ఏ క్షణంలోనైనా ఆకస్మిక తనిఖీలు చేస్తా.. ఎమ్మెల్యే మందుల సామెల్

by Batti.Sumithra |

ఏ క్షణంలోనైనా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని, ఆ తనిఖీల్లో ఏవైనా పొరపాట్లు జరిగినట్లు తేలితే అందుకు పూర్తిగా సంబంధిత సిబ్బందినే బాధ్యులను చేస్తానని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఎస్టీ బాలికల గురుకుల కళాశాల సిబ్బందిని హెచ్చరించారు.

ఏ క్షణంలోనైనా ఆకస్మిక తనిఖీలు చేస్తా.. ఎమ్మెల్యే మందుల సామెల్
X

దిశ, తుంగతుర్తి: ఏ క్షణంలోనైనా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని, ఆ తనిఖీల్లో ఏవైనా పొరపాట్లు జరిగినట్లు తేలితే అందుకు పూర్తిగా సంబంధిత సిబ్బందినే బాధ్యులను చేస్తానని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఎస్టీ బాలికల గురుకుల కళాశాల సిబ్బందిని హెచ్చరించారు. నియోజకవర్గ కేంద్రం తుంగతుర్తిలోని ఎస్టీ బాలికల గురుకుల కళాశాలలో ఆర్‌టీఐసీఎల్‌ఈ–275(1) పథకం కింద రూ.4 కోట్ల నిధులతో నిర్మించనున్న అదనపు వసతిగృహం, వంటగది-కమ్-డైనింగ్ హాల్, టాయిలెట్ బ్లాక్ నిర్మాణ పనులకు ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. దేశంలో ఎవరికి దక్కని గౌరవం ఉపాధ్యాయులకే దక్కుతుందన్నారు.

ఉత్తమ ఉపాధ్యాయులు విద్యార్థుల జీవితాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. కళాశాలలో ఖాళీగా ఉన్న ఆరు లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం కమిషనర్‌ను, అవసరమైతే ముఖ్యమంత్రిని కూడా కలుస్తానని హామీ ఇచ్చారు. పదో తరగతిలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులకు రూ.50 వేల నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు. త్వరలోనే నియోజకవర్గంలోని అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలకు చెందిన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. అలాగే, తుంగతుర్తిలో త్వరలోనే ఐటీఐ కళాశాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఆర్‌సీఓ జాను నాయక్, కళాశాల ప్రిన్సిపాల్ అరుణకుమారి, డీఎస్పీ ప్రసన్నకుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, ఎఫ్‌ఎస్‌సీఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు రేగటి రవి, మల్లారెడ్డి, సుంకరి జనార్ధన్, గ్రామ సర్పంచ్ మల్లెపాక సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.

Next Story