- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆకతాయిల ఆగడాలు.. జెడ్పీ ఉన్నత పాఠశాలలో భయాందోళన
పీఏపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని ఆకతాయిలు విధ్వంసానికి పాల్పడ్డారు.

దిశ, పెద్ద అడిశర్లపల్లి : పీఏపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని ఆకతాయిలు విధ్వంసానికి పాల్పడ్డారు. ఏడో తరగతి గది కిటికీలను పగులగొట్టి తరగతి గదిలోకి ప్రవేశించిన వారు విద్యుత్ ఎలక్ట్రికల్ బోర్డులను ధ్వంసం చేసి, విద్యార్థుల పాఠ్యపుస్తకాలను ఎత్తుకెళ్లినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ తెలిపారు. అంతేకాకుండా, తరగతి గదులు, పాఠశాల వరండాలో మూత్ర విసర్జన చేసి అసహ్యకర పరిస్థితులు సృష్టించారు. ప్రధానోపాధ్యాయుల గది తాళాన్ని పగులగొట్టేందుకు ప్రయత్నించినప్పటికీ అది సాధ్యంకాకపోవడంతో గదిలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేసేందుకు యత్నించినట్లు తెలిపారు. సోమవారం ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ ఘటనను చూసి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పాఠశాల ఆవరణ, వరండా అంతా మూత్ర విసర్జనతో దుర్వాసన వెదజల్లుతుండటంతో విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ ఘటన పై ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ గుడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాఠశాలలో విధ్వంసానికి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టి ప్రభుత్వ పాఠశాలలకు భద్రత కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.






