Apple: యాపిల్ కీలక నిర్ణయం

by S Gopi |

ప్రస్తుతం ఈ ఫీచర్‌ను కొద్దిమంది వినియోగదారులతో పరీక్షిస్తుండగా, రాబోయే కొన్ని నెలల్లో అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.

Apple: యాపిల్ కీలక నిర్ణయం
X

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో యాప్ స్టోర్, ఐక్లౌడ్ సేవల కోసం మళ్లీ క్రెడిట్, డెబిట్ కార్డులతో చెల్లింపులు చేసే అవకాశం కల్పించేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత ఈ సౌకర్యాన్ని కంపెనీ తిరిగి ప్రారంభించింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను కొద్దిమంది వినియోగదారులతో పరీక్షిస్తుండగా, రాబోయే కొన్ని నెలల్లో అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. 2021లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కార్డ్ టోకనైజేషన్ నిబంధనలు అమల్లోకి రావడంతో యాపిల్ భారత్‌లో కార్డ్ పేమెంట్స్‌ను నిలిపివేసింది. అప్పటి నుంచి యాప్ స్టోర్ కొనుగోళ్లు, ఐక్లౌడ్ సబ్‌స్క్రిప్షన్లకు వినియోగదారులు యూపీఐ లేదా నెట్‌బ్యాంకింగ్ ద్వారానే చెల్లింపులు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆర్‌బీఐ నిబంధనలకు అనుగుణంగా మార్పులు పూర్తి చేయడంతో కార్డ్ పేమెంట్స్‌ను తిరిగి ప్రారంభించినట్లు సమాచారం.

ఆర్‌బీఐ టోకనైజేషన్ నిబంధనల ప్రకారం, వ్యాపార సంస్థలు వినియోగదారుల అసలు కార్డ్ వివరాలను తమ సర్వర్లలో నిల్వ చేయకూడదు. వాటి స్థానంలో టోకనైజ్డ్ డేటా మాత్రమే ఉపయోగించాలి. అలాగే భారత వినియోగదారులకు సంబంధించిన ఈ డేటా భారత్‌లోనే నిల్వ ఉండాలి. ఈ నిబంధనలకు అనుగుణంగా యాపిల్ తన చెల్లింపుల వ్యవస్థను మార్చినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా టోకనైజ్డ్ డేటాను అమెరికా, డెన్మార్క్, చైనా సర్వర్లలో నిల్వ చేస్తున్నప్పటికీ, భారత వినియోగదారుల డేటాను విదేశీ సర్వర్లలో మిర్రర్ చేయడం లేదని నివేదిక పేర్కొంది. ఇదే సమయంలో, భారత్‌లో యాపిల్ పే సేవలను ప్రారంభించేందుకు కూడా యాపిల్ బ్యాంకులు, కార్డ్ నెట్‌వర్క్‌లతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. దీంతో రాబోయే రోజుల్లో దేశీయ యాపిల్ వినియోగదారులకు చెల్లింపుల విషయంలో మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Next Story