Posani: ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. వారంలోనే 36 ఆఫర్లు వచ్చాయి

by Pulgam srinivas |

'నాయక్' విడుదలైన వారం రోజుల్లోనే 36 సినిమాల అవకాశాలు వచ్చాయని పోసాని కృష్ణమురళి చెప్పారు.

Posani: ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. వారంలోనే 36 ఆఫర్లు వచ్చాయి
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ కెరీర్‌కు కీలక మలుపు తీసుకొచ్చిన 'నాయక్' సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పోసాని మాట్లాడుతూ.. నా కెరీర్‌ను పూర్తిగా మార్చేసిన చిత్రాల్లో 'నాయక్' మొదటి స్థానంలో ఉంటుంది. ఆ సినిమాకు వి.వి. వినాయక్ దర్శకత్వం వహించారు. ఆయనంటే నాకు ఎంతో అభిమానం. నేను ఆయనను ప్రేమగా 'వినయ్' అని పిలుస్తాను. ఆయన నన్ను 'మురళి' అని పిలుస్తారు.

ఒకసారి నేను మరో సినిమా షూటింగ్ కోసం ప్రయాణిస్తుండగా వినయ్ ఫోన్ చేసి 'రామ్ చరణ్ హీరోగా 'నాయక్' సినిమా చేస్తున్నాను. అందులో మీ కోసం మంచి కామెడీ పాత్ర ఉంది. మూడు రోజులు డేట్స్ అడ్జస్ట్ చేయగలరా?' అని అడిగారు. నేను వెంటనే అంగీకరించాను. మొదటి రోజు షూటింగ్‌లోనే నా డైలాగ్‌లకు యూనిట్ మొత్తం పగలబడి నవ్వింది. ఆ రోజు షూటింగ్ పూర్తయ్యాక మరుసటి రోజు వినయ్ వచ్చి 'మీ సన్నివేశాలకు అందరూ అద్భుతంగా స్పందిస్తున్నారు. మీ పాత్రను మరింత పెంచుదాం' అన్నారు.

అలా మూడు రోజుల పాత్ర కాస్త 17 నుంచి 18 రోజుల షూటింగ్‌గా మారింది. అంతేకాకుండా సినిమా విడుదలకు ముందు చిరంజీవి తన సన్నివేశాలు చూసి ఎంతో నవ్వారని, ఒక్క సీన్ కూడా కట్ చేయొద్దు అని దర్శకుడు వినాయక్‌కు సూచించారని పోసాని చెప్పారు. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి తన పాత్రకు అద్భుతమైన స్పందన వచ్చిందని, విడుదలైన వారం రోజుల్లోనే ఏకంగా 36 సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయని పోసాని కృష్ణమురళి తెలిపారు. 'నాయక్' తన సినీ ప్రయాణంలో అత్యంత కీలకమైన చిత్రంగా ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆయన పేర్కొన్నారు.

Next Story