- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్పొరేట్‌కు కన్కల్ చెక్..!
అది తెల్లవారుజామున ఆరు గంటలు.. సాధారణంగా ఏ పల్లెటూర్లోనైనా రంగురంగుల ప్రైవేట్ స్కూల్ బస్సులు ఊళ్లోకి సైరన్లు ఊదుకుంటూ వస్తుంటాయి.

దిశ, తాడ్వాయి : అది తెల్లవారుజామున ఆరు గంటలు.. సాధారణంగా ఏ పల్లెటూర్లోనైనా రంగురంగుల ప్రైవేట్ స్కూల్ బస్సులు ఊళ్లోకి సైరన్లు ఊదుకుంటూ వస్తుంటాయి. తమ పిల్లలను కార్పొరేట్ చదువుల కోసమంటూ పట్నానికి పంపేందుకు తల్లిదండ్రులు రోడ్ల పై క్యూ కడతారు. కానీ, కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కన్కల్ గ్రామంలో ఈ విద్యాసంవత్సరం సీన్ రివర్స్ అయింది. మా ఊరి పొలిమేర దాటి ఒక్క ప్రైవేట్ బస్సు కూడా లోపలికి రావడానికి వీల్లేదు.. మేము మా పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపం.. మా పిల్లలు మా ఊరి ప్రభుత్వ బడిలోనే చదువుకుంటారు అంటూ కన్కల్ గ్రామస్తులు అందరూ ఒక చోట చేరి ముక్తకంఠంతో చాటిచెప్పారు.
ప్రైవేట్ బస్సుల వత్తాసు.. పీఎస్ వరకు రగడ..
గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామస్తుల సహకారంతో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తుంటే, ఈ విప్లవాత్మక నిర్ణయాన్ని కొందరు జీర్ణించుకోలేకపోయారని గ్రామస్తులు ఆరోపించారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు వత్తాసు పలుకుతూ ఈ మంచి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని కొందరు ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో గ్రామస్తుల నిర్ణయాన్ని తప్పుపడుతూ పోలీసులకు ఫిర్యాదు చేయడం పై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎవరికీ భయపడేది లేదు... సర్పంచ్, ఉప సర్పంచ్
పోలీస్ స్టేషన్ రగడ పై గ్రామస్తులందరూ కలిసి నిర్వహించిన గ్రామసభలో సర్పంచ్, ఉప సర్పంచ్‌లు పార్టీలకు అతీతంగా అందరు ముందుకు వచ్చి ఘాటుగా స్పందించారు. మా ఊరి పిల్లల భవిష్యత్తు కోసం, ప్రభుత్వ బడిని బతికించుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇందులో ఎవరి స్వలాభం లేదు. ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టినప్పుడు వెనకడుగు వేసే ప్రసక్తే లేదు.. మా మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే గ్రామస్తులందరి మీద ఫిర్యాదు చేసినట్లేనని ఉపసర్పంచ్ ఆరోపించారు. ఎవరికీ భయపడేది లేదు అనివారు స్పష్టం చేశారు. ప్రైవేట్ శక్తులు ఎన్ని కుట్రలు చేసినా గ్రామస్తులంతా ఒకే తాటిపై ఉండి ఊరి బడిని కాపాడుకుంటామని భీష్మించుకు కూర్చున్నారు.
కలెక్టర్ మెట్లెక్కిన కన్కల్.. చైతన్యం మరింత రెట్టింపు
గ్రామస్తులందరూ ముక్తకంఠంతో తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని గ్రామానికి చెందిన ఒకరిద్దరు వ్యతిరేకించారు. ఊళ్లోకి ప్రైవేట్ బస్సులు రావాల్సిందేనని వారు పట్టుబట్టడంతో గ్రామంలో చిన్నపాటి ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే, దీనికి ఏమాత్రం వెనకడుగు వేయని గ్రామస్తులు..సోమవారం నాడు ముకుమ్మడిగా వెళ్లి జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ప్రైవేట్ వత్తాసుదారులు చేస్తున్న ప్రయత్నాలను కలెక్టర్‌కు వివరించి, తమ ఊరి బడిని తామే బాగుచేసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసుకోవడం నేరమా..? అని గ్రామస్తులు ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఈ పరిణామంతో కన్కల్ గ్రామస్తుల్లో చైతన్యం మరింత రెట్టింపైంది.
ఛాలెంజ్‌గా తీసుకున్నాం... రికార్డు సృష్టిస్తాం..!
ప్రైవేట్ పాఠశాలల మాయలో పడి ఏటా వేలకు వేలు ఫీజులు కడుతూ, అప్పులపాలు కావడం కంటే.. మన ఊరి బడిని మనమే ఎందుకు బాగు చేసుకోకూడదు..? అనే ఆలోచన కన్కల్ గ్రామస్తుల్లో చైతన్యాన్ని రగిల్చింది. ఊరి పెద్దల నుంచి యువకుల దాకా అందరూ నడుం బిగించి, ఈ అకడమిక్ ఇయర్ లోనే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను రికార్డు స్థాయిలో పెంచేసి చూపెట్టారు.
వైద్యంలోనూ ఇలాంటి చైతన్యం రావాలి... నిరుపేదల ఆవేదన
విద్యలో కన్కల్ గ్రామం సాధించిన ఈ మార్పు పై జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే ఈ సందర్భంగా కొందరు గ్రామస్తులు వారి ఆవేదనను పంచుకున్నారు. చదువు కోసం ప్రైవేట్ స్కూళ్లను ఎలాగైతే కాదనుకున్నామో.. రేపు పొద్దున రోగం వస్తే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా, మన ప్రభుత్వ ఆసుపత్రులనే బలోపేతం చేసుకునే రోజు రావాలని ఆకాంక్షించారు. వైద్యంలోనూ ప్రజల్లో ఇలాంటి చైతన్యమే వస్తే.. నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు కార్పొరేట్ దోపిడీ నుంచి శాశ్వత విముక్తి దొరుకుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.






