చెందిన సౌఖ్యం అంజయ్య కలిసి సౌభాగ్యలక్ష్మి ఇండస్ట్రీస్ నిర్వహిస్తున్నారు. వీరు తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థతో సీఎంఆర్ ఒప్పందం కుదుర్చుకుని ప్రభుత్వ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యంగా తిరిగి ప్రభుత్వానికి అందించాల్సి ఉండగా, నిబంధనలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడ్డారు. 2023-24 సంవత్సరాలకు సంబంధించి ప్రభుత్వానికి మొత్తం 2,119.125 మెట్రిక్ టన్నుల బియ్యం అందించాల్సి ఉండగా కేవలం 515.158 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారు. మిగిలిన 1,603.967 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించకుండా బహిరంగ మార్కెట్లో విక్రయించి భారీ లాభాలు పొందినట్లు విచారణలో వెల్లడైంది. ఈ అక్రమాల వల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.7 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. అంతేకాకుండా రైస్ మిల్లుల పేరుతో బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు నిల్వల్లో ఉన్న ప్రభుత్వ ధాన్యాన్ని కూడా అక్రమంగా వినియోగించినట్లు గుర్తించారు.
పౌరసరఫరాల శాఖ అధికారులకు సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ ధాన్యాన్ని ఇతర అవసరాలకు ఉపయోగించడంతో పాటు బహిరంగ మార్కెట్లో విక్రయించినట్లు ఆధారాలు లభించాయని డీసీపీ తెలిపారు. 2025లో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ అధికారులు, పెద్దపల్లి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన నిల్వల తనిఖీలలో 1,088.014 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరత బయటపడింది. దీనిపై వివరణ కోరగా నిందితులు అధికారులను తప్పుదోవ పట్టిస్తూ కాలయాపన చేశారని తెలిపారు. పౌరసరఫరాల శాఖ అధికారులు పలుమార్లు గడువు ఇచ్చినా బియ్యం సరఫరా చేయకపోవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో బండారి మారుతి గతంలో కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇదే తరహా సీఎంఆర్ అక్రమాలకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. శ్రీరాములపల్లిలోని సీతారామ ఆగ్రో ఇండస్ట్రీస్ ద్వారా రూ.69 కోట్ల మేర, కోరపల్లిలోని మహాశక్తి ఇండస్ట్రీస్ ద్వారా రూ.62 కోట్ల మేర, కాట్నపల్లిలోని సాయి మహాలక్ష్మి ఇండస్ట్రీస్ ద్వారా రూ.20 కోట్ల మేర ప్రభుత్వాన్ని మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు.
ఈ మూడు కేసులతో పాటు ప్రస్తుత సౌభాగ్యలక్ష్మి ఇండస్ట్రీస్ వ్యవహారాన్ని కలుపుకుని మొత్తం రాష్ట్రవ్యాప్తంగా రూ.158 కోట్ల ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసినట్లు నిర్ధారణ అయిందన్నారు. బండారి మారుతిపై గతంలో హత్య, హత్యాయత్నం, మోసం తదితర నేరాలకు సంబంధించిన పలు కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు అనంతరం నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం కరీంనగర్‌లోని కట్టరాంపూర్ ప్రాంతంలోని ఓ జిమ్ వద్ద నిందితులు ఉన్నట్లు సమాచారం అందడంతో సుల్తానాబాద్ సీఐ పొన్నమనేని రంజిత్‌రావు ఆధ్వర్యంలోని పోలీసు బృందం చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకుంది. అనంతరం నిందితులను సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ నిర్వహించారు. కేసుకు సంబంధించిన ఆధారాలు సేకరించిన అనంతరం కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ భూక్య రామ్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ధాన్యం, సీఎంఆర్ బియ్యం అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ పొన్నమనేని రంజిత్‌రావు, ఎస్‌ఐలు చంద్రకుమార్, మధుకర్, మల్లేష్, సనత్‌రెడ్డి, ఎస్‌ఐ అశోక్‌రెడ్డి తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.






