- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెరువులు నింపకపోతే వారం రోజుల్లో నిరాహార దీక్ష
నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా కోదాడ నియోజకవర్గంలోని చెరువులను వెంటనే నింపాలని, లేకుంటే వారం రోజుల్లో నిరాహార దీక్షకు దిగుతానని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

దిశ, కోదాడ : నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా కోదాడ నియోజకవర్గంలోని చెరువులను వెంటనే నింపాలని, లేకుంటే వారం రోజుల్లో నిరాహార దీక్షకు దిగుతానని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం కోదాడ మండలం గణపవరం స్టేజి వద్ద రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా రావాల్సిన సాగునీటిని నల్లగొండ, సూర్యాపేట జిల్లాల రైతులకు అందించకుండా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాకు తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కోదాడ ప్రాంతంలోని చెరువులు ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్న ఆయన, ప్రభుత్వం వెంటనే స్పందించి సాగర్ ఎడమ కాలువ ద్వారా చెరువులను నింపాలని కోరారు. లేనిపక్షంలో రైతుల హక్కుల కోసం వారం రోజుల్లో నిరాహార దీక్ష చేపట్టి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాలేశ్వరం ప్రాజెక్టు నీటిని ఎత్తిపోసి ఆయకట్టు రైతులకు అందిస్తే వ్యవసాయానికి మేలు జరుగుతుందని సూచించిన బొల్లం మల్లయ్య యాదవ్, రైతుల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిరంకుశ వైఖరితో వ్యవహరిస్తోందని విమర్శించారు.
సమావేశం అనంతరం బీఆర్ఎస్ నాయకుడు పొట్ట కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో రైతులు కోదాడ–మేళ్లచెరువు ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. చెరువులకు వెంటనే నీరు విడుదల చేయాలని నినాదాలు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ధర్నాతో కొంతసేపు రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, పోలీసులు అక్కడ మోహరించి పరిస్థితిని అదుపులో ఉంచారు. రైతుల డిమాండ్లపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది కోదాడ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేసిన నిరాహార దీక్ష హెచ్చరిక రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో కాపుగల్లు గ్రామ సర్పంచ్ దొంతగాని అప్పారావు, గణపవరం మాజీ సర్పంచ్ పొట్ట కిరణ్ కుమార్, తొగర్రాయి మాజీ సర్పంచ్ దొంగల లక్ష్మీనారాయణ, రామలక్ష్మీపురం గ్రామ శాఖ అధ్యక్షుడు అంజిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వరదారావు, బ్రహ్మం, వేలాద్రి తదితరులు పాల్గొన్నారు.






