వాట్సాప్ ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌కు కేంద్రం బ్రేక్.. భారత్‌లో ప్రస్తుతానికి నో ఎంట్రీ!

by Naga Rani Yarlagadda |

ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ ఫారమ్ వాట్సాప్ తీసుకురావాలనుకున్న యూజర్ నేమ్ ఫీచర్ పై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

వాట్సాప్ ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌కు కేంద్రం బ్రేక్.. భారత్‌లో ప్రస్తుతానికి నో ఎంట్రీ!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ ఫారమ్ వాట్సాప్ తీసుకురావాలనుకున్న యూజర్ నేమ్ ఫీచర్ పై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వివాదాస్పద ఫీచర్ పై స్పందించేందుకు వాట్సప్ మాతృసంస్థ మెటా కు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ మరో మూడురోజులు అదనపు గడువు ఇచ్చింది. అయితే.. ఈ ఫీచర్ పై ప్రభుత్వంతో చర్చలు పూర్తిగా ముగిసేంతవరకూ భారత్ లోకి అందుబాటులోకి తీసుకురాబోమని మెటా ప్రతినిధులు స్పష్టం చేశారు.

యూజర్ నేమ్ ఫీచర్ పై ఎందుకంత ఆందోళన?

ప్రస్తుతం వాట్సాప్ లో ఒకరితో ఒకరు చాట్ చేయాలంటే ఫోన్ నంబర్ తప్పనిసరి. అయితే వాట్సప్.. ఈ ఫోన్ నంబర్ అవసరం లేకుండా యూజర్ నేమ్ ద్వారా చాట్ చేసేలా కొత్త ఫీచర్ ను డిజైన్ చేసింది. దీనివల్ల ఆన్లైన్ మోసాలు, ఫిషింగ్, డిజిటల్ అరెస్ట్ స్కాములు, ఒకరిపేరుతో మరొకరు చలామణి అయ్యే ముప్పు విపరీతంగా పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐటీ చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని కేంద్రం మెటాకు నోటీసులు జారీ చేసింది.

దీనిపై వాట్సప్ వివరణ ఇస్తూ.. ఈ ఫీచర్ ను ఇంకా లైవ్ చేయలేదంది. సైబర్ నేరాలను అడ్డుకునేందుకు బలమైన భద్రతా వలయాలను ఏర్పాటు చేస్తున్నామని వాట్సప్ ప్రతినిధి వెల్లడించారు. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ సంస్థల పేర్లతో నకిలీ ఐడీలు క్రియేట్ చేయకుండా.. ఆయా పేర్లను ముందే హోల్డ్ లో ఉంచినట్లు తెలిపారు. అలాగే ఇందులో లిమిటెడ్ సెర్చ్ ఉంటుందని, ఒకరి యూజర్ నేమ్ పూర్తిగా తెలిస్తేనే మెసేజ్ చేయగలరని, ఊహాజనితంగా పేర్లను టైప్ చేసి వెతికే ప్రయత్నాలను సిస్టమ్ బ్లాక్ చేస్తుందని పేర్కొన్నారు. ఎవరైనా కొత్త వ్యక్తి యూజర్‌నేమ్ ద్వారా మొదటిసారి మెసేజ్ చేస్తే.. ఆ అకౌంట్ ఎప్పుడు క్రియేట్ అయింది? వారు ఏ దేశానికి చెందినవారు? మనతో ఏవైనా మ్యూచువల్ గ్రూప్స్ ఉన్నాయా? అనే వివరాలను వాట్సాప్ యూజర్‌కు చూపిస్తుందని వివరించారు.

టెలిగ్రామ్, సిగ్నల్‌ యాప్‌లకు కూడా నోటీసులు!

కేవలం వాట్సాప్ మాత్రమే కాదు.. ఇప్పటికే యూజర్‌నేమ్ ఫీచర్‌ను రన్ చేస్తున్న టెలిగ్రామ్ (Telegram), సిగ్నల్ (Signal) యాప్‌లకు కూడా కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు పంపింది. ఈ ఫీచర్ల ద్వారా జరుగుతున్న మోసాలను, నకిలీ అకౌంట్లను ఎలా అరికడుతున్నారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీనితో పాటు, పైరసీ కంటెంట్‌ను వ్యాప్తి చేస్తున్నందుకు టెలిగ్రామ్‌కు, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్‌లో చైల్డ్ అబ్యూస్ మెటీరియల్‌పై మెటాకు కేంద్రం శనివారం (జులై 4) తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Next Story