- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్ధరాత్రి జేసీబీతో పేదల ఆశలపై దాడి..!
పిల్లల చదువు కోసం పస్తులు పడి పైసా పైసా కూడబెట్టి కొనుగోలు చేసిన భూమిపై అర్ధరాత్రి జేసీబీలు నడిపించి భవనాలను కూల్చివేశారు.

దిశ, మర్రిగూడ : "పిల్లల చదువు కోసం పస్తులు పడి పైసా పైసా కూడబెట్టి కొనుగోలు చేసిన భూమిపై అర్ధరాత్రి జేసీబీలు నడిపించి భవనాలను కూల్చివేశారు. మా పిల్లల భవిష్యత్తును కూడా నేలమట్టం చేశారు" అంటూ మర్రిగూడ మండలం రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎస్సీ, బీసీ కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గ్రామస్తుల కథనం ప్రకారం, 1990 ప్రాంతంలో తీవ్ర పేదరికంలో ఉన్న రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన 80 మంది ఎస్సీ, బీసీ కుటుంబాలకు వీఆర్వో (VRWO) సంస్థ రెండు గదుల ఇళ్లను నిర్మించి ఇచ్చింది. అనంతరం గ్రామ పెద్దలతో చర్చించిన సంస్థ ప్రతినిధులు, గ్రామస్తులు భూమి సమకూరిస్తే పిల్లల విద్య కోసం పాఠశాలను నిర్మించి నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీని నమ్మిన 80 కుటుంబాలు ఇంటికి రూ.500 చొప్పున విరాళంగా సేకరించి, వట్టిపల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 334లో మారగోని కృష్ణయ్య వద్ద నుంచి ఒక ఎకరం భూమిని కొనుగోలు చేసి సంస్థకు అప్పగించినట్లు తెలిపారు.
ఆ స్థలంలో వీఆర్వో సంస్థ పాఠశాలను నిర్మించి సుమారు 15 సంవత్సరాల పాటు రాంరెడ్డిపల్లి సహా పరిసర గ్రామాల వందలాది మంది విద్యార్థులకు విద్య అందించిందని గ్రామస్తులు పేర్కొన్నారు. అయితే సంస్థ చైర్మన్ మరణం తర్వాత పాఠశాల మూతపడినట్లు తెలిపారు. ఇటీవల అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు జేసీబీలతో పాఠశాల భవనాలను కూల్చివేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఆందోళన నెలకొంది. పేదల కష్టార్జితంతో కొనుగోలు చేసిన భూమిపై జరిగిన ఈ కూల్చివేతపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై శనివారం రాంరెడ్డిపల్లి గ్రామ ప్రజలు మర్రిగూడ తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాస్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తమ కష్టార్జితంతో కొనుగోలు చేసిన భూమిని పరిరక్షించాలని, అక్రమ కూల్చివేతకు బాధ్యులపై వెంటనే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, రాంరెడ్డిపల్లి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు.






