గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌‌గా హైదరాబాద్

by Malleboina Mahesh |

గ్లోబల్ లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో నూతన ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలకు హైదరాబాద్‌ వేదిక కానుంది.

గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌‌గా హైదరాబాద్
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్లోబల్ లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో నూతన ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలకు హైదరాబాద్‌ వేదిక కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 23వ ఎడిషన్ బయో ఏషియా సదస్సుకు రంగం సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా బయోటెక్నాలజీ, ఔషధాలు, హెల్త్ రంగాలకు చెందిన నిపుణులు పాల్గొననున్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో రెండు రోజులపాటు జరిగే సదస్సుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది.

సుమారు 50 దేశాలకు చెందిన మూడు వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన సంస్థల అధిపతులు, సీఈవోలు, ప్రతినిధులు సంబంధిత రంగాల నిపుణులు, ఆవిష్కర్తలు ఈ వేదికపై జరిగే చర్చలు, సమావేశాల్లో పాలుపంచుకుంటారు. లైఫ్ సైన్సెస్ రంగంలో వస్తున్న సరికొత్త మార్పులు, శాస్త్ర పురోగతి, ఏఐ ప్రభావంపై ప్రధానంగా చర్చించనున్నారు.

ప్రారంభించనున్న సీఎం రేవంత్..

ప్రపంచంలోనే అతిపెద్ద గ్లోబల్ లైఫ్ సైన్సెస్, హెల్త్‌ కేర్ సదస్సుగా ప్రత్యేక గుర్తింపు ఉన్న బయో ఏషియా సదస్సు ఈనెల 17, 18 తేదీల్లో హైదరాబాద్‌లో జరుగనుంది. ఈ స‌ద‌స్సును సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు సంయుక్తంగా ప్రారంభించనున్నారు. ‘టెక్‌ బయో అన్‌లీష్డ్: ఏఐ, ఆటోమేషన్-బయాలజీ రివల్యూషన్’ అనే థీమ్‌తో ఈ స‌ద‌స్సు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా హెల్త్ కేర్ రంగంలో ఏఐతో వచ్చిన మార్పులు, లైఫ్ సైన్సెస్ భవిష్యత్ నిర్దేశించే కొత్త ఆవిష్కరణలు, గ్లోబల్ బయోఎకానమీని బలోపేతం చేయడం, ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్ మోడల్స్ తదితర అంశాలను ఎజెండా అంశాలుగా ప్రతినిధులు చర్చించనున్నారు. బయో ఫార్మాస్యూటికల్స్, డిజిటల్ హెల్త్, వైద్య పరికరాలు, అధునాతన చికిత్స విధానాలు, అత్యాధునిక వైద్య, ఆరోగ్య సంరక్షణ విధానాలు చర్చకు రానున్నాయి.

ఫార్మాస్యూటికల్ ఎక్సలెన్స్‌లో కీలక పాత్ర

వైద్యపరిశోధనలు, బయో టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ ఎక్సలెన్స్‌లో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తున్నది. ఈ నేపథ్యంలో బయో ఏషియా 2026 సదస్సు లైఫ్ సైన్సెస్, హెల్త్‌ కేర్ రంగంలో మరో మైలురాయిగా నిలువనుంది. పరిశ్రమల వృద్ధి, సహకారం, అత్యాధునిక పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఈ సదస్సు సరికొత్త మార్గదర్శనం అందించనుంది. గ్లోబల్ లైఫ్ సైన్సెస్ పెట్టుబడులకు కీలక గమ్యస్థానంగా తెలంగాణ అందరి దృష్టిని ఆకర్షించనుంది. ఆధునిక సాంకేతికత వ్యవ‌స్థ హెల్త్ ఇండ‌స్ట్రీలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుంద‌నే అంశంపై ఈ స‌ద‌స్సులో చర్చలు జరగనున్నాయి.

అమ్జెన్, సానోఫీ, ఎలీ లిల్లీ, మిల్టెనీ బయోటెక్ వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు. బయోటెక్నాలజీ, ఔషధాలు, ఆరోగ్య సేవలు, మెడికల్ టెక్నాలజీ, అర్టిఫీషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ) వంటి రంగాల మీద కీల‌కోప‌న్యాసం చేయ‌నున్నారు. ఈ సదస్సులో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందిన క్యాన్సర్ జీన్ థెరపీ నిపుణులు ప్రొఫెసర్ బ్రూస్ ఎల్.లెవిన్, అమ్జెన్ సంస్థ సీఎస్‌వో డా.హోవర్డ్ వై.చాంగ్, జర్మనీకి చెందిన మిల్టెనీ బయోటెక్ వ్యవస్థాపకులు డా.స్టెఫాన్ మిల్టెనీ, సానోఫీ సంస్థ ఈవీపీ మాడలీన్ రోచ్ వంటి ప్రముఖులు కీలకంగా మాట్లాడనున్నారు.

కార్యక్రమానికి కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్ సైతం హాజరుకానున్నారు. డాక్టర్ రెడ్డీస్, జైడస్, బయోకాన్, సిప్లా వంటి భారతీయ ప్రముఖ సంస్థల సీఈఓలు పాల్గొన‌నున్నారు. ఇస్రో మాజీ చైర్మన్ ఎస్.సోమనాథ్, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ చైర్మన్ సతీష్ రెడ్డి, భారత్ బయోటెక్ ఎండీ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా, లారస్ ల్యాబ్స్ సీఈవో డాక్టర్ సత్యనారాయణ చావా, నోవార్టిస్ ఏషియా పసిఫిక్ రీజియన్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సీజర్ కాన్సెప్షన్, లిల్లీ ఇండియా ప్రెసిడెంట్ విన్సెల్ టక్కర్ కాంక్లేవ్ లో తమ అభిప్రాయాలు పంచుకోనున్నారు.

Next Story