- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మట్టిని వదలను.. గుట్టలను వదలను!
అధికార పార్టీ ఆన్ వీళ్ అక్రమాలు ఆ నియోజకవర్గంలో అగాథం సృష్టిస్తున్నాయి.

దిశ,కరీంనగర్ బ్యూరో: అధికార పార్టీ ఆన్ వీళ్ అక్రమాలు ఆ నియోజకవర్గంలో అగాథం సృష్టిస్తున్నాయి. అధికారమే అవధిగా ఆ నాయకుడి సహాయకుడు బరితెగిస్తు అక్రమాలు చేస్తుంటే బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అధికారులు జీ హుజుర్ అంటు చట్టాన్ని అధికార పార్టీ నేతల చుట్టంలా మార్చేస్తున్నారు. ప్రశ్నించిన ప్రజలను పార్టి నేతలను వేధింపులకు గురి చేస్తూ అణచివేస్తున్నారు. దీంతో జనం అధికార పార్టీ నేతల ఆగడాలతో విసిగిపోతుండగా ఇదే అవకాశంగా బావిస్తున్న సదరు నాయకులు ఈ నియోజకవర్గంలో లారీ నాదే క్వారీ.. నాదే మట్టిని గుట్టలను దేన్ని వదిలేదే లేదంటు అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతూ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు.
దీంతో ఆ నియోజకవర్గంలో ప్రజలు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. కరీంనగర్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ రిజర్వుడు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల ఆగడాలు శృతిమించుతున్నాయి. అడుగడుగునా అక్రమాలకు పాల్పడుతు సహజ సంపదను కొల్లగొట్టేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మట్టి నాదే.. ప్రతి గుట్ట నాదే అన్నట్టుగా అక్రమ దందాలను సాగిస్తున్నారు. ప్రశ్నించిన ప్రజలను ప్రజా ప్రతినిధులను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు.
అంతా క్యాంపు కార్యాలయం నుంచే..
అధికార పార్టీ నేత సహాయకుడి వ్యవహర శైలితో ఆ పార్టీ క్యాడర్‌లో తీవ్ర అసంతృప్తి నెలకొనగా రాజ్యంగా బద్దంగా నడవాల్సిన ప్రభుత్వ శాఖలు నిర్వీర్యం అవుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల నుంచి అందాల్సిన సేవలు క్యాంపు కార్యాలయం నుంచి నడవడం ఆ నియోజకవర్గం పరిస్థితికి అద్దం పడుతుంది. రెవెన్యూ పోలీస్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులతో మంతనాలు జరిపి పాలన సాగించేందుకు క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక గదిని కేటాయించిన సదరు సహాయకుడు ప్రతి ఫైల్ తను ఆదేశిస్తే తప్ప కదలకూడదు అంటు అదికారులను కట్టడి చేసి పాలన సాగించడం ఇక్కడి ప్రత్యేకత పోలీసు ఫిర్యాదులైనా రెవెన్యూ దస్తావేజులైనా ఇక్కడ స్కాన్ కావాల్సిందే అని జనం బహిరంగంగా చర్చించుకుంటున్నారు. తాజాగా మార్కెట్ కమిటీలు సహకార సంఘాల పదవులకు లక్షల్లో డిమాండ్ చేసి ఖజానా నింపుకుని పదవులు కట్టబెట్టడం అధికార పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొని బహిరంగంగానే సదరు నాయకుడిపై నియోజకవర్గంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది.
ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రత్యేక పథకాన్ని ప్రారంభించిన సదరు నాయకులు ఇప్పుడు ఆ పథకాన్ని ఆదాయవనరుగా మార్చుకున్నారు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.పాలకుల మాటలు నమ్మిన ప్రజలు వారి సమస్యలన్ని వారి వెబ్ సైట్ లో విన్నవించుకున్నారు.దీన్ని అవకాశంగా తీసుకున్న సదరు నాయకులు ఎవరు డబ్బులు ఇస్తే వారికి వత్తాసు పలుకుతూ అందుకు అధికారులు పురమాయిస్తూ చట్టాన్ని సైతం చుట్టంలా మార్చేసి సెటిల్ మెంట్ దందాకు తెర లేపడం అప్పట్లో వివాదస్పదంగా మారింది.దీంతో ప్రభుత్వ అధికారులతో సెటిల్ మెంట్ కోసం క్యాంపు కార్యాలయంలో ఓ వార్ రూం ను ఏర్పాటు చేసి అక్కడే సెటిల్ మెంట్ దందా నడుస్తున్నట్టు నియోజకవర్గ ప్రజలు బాహాటంగానే చర్చిస్తుంటారు.
చట్టం తన పని తాను చేస్తుందా..?
చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని ప్రజలంతా భావించి బాధితులకు న్యాయం జరుగుతుందని ఆశతో ఎదురు చూడడం సామాన్యుని పరిపాటి. అయితే మానకొండూరు నియోజకవర్గం లో చట్టం అధికార పార్టీ నాయకులకు చుట్టంగా మారిందని, వారి కనుసైగలో నే సీఐలు, ఎస్ఐలు బ్రతుకు జీవుడా అని పనిచేస్తున్నారని నియోజకవర్గ ప్రజలు బాహాటంగా ఆరోపణలు చేస్తున్నారు. గుండ్లపల్లి మాజీ సర్పంచ్ బేతల్లి సమత భర్త రాజేందర్ రెడ్డి విషయంలో రాజేందర్ రెడ్డి బ్రిక్స్ కంపెనీ వద్దకు దుండగులు వెళ్లి మద్యం తాగి అతని పైననే దాడి చేస్తే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే దాడి చేసిన వ్యక్తులకు అధికార పార్టీ నాయకులు మద్దతు పలికి ఎస్సీ అభ్యర్థిని గొడవలో ఉన్నట్లుగా సృష్టించి ముందుగా రాజేందర్ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు అయినట్లు ప్రకటించారని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు.
రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద విధిలేని పరిస్థితుల్లో రాజకీయ నాయకుల అరాచకాలను ఓర్వలేక పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు అన్న వార్త విన్న తర్వాత దాడి చేసిన వ్యక్తుల పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారని ఆరోపణలు వినపడుతున్నాయి. అంతేకాకుండా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆత్మహత్యాయత్నం చేసినందుకు సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారని క్యాంపు కార్యాలయం పీఏ ఫిర్యాదు మేరకు చావు బతుకుల్లో ఉన్న రాజేందర్ రెడ్డి పై మరో కేసు నమోదు చేశారు తప్ప చావు బతుకుల్లో ఉన్న రాజేందర్ రెడ్డి, అతని భార్య సమత మీడియా ముఖంగా నా భర్త దుర్గతికి ఆత్మహత్యాయత్నానికి ఎమ్మెల్యే పీఏ మురళీధర్ రెడ్డి, అతని అన్న రవీందర్ రెడ్డి కారణమని గగ్గోలు పెట్టి చెప్పిన ఏమాత్రం ఖాతరు చేయకుండా వారి పైన కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికైనా బాధితుని పై దాడికి ప్రయత్నించిన వ్యక్తులతో పాటు ఆత్మహత్యాయత్నానికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.






