ఎమ్మెల్యే తీరుతో మునుగోడు ఎడారిగా మారే ప్రమాదం

by Ratna Kumari |

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి కారణంగా మునుగోడు నియోజకవర్గం ఎడారిగా మారే ప్రమాదం ఉందని, రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.

ఎమ్మెల్యే తీరుతో మునుగోడు ఎడారిగా మారే ప్రమాదం
X

దిశ, చండూరు : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి కారణంగా మునుగోడు నియోజకవర్గం ఎడారిగా మారే ప్రమాదం ఉందని, రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం చండూరు పట్టణ కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డిండి నీటి పంపకాల్లో మునుగోడుకు రావాల్సిన నీటిని 440 అడుగుల వద్ద రెగ్యులేటర్ ఏర్పాటు చేసి, 437 అడుగుల వద్ద మోటార్లు బిగించి మహబూబ్‌నగర్‌కు తరలిస్తున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. 436 అడుగుల వద్దనే రెగ్యులేటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రాజెక్టు చేపట్టినా, నీటి పంపకాల్లో అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. మునుగోడు రైతులకు కేటాయించిన 20 టీఎంసీల నీటి వాటాను పూర్తిగా అమలు చేయాలని కోరారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు డిండి ప్రాజెక్టు నుంచి నీటిని ఇవ్వొద్దంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసి ఒత్తిడి తెస్తున్నారని, అలాంటి సమయంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రైతుల ప్రయోజనాల కోసం పోరాడాల్సింది పోయి మౌనంగా ఉండడం బాధాకరమని విమర్శించారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశానంటూ చెప్పడం కంటే, ముఖ్యమంత్రిని కలిసి మునుగోడుకు నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మునుగోడు అభివృద్ధికి నిధులు తీసుకురావాల్సిన ఎమ్మెల్యే, ఇతర నియోజకవర్గాల్లో పర్యటిస్తూ అక్కడి కాంగ్రెస్ కార్యకర్తల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ముందుగా మునుగోడు నియోజకవర్గంలోని నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేయాలని హితవు పలికారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను విస్మరించి, పార్టీలు మారి వచ్చిన వారికి మాత్రమే పదవులు ఇస్తూ అసలు కాంగ్రెస్ కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. వందల కోట్ల కాంట్రాక్టుల కోసమే రాజకీయాలు చేస్తున్నారని, ప్రజా ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం డిండి ఎత్తిపోతల పథకాన్ని కమిషన్ల కోసమే తీసుకొచ్చిందని పదేపదే ఆరోపిస్తున్న రాజగోపాల్ రెడ్డి, ప్రస్తుతం చేపడుతున్న అభివృద్ధి పనులు కూడా కమిషన్ల కోసమేనా అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ తోకల వెంకన్న, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు కొత్తపాటి సతీష్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఎత్తపు మధుసూదన్ రావు, మండల అధికార ప్రతినిధి బొడ్డు సతీష్ గౌడ్, యువజన అధ్యక్షుడు ఉజ్జిని అనిల్ రావు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పెద్దగోని వెంకన్న గౌడ్, టీఆర్‌ఎస్ నాయకులు తేలుకుంట్ల చంద్రశేఖర్, సామ యాదవ్ రెడ్డి, నకరికంటి రామలింగం తదితరులు పాల్గొన్నారు.

Next Story