హుస్నాబాద్‌ అభివృద్ధే ధ్యేయం: మంత్రి పొన్నం ప్రభాకర్

by Jakkula.Mamatha |

హుస్నాబాద్ నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి, రైతాంగ క్షేమం, ప్రజారోగ్యమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

హుస్నాబాద్‌ అభివృద్ధే ధ్యేయం: మంత్రి పొన్నం ప్రభాకర్
X

దిశ, హుస్నాబాద్: హుస్నాబాద్ నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి, రైతాంగ క్షేమం, ప్రజారోగ్యమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గురువారం హుస్నాబాద్‌లో నిర్వహించిన పలు కీలక ప్రభుత్వ, సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అధికారులకు, ప్రజాప్రతినిధులకు దిశా నిర్దేశం చేశారు. వర్షాభావ పరిస్థితుల పై ముగ్గురు జిల్లాల కలెక్టర్లతో ఉన్నత స్థాయి సమీక్ష ప్రకృతి వైపరీత్యమైన ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు ఉపశమన చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.

స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు హైమావతి, చిత్రామిశ్రా, చాహత్ బజ్‌పాయ్‌లతో పాటు అదనపు కలెక్టర్లు, మూడు జిల్లాల వివిధ శాఖల ఉన్నతాధికారులతో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో తాగునీటి ఎద్దడి, పశుగ్రాసం కొరత తలెత్తకుండా అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆరుతడి పంటలు, ఉద్యానవన రంగానికి సంబంధించి ఆయిల్ పామ్ సాగు వైపు రైతులను ప్రోత్సహించాలన్నారు. పడిపోతున్న భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించాలని, ‘విబిజిరాంజీ’ పథకం కింద ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టి పడిన ప్రతి వర్షపు బొట్టునూ సంరక్షించాలని పిలుపునిచ్చారు.

ఆదర్శ నియోజకవర్గంగా హుస్నాబాద్ – స్వయంగా ఎన్యూమరేషన్ ఫారం సమర్పణ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక ఓటరు సవరణ (SIR) ప్రక్రియపై బిఎల్ఏ లు, సూపర్‌వైజర్లు, పార్టీ ముఖ్య నాయకులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా స్వయంగా తన ఎన్యూమరేషన్ ఫారాన్ని పూరించి బిఎల్‌వోకు అందజేశారు. హుస్నాబాద్‌ను రాష్ట్రంలోనే ఆదర్శ ఓటరు సవరణ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని, పట్టణంలో ఇప్పటికే 80 శాతం ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఆగస్టు 3వ తేదీ చివరి గడువు కావడం వల్ల, వలస వెళ్లిన కుటుంబాల వివరాలను సేకరించి అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు పేరు తొలగిపోకుండా ప్రతి వార్డులో ఇంటింటికి వెళ్లి జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు.

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వరుణ యాగాలు, ప్రత్యేక పూజలు రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు, జలాశయాలు నిండాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని కోరుతూ పట్టణంలోని పలు ఆలయాల్లో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ రేణుక ఎల్లమ్మ, శ్రీకృష్ణ దేవాలయాల్లో అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం అయ్యప్ప ఆలయంలో 108 మంది రుత్వికులతో నిర్వహించిన శ్రీ వారాహి మూల మంత్ర హోమంలో, మరకత శివాలయంలో 108 కలశాలతో జరిపిన వరుణ యాగంలో పాల్గొన్నారు. రైతు బాగుంటేనే సమాజంలోని వ్యాపారులు, కార్మికులు, చేతివృత్తులవారు సహా అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయని, ప్రతి ఒక్కరూ "సర్వేజనా సుఖినోభవంతు" భావనతో సమాజ శ్రేయస్సు కోసం ప్రార్థించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో SIR పీసీసీ కోఆర్డినేటర్ సౌజన్య గౌడ్, హుస్నాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, బిఎల్ఏలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, వేద పండితులు, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story