దేశంలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. ఉగ్ర ముఠా అరెస్ట్

by Malleboina Mahesh |

గుజరాత్ ఏటీఎస్ జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధమున్న మరో ఐదుగురు ఉగ్రవాదుల అరెస్ట్ చేశారు.

దేశంలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. ఉగ్ర ముఠా అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: భారతదేశంలో భారీ పేలుళ్లకు కుట్ర చేస్తున్న ఉగ్ర కుట్రను గుజరాత్ ఏటీఎస్ (Gujarat ATS) భగ్నం చేసింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తోన్న నిషేధిత ఉగ్రవాద సంస్థ 'జైష్-ఎ-మొహమ్మద్' (JeM) నెట్‌వర్క్‌పై గురువారం గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) కొరడా ఝుళిపించింది. ఈ ఉగ్రవాద సంస్థకు చెందిన మాడ్యూల్‌పై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా గుజరాత్‌లోని పటాన్ జిల్లా సిద్ధ్‌పూర్ తాలూకా పరిధిలోని ఖాదియాల్ గ్రామంలో ఏటీఎస్ అధికారులు ముమ్మర దాడులు నిర్వహించి ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు.

ఈ నెల ప్రారంభంలో (జూలై 3న) గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో ఎనిమిది మంది జైష్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వారిని విచారించగా తేలిన వివరాల ఆధారంగానే ఈ తాజా అరెస్టులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. పట్టుబడిన నిందితులను బిలాల్ ఆబిద్ షేరా, మహమ్మద్ అయూబ్ కాడీవాలా (అలియాస్ మహ్మద్ ఖాదియాసన్), మహమ్మద్ షఫీ ముఖీ (అలియాస్ షఫీ చాపి), మహ్మద్ హసన్ కరాడియా (అలియాస్ హసన్ హైదర్ పూరి), మహ్మద్ అయూబ్ సునాసరా (అలియాస్ మహ్మద్ ఖాలీ)లుగా గుర్తించారు. నిందితుల్లో ఒకరు గతంలో టైమ్ బాంబు తయారు చేసేందుకు విఫలయత్నం చేశాడని, ప్రస్తుతం వీరిని కోర్టు జూలై 24 వరకు ఏటీఎస్ కస్టడీకి అప్పగించిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. వీరి వద్ద నుంచి బాంబు తయారీ సామాగ్రి, ఉర్దూ జిహాదీ సాహిత్యాన్ని రికవరీ చేశారు. అలాగే మరి వివరాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Next Story