- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) పోస్టుల భర్తీని వెంటనే పూర్తి చేయాలి : HRDA
తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నియామక ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని HRDA రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలోని సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) పోస్టుల నియామక ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం అసోసియేషన్ ప్రతినిధులు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతిపత్రాన్ని సమర్పించారు. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఎంహెచ్ఎస్ఆర్బీ) ద్వారా 1,623 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) పోస్టుల భర్తీకి 2025 ఆగస్టు 22న నోటిఫికేషన్ (నెం. 04/2025) విడుదల చేసినట్లు హెచ్ఆర్డీఏ తెలిపింది. అందులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ 7న 692 పోస్టులకు నియామక ఉత్తర్వులు ఇచ్చారని, అయితే మిగిలిన 931 పోస్టుల భర్తీ ప్రక్రియ గత కొన్ని నెలలుగా పూర్తిగా నిలిచిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన అభ్యర్థులను ఇప్పటివరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు కూడా పిలవకపోవడం వల్ల వేలాది మంది వైద్యులు దాదాపు ఏడాది కాలంగా తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. ఈ జాప్యం వల్ల పీజీ పూర్తి చేసుకుని ప్రభుత్వ సేవల్లోకి రావాలనుకుంటున్న యువ వైద్యులు తీవ్ర మానసిక, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అసోసియేషన్ తెలిపింది. మరోవైపు టీవీవీపీ ఆసుపత్రుల్లో వందలాది స్పెషలిస్ట్ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు సకాలంలో ప్రత్యేక వైద్య సేవలు అందడం లేదని, ఉన్న వైద్యులపై కూడా పనిభారం పెరుగుతోందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని, ఎలాంటి ఆలస్యం లేకుండా మిగిలిన 931 పోస్టుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని, అర్హులైన వైద్యులకు త్వరగా నియామక పత్రాలు అందజేయాలని హెచ్ఆర్డీఏ ప్రతినిధులు కోరారు.






