- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రాణం విలువ కేవలం రూ.6 లక్షలా..?
పాల్వంచ మండలం మొండికట్ట (సత్యనారాయణపురం) గ్రామ పంచాయతీ పరిధిలో 17 ఏళ్ల ఆదివాసీ బాలుడు కొరం నాగచైతన్య మృతి ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది.

దిశ:పాల్వంచ టౌన్; పాల్వంచ మండలం మొండికట్ట (సత్యనారాయణపురం) గ్రామ పంచాయతీ పరిధిలో 17 ఏళ్ల ఆదివాసీ బాలుడు కొరం నాగచైతన్య మృతి ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. టేకులపల్లి మండలం కూనారం గ్రామానికి చెందిన నాగచైతన్యను విద్యుత్ మరమ్మతుల పనుల కోసం తీసుకువచ్చి విద్యుత్ స్తంభం ఎక్కించి పని చేయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోపణల ప్రకారం, విద్యుత్ సరఫరా నిలిపివేయడానికి తప్పనిసరిగా తీసుకోవాల్సిన లైన్ క్లియరెన్స్ (ఎల్‌సీ) తీసుకోకుండానే పనులు చేపట్టడంతో విద్యుత్ షాక్ తగిలి నాగచైతన్య స్తంభంపై నుంచి కిందపడిపోయి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మైనర్ బాలుడితో ఇంత ప్రమాదకరమైన విద్యుత్ పనులు చేయించడం ఎలా జరిగిందన్న ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనను గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు పరిస్థితిని మరింత వివాదాస్పదంగా మార్చాయి. బాధిత కుటుంబం తీవ్ర పేదరికంలో ఉండటాన్ని ఆసరాగా చేసుకుని రూ.6 లక్షలు ఇచ్చి రాజీకి ప్రయత్నించారనే ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.ఒక నిండు ప్రాణానికి కేవలం రూ.6 లక్షలే విలువా..? నామమాత్రంగా నమోదు పేద ఆదివాసీ కుటుంబం కాబట్టే న్యాయానికి ధర కట్టారా..? అంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు, కిన్నెరసాని సబ్‌స్టేషన్‌లో ఆర్టీసన్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తే కాంట్రాక్టు పనులు కూడా నిర్వహిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే వ్యక్తి కాంట్రాక్టు పనులు ఎలా చేపడుతున్నాడు? దీనికి ఉన్నతాధికారుల అనుమతి ఉందా? లేక తెలిసీ చూసీచూడనట్లు వ్యవహరించారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇదిలా ఉంటే, ప్రమాదంపై వివరణ కోరినప్పుడు సంబంధిత అధికారులు “మాకు సంబంధం లేదు… పని కాంట్రాక్టర్‌కు అప్పగించాం… అతనే చూసుకుంటాడు” అని చెప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే ఇప్పుడు మరిన్ని ప్రశ్నలకు దారితీస్తోంది. పని అప్పగించింది అధికారులే కాదా..? పని జరిగే సమయంలో పర్యవేక్షించాల్సింది అధికారులే కాదా..? భద్రతా నిబంధనలు అమలవుతున్నాయా లేదా అనేది చూసే బాధ్యత ఎవరిది..? ఎల్‌సీ తీసుకోకుండా పనులు జరిగి ఉంటే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు..? మైనర్ బాలుడిని ప్రమాదకరమైన విద్యుత్ పనిలోకి దింపితే ప్రశ్నించాల్సింది ఎవరు..? ప్రమాదం జరగకుండా నిరోధించాల్సిన వ్యవస్థ ఎక్కడ విఫలమైంది..? అంటూ ప్రజలు నిలదీస్తున్నారు. పని అప్పగించే సమయంలో అధికారులు ఉంటారు… ప్రమాదం జరిగిన తర్వాత మాత్రం “మాకు సంబంధం లేదు” అని చెప్పడం ద్వారా బాధ్యత నుంచి తప్పించుకోవచ్చా..? ఒక ప్రభుత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే పనుల్లో ప్రాణాలు పోతే మొత్తం బాధ్యత కాంట్రాక్టర్‌పైనే వేసి అధికారులు చేతులు దులుపుకుంటే ప్రజలు నమ్మాలా..? అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
చట్టం పేదలకోసమేనా..? అధికారులకు ఒక న్యాయం… సామాన్యులకు మరో న్యాయమా..? ఒక ఆదివాసీ కుటుంబం కాబట్టే ఈ ఘటనను డబ్బుతో ముగించాలని చూశారా..? ప్రాణం పోయిన తర్వాత పరిహారం పేరుతో బాధ్యత నుంచి తప్పించుకోవడం సాధ్యమేనా..? అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, మైనర్ బాలుడిని ప్రమాదకరమైన విద్యుత్ పనిలోకి దింపిన వారిపై, భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై, విధుల్లో నిర్లక్ష్యానికి పాల్పడిన అధికారులు, కాంట్రాక్టర్లు ఎవరైనా సరే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజా సంఘాలు, ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఇప్పుడు అందరి దృష్టి ఉన్నతాధికారుల వైపే ఉంది. వినిపిస్తున్న ఆరోపణలను ఎంత సీరియస్‌గా తీసుకుంటారు? సమగ్ర విచారణకు ఆదేశిస్తారా? బాధ్యులు ఎవరైనా సరే చట్టం ముందు నిలబెడతారా? లేక ఈ ఘటన కూడా కాలగర్భంలో కలిసిపోతుందా? ఒక అమాయక ఆదివాసీ బాలుడి కుటుంబానికి నిజమైన న్యాయం జరుగుతుందా? లేక పరిహారం పేరుతో ఈ వ్యవహారం ముగిసిపోతుందా? అనే ప్రశ్నలు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే, ఈ ఘటనకు సంబంధించి వినిపిస్తున్న ఆరోపణలపై సంబంధిత అధికారులు ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఆరోపణల నిజానిజాలు అధికారిక విచారణలో తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయా? లేక ఈ ఘటన కూడా మరుగున పడిపోతుందా? అనేది వేచి చూడాల్సి ఉంది.
ఈ ఘటనపై సంబంధిత ఏఈని వివరణ కోరగా, “ఆ పనిని కాంట్రాక్టర్ సురేష్‌కు అప్పగించాం. పనికి సంబంధించిన నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలు పూర్తిగా కాంట్రాక్టర్‌వే. శాఖకు ఈ వ్యవహారంతో ప్రత్యక్ష సంబంధం లేదు. కాంట్రాక్టర్‌నే అన్ని విషయాలు చూసుకుంటారు” అని తెలిపారు.






