పవన్‌కు అమిత్‌షాపై ప్రేముంటే గుజరాత్‌లో పోటీచేయాలి: అనిరుధ్ రెడ్డి

by Malleboina Mahesh |

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై కాంగ్రెస్ నేత అనిరుధ్ రెడ్డి తీవ్ర విమర్శలు. 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలు ఫ్లాప్ అయిన డిప్రెషన్‌లోనే పవన్ మాట్లాడుతున్నారని ఎద్దేవా.

పవన్‌కు అమిత్‌షాపై ప్రేముంటే గుజరాత్‌లో పోటీచేయాలి: అనిరుధ్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో జనసేన సభకు అనుమతి రాకపోవడంతో.. ప్రెస్ మీట్ పెట్టిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తెలంగాణ దేశంలో భాగమేనని, జనసేన పార్టీ తెలంగాణలో తప్పకుండా పోటీ చేస్తుందని సంచలన ప్రకటన చేశారు. అంతకుముందు జనసేన సభ ఏర్పాటు పై విమర్శలు చేసిన వారిపై పవన్ స్పందిస్తూ.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో పవన్ కు కౌంటర్ గా స్పందించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ వేదికగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ వైఖరిని తప్పుబడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పవన్ కల్యాణ్‌కు "అమిత్‌షాపై అంతగా ప్రేముంటే వెళ్లి గుజరాత్‌లో పోటీ చేయాలి" అంటూ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయినప్పటి నుంచి హైదరాబాద్‌లో ఎన్ని రోజులు ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని రోజులు గడుపుతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణను ఉద్దేశించి 'నరదిష్టి' అని పవన్ మాట్లాడటం వెనుక ఇలాంటి కారణాలే ఉండి ఉంటాయని అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినప్పుడు పవన్‌ను అమరావతిలో కలిశారా, హైదరాబాద్‌లో కలిశారా అని ప్రశ్నించిన ఆయన, తిరుపతికి వెళ్లి హుండీలో వేసిన డబ్బుల గురించి కూడా ఎవరైనా గొప్పగా చెప్పుకుంటారా అని మండిపడ్డారు.

పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్‌ను, రాజకీయాలను ముడిపెడుతూ అనిరుధ్ రెడ్డి మరికొన్ని ఘాటు విమర్శలు చేశారు. ప్రొడ్యూసర్లు ఎవరు ఎక్కువ ప్యాకేజీ ఇస్తే వాళ్ల దగ్గరికే పవన్ కళ్యాణ్ వెళ్తారని ఆరోపించారు. ఆయన నటించిన 'ఓజీ' (OG), 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయని.. ఆ సినిమాల పరాజయాల తాలూకు డిప్రెషన్ లోనే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని అనిరుధ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు సినీ వర్గాల్లోనూ తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Next Story