- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
18వ లోక్‌సభ 8వ సమావేశాలు.. పార్లమెంట్ ముందుకు 7 కీలక బిల్లులు
లోక్‌సభ తదుపరి సమావేశాల్లో 7 కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం.. ఐటీ చట్ట సవరణ, సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య పెంపు బిల్లులు సహా పలు చట్టాలు!

దిశ, వెబ్ డెస్క్: వచ్చే నెలలో 18వ లోక్‌సభ 8వ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏడు కీలక బిల్లులను పార్లమెంట్ ముందుకు తీసుకురావడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో ఐదు సరికొత్త బిల్లులు కాగా, గత సమావేశాల్లో ప్రవేశ పెట్టిన రెండు పాత బిల్లులు కూడా ఉన్నాయి. కొత్తగా ప్రవేశ పెట్టబోయే బిల్లులలో ఆదాయపు పన్ను (సవరణ) బిల్లు-2026, సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు-2026లు అత్యంత కీలకమైనవి. ఇవి రెండూ ప్రస్తుతం అమల్లో ఉన్న అత్యవసర ఆర్డినెన్స్‌ల స్థానంలో చట్టబద్ధత కోసం రానున్నాయి. వీటితో పాటు జనన మరణాల నమోదు సవరణ బిల్లు, జాతీయ గౌరవానికి భంగం కలిగించకుండా నిరోధించే సవరణ బిల్లు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి (MSME) సవరణ బిల్లులను కూడా ప్రభుత్వం సభ ఆమోదం కోసం ప్రవేశపెట్టనుంది.
ఇక గతంలోనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి పెండింగ్‌లో ఉన్న మరో రెండు బిల్లులను కూడా ఈ విడత సమావేశాల్లోనే చర్చకు తీసుకోనున్నారు. ఈ ఏడాది మార్చి 25న లోక్‌సభలో ప్రవేశపెట్టిన విదేశీ విరాళాల (నియంత్రణ) సవరణ బిల్లు-2026తో పాటు, గత ఏడాది డిసెంబర్ 15న ప్రవేశపెట్టి నిశిత పరిశీలన కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించిన 'వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు-2025'లను ఈ సెషన్‌లో ఆమోదించుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఈ కీలక బిల్లులపై ఉభయ సభల్లోనూ అధికార, ప్రతిపక్షాల మధ్య సుదీర్ఘమైన, ఉత్కంఠభరితమైన చర్చ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.






