- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ పోలీసుల వ్యూహాత్మక రక్షణ చర్యలు.. కామన్ మ్యాన్ సేఫ్టీ కోసం రంగంలోకి ‘సెవెన్ వింగ్స్’!
హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో సామాన్యుడికి రక్షణ కవచంలా ఇప్పుడు 7 అస్త్రాలు నిరంతరం పని చేస్తున్నాయి.

దిశ, సిటీ క్రైమ్: హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో సామాన్యుడికి రక్షణ కవచంలా ఇప్పుడు 7 అస్త్రాలు నిరంతరం పని చేస్తున్నాయి. ఒక వైపు క్రైమ్ అండ్ క్రిమినల్స్ ను కంట్రోల్ చేసే రూపొందించిన 7 స్పెషల్ వింగ్స్ ఇప్పుడు కామన్ మ్యాన్‌కు సెక్యూరిటీగా నిలబడుతున్నాయి. ఈ స్పెషల్ వింగ్స్ అవగాహనను పెంచడంతో పాటు మోసాల బారిన పడకుండా జాగ్రత్తలు చెబుతూనే క్రైమ్ నివారణకు సహాయపడుతున్నాయి. సైబర్ క్రైం నుంచి మొదలు పెడితే ఆటంకాలు లేకుండా పోలీసుల సేవలు అందే వరకు ఈ వింగ్స్ పోలీసులు, పౌరుల మధ్య వారధిగా నిలబడుతున్నాయి. ముఖ్యంగా మహిళల భద్రతకు సంబంధించి కూడా ఈ వింగ్స్ కొండంత భరోసాను ఇస్తున్నాయి. ఫిర్యాదుకు కూడా ఆలస్యం జరగకుండా సాధారణ పౌరుడికి గందరగోళం లేకుండా చేస్తున్నాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆలోచన నుంచి పుట్టిన ఈ వింగ్స్ ఇప్పుడు ప్రతి పౌరుడికి ఒక క్లిక్ తో పోలీసుల సేవలు పొందేలా చేస్తున్నాయి.
సీ మిత్ర..
సైబర్ బాధితులకు వేగంగా పోలీస్ సేవలు అందించేందుకు ఏఐ టెక్నాలజీతో దేశంలోనే తొలిసారిగా సీ మిత్ర పేరుతో వర్చువల్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ ద్వారా బాధితులు పోలీసు స్టేషన్ కు తిరగకుండా ఇంటినుంచే ఫిర్యాదు నమోదు చేసే ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వర్చువల్ ఆఫీసర్ సేవల ద్వారా ఇప్పటి వరకు 1350 జీరో ఎఫ్ఐఆర్ లను నమోదు చేశారు. ఈ ప్రక్రియతో బాధితులకు వేగవంతంగా పోలీసుల సేవలు అందుతున్నాయి.
సైబర్ సింబా..
సైబర్ మోసాల నుంచి ప్రజలను కాపాడి సైబర్ క్రైం ఫ్రీ హైదరాబాద్ గా మార్చేందుకు జాగ్రుత్ హైదరాబాద్-సురక్షిత్ హైదరాబాద్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సైబర్ సింబాలుగా వలంటీర్లను నియమించి వారికి ప్రత్యేక శిక్షణను ఇస్తున్నారు. ప్రతి శనివారం ఈ సైబర్ సింబ వాలంటీర్లు సైబర్ మోసాల పై అవగాహన పెంచుతూ సైబర్ నేరాల పట్ల సామాన్యులను నిరంతరం అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే వెయ్యికి పైగా పౌరులుగా సైబర్ సింబా లుగా చేరి సైబర్ నేరాలను అరికట్టే యజ్ఞంలో పని చేస్తున్నారు.
సాక్ ఐ..
సోషల్ మీడియా వేదికల మీద మహిళలు, చిన్నారుల భద్రతకు విఘాతం కలిగించే అంశాలను ఎప్పటికప్పుడు గుర్తించి ఆ నేరాలకు పాల్పడుతున్న క్రిమినల్స్ ను గుర్తించేందుకు ఏఐ టెక్నాలజీతో సాక్ ఐ అప్లికేషన్ ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా డిజిటల్ భద్రతను పటిష్టం చేశారు.
స్పందన-తక్షణ రక్షణ..
