అవినీతికి అడ్డాగా హుజూరాబాద్ మున్సిపాలిటీ.. ముచ్చటగా మూడోసారి ఏసీబీకి చిక్కిన అధికారి

by Malleboina Mahesh |

హుజూరాబాద్ మున్సిపల్ ఏఈ సుధాకర్ రెడ్డి ఏసీబీకి చిక్కారు! మున్సిపాలిటీలో ఇది మూడోసారి. అవినీతి అధికారుల అడ్డాగా పట్టణం మారుతోందని నిరసన.

అవినీతికి అడ్డాగా హుజూరాబాద్ మున్సిపాలిటీ.. ముచ్చటగా మూడోసారి ఏసీబీకి చిక్కిన అధికారి
X

దిశ,​ హుజూరాబాద్ రూరల్: అవినీతికి అడ్డాగా హుజూరాబాద్ మున్సిపాలిటీ మారుతోంది. పాలకులు మారుతున్నా, వ్యవస్థ అప్గ్రేడ్​ అవుతున్నా.. కొందరు అధికారుల తీరు మాత్రం మారడం లేదు. తాజాగా మున్సిపల్ ఏఈ సుధాకర్ రెడ్డి ఏసీబీకి చిక్కడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. మేజర్ గ్రామ పంచాయతీ స్థాయి నుంచి మున్సిపాలిటీ వరకు హుజూరాబాద్ ప్రస్థానంలో అవినీతి తిమింగలాలు అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉన్నాయి.

​ముచ్చటగా మూడోసారి.. అదే సీన్!

​హుజూరాబాద్ మున్సిపల్ చరిత్రలో ఏసీబీ దాడులు జరగడం ఇది మూడోసారి. గతంలో మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో అప్పటి ఈవో అశోక్ రెడ్డి ఏసీబీకి పట్టుబడగా, ఆ తర్వాత 2012లో తొలి మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన దేవేందర్ సైతం కాంట్రాక్టర్ వద్ద లంచం తీసుకుంటూ దొరికిపోయారు. ఇప్పుడు ఏఈ సుధాకర్ రెడ్డి వంతు రావడంతో, ఇక్కడ అవినీతి ఏ స్థాయిలో వేళ్లూనుకుందో అర్థమవుతోంది.

​పాలకుల అండ.. అధికారుల దందా..

​ప్రజలకు సేవ చేస్తామని ప్రమాణాలు చేసి గెలిచిన కొందరు ప్రజాప్రతినిధులు, తమ స్వార్థ ప్రయోజనాల కోసం అధికారులను లొంగదీసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.​తమ మాట వినని అధికారులను లంచం ఎరవేసి ఏసీబీకి పట్టించడం లేదా, తమకు సహకరించే వారిని అవినీతి ఊబీలోకి లాగడం ఇక్కడ పరిపాటిగా మారింది. నిన్నటి వరకు సైకిల్ మీద తిరిగిన కొందరు నాటి వార్డు మెంబర్లు నేడు నాయకులుగా ఎదిగి కోట్లాది రూపాయల ఆస్తులు, భూములు కూడగట్టడం చూస్తుంటే ప్రజాధనం ఏ మేరకు కొల్లగొట్టబడుతుందో స్పష్టమవుతోంది.

అటెండర్ నుంచి ఆఫీసర్ వరకు.. ఇక్కడే తిష్ట

హుజూరాబాద్ మున్సిపాలిటీలో మరో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. మేజర్ గ్రామ పంచాయతీ కాలం నుంచి నేటి వరకు కొందరు సిబ్బంది అటెండర్ స్థాయి నుంచి ఆఫీసర్ స్థాయికి ఎదిగినా ఇక్కడే పాతుకుపోయారు. బదిలీలు అయినా వెళ్లకుండా, మళ్లీ ఇక్కడికే పోస్టింగులు తెప్పించుకుంటూ కొందరు సిబ్బంది మున్సిపాలిటీని తమ సొంత సామ్రాజ్యంగా మార్చుకున్నారు.

ఈ సెక్షన్‌లో కీలకం..

మున్సిపాలిటీలో నిధుల లావాదేవీలు జరిగే అకౌంట్ సెక్షన్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్,శానిటేషన్, రెవెన్యూ సెక్షన్లు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఈ సెక్షన్లలో పనిచేసే కొందరు అధికారులు చేయి తడపందే పనులు చేయడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి.​ఇక్కడ ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు కీలక సమాచారాన్ని బయటి వ్యక్తులకు చేరవేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.​రెగ్యులర్ అధికారులు బదిలీపై వచ్చినా, సదరు కాంట్రాక్టు ఉద్యోగులు మాత్రం తన సీటు వదలకుండా చక్రం తిప్పుతుండటం గమనార్హం.

​వెనకబడ్డ అభివృద్ధి.. వెలుగుతున్న నేతలు!

​1962లోనే మున్సిపాలిటీ హోదా ఉన్న హుజూరాబాద్‌ను లోటు బడ్జెట్ సాకుతో వెనక్కి నెట్టిన చరిత్ర ఇక్కడి పాలకులది. అభివృద్ధిలో వెనుకబడిన, అవినీతిలో మాత్రం హుజూరాబాద్ మున్సిపాలిటీ 'టాప్ లో నిలుస్తోంది. సామాన్య మానవుడి గోడు వినే నాథుడు లేక, కనీస సౌకర్యాలు కరువై ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి హుజరాబాద్ మున్సిపాలిటీలో వేళ్లూనుకున్న అవినీతి నెట్‌వర్క్‌ను తుదముట్టించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Next Story