మియాపూర్‌లో వ‌ర‌ద కాలువ నిర్మాణ ప‌నులు.. హైడ్రా క‌మిష‌న‌ర్ ఆదేశాల‌తో అద‌న‌పు లైను నిర్మాణం

by Ajay Maddhiboyina |

మియాపూర్ - బాచుప‌ల్లి ప్ర‌ధాన‌ర‌హ‌దారిలో బీకే ఎన్‌క్లేవ్ వ‌ద్ద టాటా షోరూం ఎదురుగా వ‌ర‌ద సాఫీగా సాగేందుకు అద‌న‌పు పైపు లైను నిర్మాణ ప‌నులు మొద‌ల‌య్యాయి.

మియాపూర్‌లో వ‌ర‌ద కాలువ నిర్మాణ ప‌నులు.. హైడ్రా క‌మిష‌న‌ర్ ఆదేశాల‌తో అద‌న‌పు లైను నిర్మాణం
X

దిశ, తెలంగాణ బ్యూరో: మియాపూర్ - బాచుప‌ల్లి ప్ర‌ధాన‌ర‌హ‌దారిలో బీకే ఎన్‌క్లేవ్ వ‌ద్ద టాటా షోరూం ఎదురుగా వ‌ర‌ద సాఫీగా సాగేందుకు అద‌న‌పు పైపు లైను నిర్మాణ ప‌నులు మొద‌ల‌య్యాయి. సోమ‌వారం అర్ధ‌రాత్రి కురిసిన భారీ వ‌ర్షానికి అక్క‌డ పెద్ద‌మొత్తంలో వ‌ర‌ద నీరు నిలిచిపోవ‌డం.. వాహ‌నాలు మునిగిపోవ‌డంతో హైడ్రా మోటార్లు పెట్టి వ‌ర‌ద నీటిని తొల‌గించింది. తెల్ల‌వారు జాము వ‌ర‌కూ ఈ ప‌నులు జ‌రిగాయి. వరదనీరు నిలిచిన ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంగళవారం పరిశీలించారు. హైడ్రా అద‌న‌పు సంచాల‌కులు వ‌ర్ల‌పాప‌య్య, ట్రాఫిక్ ఏసీపీ ఆది మూర్తి ప‌ర్య‌ట‌న‌లో క‌మిష‌న‌ర్ వెంట ఉన్నారు. బీకే ఎన్‌క్లేవ్ వ‌ద్ద ప్ర‌ధాన ర‌హ‌దారిపై వ‌ర‌ద నీరు నిల‌బ‌డ‌డానికి కార‌ణాల‌ను తెలుసుకున్నారు. రోడ్డును దాటించే విధంగా గ‌తంలో నిర్మించిన పైపుల సామ‌ర్థ్యం స‌రిపోవడంలేద‌ని అధికారులు నిర్ధారించారు. దీంతో వెంట‌నే అద‌న‌పు లైను పార‌లాల్‌గా నిర్మించాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం రాత్రి 8 గంట‌ల ప్రాంతంలో ప‌నులు మొద‌ల‌య్యాయి. ఈ పైపుల నిర్మాణం బుధ‌వారం ఉద‌యానికి పూర్తి చేయాల‌నే లక్ష్యంతో ప‌నులు ప్రారంభించారు. హెచ్ఎండీఏ ఇంజినీర్లు, హైడ్రా అధికారులు ఈ ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

పెద్ద‌కూడి చెరువుకు వ‌ర‌ద నీరు చేరేలా..

టాటా షో రూమ్ వైపు నుంచి అవతలి వైపునకు ప్రధాన రహదారి కిందన ఉన్న పైపు లైన్ల కు అనుసంధానంగా పెద్దకూడి చెరువుకు కలుపుతూ అదనంగా పైపు లైను నిర్మాణ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఒక మీట‌రు వైశాల్యంతో ఉన్న పైపు ప్ర‌ధాన రోడ్డును త‌వ్వి అమ‌ర్చుతున్నారు. ఈ లైన్ల నిర్మాణం పనులు పూర్త‌యితే అక్క‌డ వ‌ర‌ద స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌ని అధికారులు చెబుతున్నారు. రోడ్డు అవ‌త‌ల చెరువువైపు ప‌నులు జ‌రిగేలా స్థానికుల‌తో మాట్లాడి ఒప్పించ‌డంతో ఈ ప‌నుల‌కు ఆటంకాలు తొలిగాయి. అంత‌కు ముందు అదే దారిలో హెచ్డీఎఫ్సీ చౌరస్తాలో ప్రధాన రహదారి కింద ఉన్న కల్వర్టులో ఒక వెంట్ మొత్తం పూడుకుపోవడంతో వరద నీరు వెళ్లని పరిస్థితిని హైడ్రా కమిషనర్ ప‌రిశీలించారు.

సోమవారం అర్ధరాత్రి 12 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదవ్వగా ఆ మార్గంలో సమస్యలు తలెత్తాయి. ఎదురుగా వున్న మాల్ నిర్వాహకులు ప్రధానవరద కాలువలో పూడిక తీయడానికి కూడా అవకాశం లేకుండా స్లాబ్ వేయడంతో సమస్య తలెత్తింది. స్లాబ్ ను అవసరమైన మేరకు తొలగించి మొత్తం పూడికను తొలగించి గుర్నాథ్ చెరువుకు వరద సాఫీగా వెళ్లేలా వెంటనే చర్యలు చేపట్టాలని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ అధికారుల‌ను ఆదేశించారు. హెచ్ఎండీఏ, సీఎంసీ ఇంజనీర్లు, హైడ్రా డీఎఫ్ఓ గౌతం, ఎస్ఎఫ్ఓలు శ్రీనివాస్, శ్యామ్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటనలో ఉన్నారు.

Next Story