ఆపదలో, ఒత్తిడిలో ఉన్న మహిళలు, పిల్లలు, యువతులకు తక్షణమే పోలీసు సేవలను అందించే లక్ష్యంతో స్పందన, తక్షణ రక్షణ మహిళ రెస్పాండర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రారంభమైన కొద్ది రోజులలోనే స్పందన పోలీసు టీం లు దాదాపు వెయ్యి మందికి పైగా మహిళలకు వేగంగా పోలీసు సేవలు అందించి వారిలో ఆత్మ స్థైర్యాన్ని నింపాయి. స్పందన టీం లు ప్రతి రోజు దాదాపు 30 ఫోన్ కాల్స్ ను అందుకుని సేవలను అందిస్తున్నాయి. ఈ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు దాదాపు 300 మంది మహిళ పోలీసులకు డ్రైవింగ్ లో శిక్షణను ఇచ్చి బాధితులకు సత్వర సేవలను అందించేందుకు శ్రీకారం చుట్టారు.
హెచ్-ఫాస్ట్..
ఆరోగ్యవంతమైన హైదరాబాద్ ను నిర్మించేందుకు హెచ్ -ఫాస్ట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ హెచ్ - ఫాస్ట్ ద్వారా కల్తీ ఆహార పదార్థాలు తయారు చేసే ముఠాల పై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటి వరకు 175 కేసులు నమోదు చేసి 95 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. కల్తీ దందా పై నిరంతరం నిఘా పెట్టారు.
కాప్ రైటర్..
ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు వచ్చే వారికి ఠాణాల్లో ఫిర్యాదు చేయడానికి ఇబ్బంది లేకుండా పోలీసుల సేవలు వేగంగా అందించే లక్ష్యంతో కాప్ రైటర్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. బాధితులకు ఫిర్యాదులో గందరగోళం లేకుండా ఈ కాప్ రైటర్ ద్వారా సులభంగా కంప్లైంట్ ను నమోదు చేసేందుకు కాప్ రైటర్ ను ఏర్పాటు చేశారు. ఈ కాప్ రైటర్ 10 భాషలను అనువదించి పోలీసులకు , బాధితులకు ఇబ్బంది లేకుండా స్పష్టంగా ఫిర్యాదు నమోదు అయ్యేలా చర్యలు ప్రారంభించారు.
ఐస్..
ఒక సీసీ కెమెరా వంద పోలీసులతో సమానం.. ఈ నేపథ్యంలో నగరంలో సీసీ కెమెరాల పర్యవేక్షణ కోసం ఐస్ టీంలను రంగంలోకి దించారు. ఈ టీంలు పోలీసు ఆధ్వర్యంలో ఏర్పాటైన సీసీ కెమెరాల పని తీరును నిరంతరం పరిశీలిస్తుంటాయి. పని చేయని సీసీ కెమెరాలను కనిపెట్టి వాటిని మరమ్మతులు చేస్తూ సురక్షిత వాతావరణాన్ని ఏర్పాటుకు కృషి చేస్తున్నారు.
ఇవి కాకుండా ఆపరేషన్ కవచ్ తో తరచు పోలీసు తనిఖీలను నిర్వహిస్తు హైదరాబాద్ సేఫ్ బ్రాండ్ కు అండగా నిలబడుతున్నారు. ఒకేసారి 5 వేల మంది సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ కవచ్ లో అర్ధరాత్రి హోటల్లు, లాడ్జిలలో తనిఖీలు నిర్వహించి పోలీస్ మార్గదర్శకాలు, అనుమతి నిబంధనలు పాటించని వారిపై కేసులను నమోదు చేశారు. మరో ఆపరేషన్ కవచ్ లో వాహనాల నెంబర్లు టాంపరింగ్ చేసి తిరుగుతున్న వారిపై పంజా విసిరారు. 2 వేల మంది వాహనదారులపై కేసులను నమోదు చేసి వాహనాల నెంబర్లు టాంపరింగ్ చేస్తున్న వారిలో గుబులు పుట్టించారు. ఇక ఆక్టోపస్ ఆపరేషన్‌లతో దేశ వ్యాప్తంగా సైబర్ క్రిమినల్స్ లలో వణుకు పుట్టించారు. బ్యాంకింగ్, టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల నిబంధనల అమలులో నెలకొన్న లోపాలు వెలుగులోకి తీసుకువచ్చారు. అప్రమత్తమైన కేంద్రం ఈ ఆపరేషన్ ద్వారా అంశాలను పరిగణలోకి తీసుకుని నిబంధనల అమలును కఠినతరం చేశారు. ఇలా ఈ ఏడు అస్త్రాలు ఇప్పుడు కామన్ మ్యాన్ కు నేరాల బారిన పడకుండా బుల్లెట్ ప్రూఫ్ పోలీసు ప్యాకేజీగా మారింది.






