అణు విద్యుత్ కేంద్రాలపై దాడులు... రేడియేషన్ పై హెచ్చరికలు జారీ చేసిన IAEA

by Muthe.Rajitha |

ఇరాన్‌లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రంపై జరిగిన దాడిపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

అణు విద్యుత్ కేంద్రాలపై దాడులు... రేడియేషన్ పై హెచ్చరికలు జారీ చేసిన IAEA
X

దిశ, వెబ్ డెస్క్ : ఇరాన్‌లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం(Bushehr Nuclear Power Plant) సమీపంలో ఇటీవల ఇజ్రాయెల్-అమెరికా జరిపిన దాడులు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్నాయి. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రోసి (Rafael Mariano Grossi) ఈ పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బుషెహర్ ప్లాంట్ ఇరాన్ యొక్క ఏకైక యాక్టీవ్ అణు విద్యుత్ కేంద్రం కావడమే కాకుండా, అక్కడ భారీ మొత్తంలో అణు పదార్థాలు నిల్వ ఉన్నాయి. ఒకవేళ ఈ దాడుల వల్ల రియాక్టర్‌కు ఏదైనా నష్టం వాటిల్లితే, అది కేవలం ఇరాన్‌కే పరిమితం కాకుండా పొరుగు దేశాలకు కూడా వ్యాపించి భారీ రేడియేషన్ ప్రమాదముందని హెచ్చరించారు. యుద్ధ సమయాల్లో అణు కేంద్రాలపై దాడులు చేయడం అంతర్జాతీయ అణు భద్రతా నియమాలను (Seven Indispensable Pillars of Nuclear Safety) పూర్తిగా ఉల్లంఘించడమేనని ఆయన స్పష్టం చేశారు.

ఇటీవల ఇరాన్ అధికారికంగా IAEAకి అందించిన సమాచారం ప్రకారం.. మార్చి 17, 24 తేదీల్లో బుషెహర్ ప్లాంట్ ప్రాంగణంలో ఇజ్రాయెల్-అమెరికా దాడులు జరపగా... ఈ దాడుల్లో ప్రధాన రియాక్టర్‌కు అత్యంత చేరువలో ఒక భవనం ధ్వంసమైంది. అయితే, అదృష్టవశాత్తూ రియాక్టర్‌కు ఎటువంటి ప్రత్యక్ష నష్టం జరగలేదని, సిబ్బంది ఎవరూ గాయపడలేదని ఇరాన్ ప్రకటించింది. ప్రస్తుతం ప్లాంట్ సాధారణ స్థితిలోనే పనిచేస్తోందని, రేడియేషన్ లీకేజీ జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేవని IAEA పేర్కొంది. అయినప్పటికీ రియాక్టర్‌కు ఇంత సమీపంలో దాడులు జరగడం అనేది అత్యంత ప్రమాదకరమైన హెచ్చరికగా పరిగణిస్తోంది. ఏదైనా చిన్న పొరపాటు జరిగినా అది చెర్నోబిల్ లేదా ఫుకుషిమా వంటి భయంకరమైన అణు విపత్తులకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. కాగా రష్యా సహకారంతో నిర్మించబడిన ఈ బుషెహర్ ప్లాంట్ ఇరాన్ ఇంధన అవసరాలకు అత్యంత కీలకం. యుద్ధం కారణంగా క్షిపణులు లేదా డ్రోన్లు నేరుగా అణు రియాక్టర్‌ను తాకితే జరిగే నష్టాన్ని ఊహించడం కూడా కష్టమని చెబుతున్నారు.

Next Story