కేసీఆర్ అసెంబ్లీకి రావాలి- కాళేశ్వ‌రంపై వివ‌ర‌ణ ఇవ్వాలి

by Taduka Kalyani |

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, దాని నాణ్యత, ఇందిరమ్మ ఇళ్ల అమలుపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రజలకు సమాధానం చెప్పాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు.

కేసీఆర్ అసెంబ్లీకి రావాలి- కాళేశ్వ‌రంపై వివ‌ర‌ణ ఇవ్వాలి
X

దిశ, ములుగు : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, దాని నాణ్యత, ఇందిరమ్మ ఇళ్ల అమలుపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రజలకు సమాధానం చెప్పాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ తేదీ, సమయం సూచిస్తే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి కాళేశ్వరం, ఇందిరమ్మ ఇళ్లతో పాటు ప్రజా సమస్యలపై బహిరంగ చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సోమవారం సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రాజెక్టు కుంగిపోవడం కూడా వారి పాలనలోనే జరిగిందని గుర్తుచేశారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రాజెక్టు నాణ్యతపై ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా అప్పటి ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ వేలాది పేద కుటుంబాలు గృహాల కోసం ఎదురుచూస్తున్నాయని, వారికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. తొలి విడతలో లక్షా 30 వేలకు పైగా ఇళ్ల గృహప్రవేశాలు పూర్తయ్యాయని, మరో 70 నుంచి 75 వేల ఇళ్లు నిర్మాణ చివరి దశలో ఉన్నాయని చెప్పారు. రెండో విడతలో రెండున్నర లక్షల ఇళ్ల మంజూరుతో ప్రతి నియోజకవర్గంలో రెండు వేల ఇళ్లు నిర్మించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. గతంలో అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లను కూడా పూర్తి చేసేందుకు నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. మహిళల సాధికారతకు ప్రాధాన్యమిస్తూ ఆడబిడ్డల పేరుతో ఇళ్ల పట్టాలు అందజేస్తున్నామని, కులం, మతం, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గృహ వసతి కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Next Story