- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ. 1511 కోట్ల విలువైన భూమికి హైడ్రా ఫెన్సింగ్
ఆక్రమణలను హైడ్రా సీరియస్‌గా పరిగణిస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో : ఆక్రమణలను హైడ్రా సీరియస్‌గా పరిగణిస్తోంది. పార్కులు, చెరువులను చెరపట్టిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. మంగళవారం ఒకే రోజు నగరం నలువైపులా భారీ ఆపరేషన్ నిర్వహించి ఆక్రమణలను తొలగించింది. వెనువెంటనే ఫెన్సింగ్ వేసింది. రెండు చోట్ల 1100ల గజాల మేర ఉన్నపార్కులను కాపాడగా.. మరో రెండు ప్రాంతాల్లో 12ఎకరాల మేర చెరువుల ఎఫ్‌టీఎల్ ప్రాంతాలను హైడ్రా రక్షించింది. ఇలా కాపాడిన భూమి విలువ సుమారుగా రూ. 1511ల కోట్ల వరకూ ఉంటుందని అంచనా.
కొండాపూర్‌లో చెరువును…
శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం - మదీనాగూడ రోడ్డు మార్గం కొండాపూర్‌లో రూ. 700 కోట్ల విలువైన భూమిని హైడ్రా మంగళవారం కాపాడింది. 4 ఎకరాల జంగం కుంటను పూడ్చేసి.. మట్టితో చదును చేసి ప్లాట్లుగా విక్రయించేందుకు సిద్ధమైన కబ్జాదారుల ఆట కట్టించింది. ఇటీవల మీడియాలో వచ్చిన కథనాల మేరకు రెవెన్యూ అధికారులతో హైడ్రా జాయింట్ ఇన్‌స్పెక్షన్ చేసింది. జంగం కుంటగా హైడ్రా నిర్ధారించుకుంది. కబ్జా చేసిన వారిపై రెవెన్యూ అధికారులు కేసులు కూడా పెట్టారు. హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ ఆదేశాల మేరకు మంగళవారం ఫెన్సింగ్ వేసింది.
అల్వాల్ కొత్త చెరువులో ఆక్రమణల తొలగింపు..
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలంలోని అల్వాల్ కొత్త చెరువు 8 ఎకరాల మేర ఆక్రమణలను హైడ్రా తొలగించింది. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ప్లాస్టిక్ కంప్రెసివ్ యూనిట్, ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ కార్యకలాపాలు నిర్వహిస్తూ చెరువును కలుషితం చేస్తున్నారని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అలాగే అక్కడ పని వారికోసం తాత్కాలిక షెడ్డులు వేసి వ్యర్థాలన్నీ చెరువులోకి వదులుతున్నారని పేర్కొన్నారు. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోని టెంటు సామగ్రీకి చెందిన 4 షట్టర్లు కూడా వేసినట్టు ఫిర్యాదు చేశారు. హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి చెరువు ఆక్రమణలను నిర్ధారించుకున్నారు. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఎలాంటి కట్టడాలు, నిర్మాణాలు చేయరాదనే నిబంధన పట్టకుండా ఏర్పాటు చేసిన షెడ్డులను హైడ్రా తొలగించింది.
1100ల గజాల మేర పార్కులను..
రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం సాహేబ్‌నగర్ కలాన్‌లోని జక్కిడినగర్ కాలనీలో 650 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది. సర్వే నంబరు 132, 133లో 1982లో 12 ఎకరాల మేర దాదాపు 161ప్లాట్లతో జక్కిడి కుటుంబ సభ్యలు లే ఔట్ వేశారు. ఇందులో 650 మేర పార్కుకోసం కేటాయించారు. 1985లోనే దీనిని ప్లాట్లుగా చేసి లే ఔట్ వేసిన వారే అమ్మేశారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈమేరకు ప్రహరీతో పాటు.. రెండు షెడ్డులు నిర్మించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు మేరకు క్షేత్రస్థాయిలో హైడ్రా పరిశీలించి పార్కు స్థలంగా నిర్ధారించింది.
ఈ మేరకు మంగళవారం ఆక్రమణలు తొలగించి.. పార్కు చుట్టూ ఫెన్సింగ్ వేసింది. పార్కు స్థలంగా పేర్కంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. మల్కాజిగిరి జోన్, మౌలాలి సర్కిల్ పరిధిలోని కాకతీయ నగర్‌లో రాథాకృష్ణ హౌసింగ్ కాలనీలో 450 గజాల పార్కును హైడ్రా కాపాడింది. జీహెచ్ఎంసీకి గిఫ్ట్ డీడ్‌గా ఇచ్చిన ఈ పార్కు స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన ప్రహరీతో పాటు.. రేకుల షెడ్డును హైడ్రా మంగళవారం తొలగించింది.
- Tags
- HYDRAA






