- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రకృతి ముసుగులో అక్రమ దందా.. పచ్చదనం పేరుతో పచ్చి మోసం!
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మైలారం, మేడిపల్లి గ్రామాలలో సియోరా ఇన్ఫ్రా డెవలపర్స్ పేరుతో ఫామ్ ల్యాండ్ వెంచర్‌ను ఏర్పాటు చేసి సామాన్యులను వంచన చేస్తున్నారు.

దిశ, బ్యూరో నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మైలారం, మేడిపల్లి గ్రామాలలో సియోరా ఇన్ఫ్రా డెవలపర్స్ పేరుతో ఫామ్ ల్యాండ్ వెంచర్‌ను ఏర్పాటు చేసి సామాన్యులను వంచన చేస్తున్నారు. ఎలాంటి డీటీసీపీ లే అవుట్ అనుమతులు లేకుండా గుంటలు చొప్పున ప్లాట్లుగా మార్చుతూ పచ్చదనం ప్రకృతి సౌందర్యం పేర్లతో ప్రజలను పచ్చిగా మోసం చేస్తున్నారు. తద్వారా కోట్ల రూపాయలు కొల్లగొడుతూ అక్రమ రియల్ దందా దర్జాగా కొనసాగిస్తున్నారు.
రెండు గ్రామాల పరిధిలో ఫామ్ ల్యాండ్..
బొమ్మలరామారం మండలంలోని మైలారం గ్రామంలో 72,74,75,77,83,86,87,88, మేడి పల్లి గ్రామంలో 228, 238, 253, 254, 256, 257, 259, 269, 270, 271, 272, 273, 275, 276, 277, 278, 279, 280, 281, 282 సర్వే నెంబర్ లలో ఫామ్ ల్యాండ్ ఏర్పాటు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగా ఫామ్ ల్యాండ్ వెంచర్ ఏర్పాటు చేసి ప్రజలను ఆకర్షిషించి , పండ్ల మొక్కల ముసుగులో అక్రమ దందా చేస్తున్నారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి అనుమతులు లేకుండానే ఒక గుంట, రెండు గుంటలు, గజాల చొప్పున అక్రమంగా దందా కొనసాగిస్తున్నారు. అయిన రెవెన్యూ అధికారులు ఆ ఫామ్ ల్యాండ్ వెంచర్ వైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. వెంచర్ యాజమానుల వలలో పడి అమాయక ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోతున్నారు.
ప్రభుత్వ ఉత్తర్వులు బేఖాతరు..
తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ , అండ్ అర్బన్ డెవలప్మెంట్ కమిషనర్ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 2018, మున్సిపల్ యాక్ట్ 2019 నూతన చట్టం ప్రకారం ఫామ్ ల్యాండ్ వెంచర్లకు కనీసం 20గుంటలకు తక్కువగా ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయవద్దని మోమో నెంబర్ 2461/పిఎల్ఏ111/ 2020 ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం తహాశీల్దార్, సబ్ రిజిస్టర్ అధికారులకు ఉత్తర్వులు జారీచేశారు. అయినా ఆ ఉత్తర్వులను పరిగణలోకి తీసుకోకుండా కాసులకు కక్కుర్తి పడి అధికారులు రియల్టర్ల మోజులో పడిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అందమైన బ్రోచర్లతో కస్టమర్లకు వల..
రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ అందమైన బ్రోచర్లను ప్రింట్ చేసి భూమి తప్పకుండా కొనాలనే కోరిక కలిగి ఉన్న సామాన్యులకు వల వేస్తోంది. సోషల్ మీడియా వేదికగా బ్రోచర్లను సర్క్యులేట్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. రియల్ వ్యాపారులు వెంచర్ చూపించడానికి రవాణ సౌకర్యం క్యాబ్, బోజనాలు వంటి సౌకర్యాలు కల్పించి అమాయక ప్రజల ఆశలను రియల్ వ్యాపారులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. వెంచర్ కు రేరా అనుమతి లేకుండానే మార్కెటింగ్ ఏజెంట్ల ద్వారా ప్రచారం చేస్తూ ఫామ్ ల్యాండ్ ప్లాట్లను విక్రయిస్తున్నారు. కస్టమర్లు ప్లాట్లు కొనుగోలు చేసిన తర్వాత ఏదైనా సమస్య వస్తే ఏజెంట్లు కనిపించే సమస్య ఉండదు. అందుకే ప్రలోభాలకు గురిచేసి ప్లాట్లు విక్రయించే రియల్ వ్యాపారుల పట్ల కస్టమర్లు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.






