- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ టు ఛత్తీస్‌గఢ్.. ముగ్గురు మైనర్ బాలికలు సేఫ్
దోమలగూడ నుంచి మిస్సింగ్ అయిన ముగ్గురు మైనర్ బాలికల కేసులో పోలీసులు పురోగతి సాధించారు.

దిశ, రాంనగర్ : దోమలగూడ నుంచి మిస్సింగ్ అయిన ముగ్గురు మైనర్ బాలికల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి సికింద్రాబాద్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) రక్షిత కృష్ణమూర్తి ఆదివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వివరాలు వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం దోమలగూడకు చెందిన ముగ్గురు మైనర్ బాలికలు ఈ నెల 19వ తేదీన ఇంటి నుంచి అదృశ్యమయ్యారు. తల్లి రామ్ దులారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి, ఈ మిస్సింగ్ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఐదు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేయగా కీలక ఆధారాలు లభించాయి. దీంతో దోమలగూడ నుంచి అదృశ్యమైన ముగ్గురు మైనర్ బాలికల కేసును ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పోలీసులు విజయవంతంగా ఛేదించారు.
అసలేం జరిగింది ?
పరిధి బస్తీలో నివసిస్తున్న రామ్ దులారి కుటుంబం జీవనోపాధి కోసం ఈ ఏడాది మే నెలలో ఛత్తీస్‌గఢ్ నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చింది. 19-07-2026 అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వారి కుమార్తెలు సనీషా కుమారి @ శిల్ప (17), స్నేహ కుమారి (16), రోహితిన్ కుమార్తె లత (15) ఇంటి నుంచి అదృశ్యమయ్యారు. తెల్లవారుజామున 3 గంటలకు విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో దోమలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
262 సీసీ కెమెరాలు.. నాలుగు ప్రత్యేక బృందాలు
కేసును సీరియస్‌గా తీసుకున్న దోమలగూడ పోలీసులు, సికింద్రాబాద్ టాస్క్‌ఫోర్స్‌తో కలిసి నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, 262 సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. దీంతో బాలికల కదలికలపై స్పష్టత వచ్చినట్లు తెలిపారు.
వారి ప్రయాణం ఇలా.. పోలీసులు వెల్లడించిన టైమ్‌లైన్ ప్రకారం..
19-07-2026, 01:47 AM: పరిధి బస్తీలోని ఇంటి నుంచి బయలుదేరారు. 01:56 AM: హిమాయత్‌నగర్ మెయిన్ రోడ్డులో కుల్ఫీ స్పాట్ వద్ద ఆటో ఎక్కారు. 02:03 AM: కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరారు. 02:09 AM: అక్కడి నుంచి మరో ఆటోలో సికింద్రాబాద్ స్టేషన్‌కు బయలుదేరారు. 02:25 AM: సికింద్రాబాద్ స్టేషన్ గేట్ నెం. 8 నుంచి లోపలికి ప్రవేశించి, 02:40 AMకు ప్లాట్‌ఫాం నెం. 6, 7 వద్దకు చేరారు. 03:14 AM నుంచి 04:14 AM వరకు: అదే ప్లాట్‌ఫాం మధ్యలో వేచి ఉన్నారు. 04:16 AM: నడుచుకుంటూ జేమ్స్ స్ట్రీట్ స్టేషన్‌కు వెళ్లి ఉదయం 7 గంటల వరకు అక్కడే ఉన్నారు. 07:00 AM: తిరిగి ఆటోలో హిమాయత్‌నగర్ వచ్చి, మళ్లీ సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరారు. 09:00 AM: సికింద్రాబాద్‌లో దానాపూర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. ఈ రైలులో 20-07-2026 సాయంత్రానికి నాగ్‌పూర్ చేరుకుని, ఆ రాత్రి స్టేషన్‌లోనే బస చేశారు. 21-07-2026 ఉదయం 6 గంటలకు బస్సులో గడ్‌చిరోలీ మీదుగా పాతంజూర్ గ్రామానికి వెళ్లి, అక్కడ బిశ్వజిత్ అనే వ్యక్తి ఇంట్లో రెండు రోజుల పాటు ఉన్నారు.
సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేసిన పోలీసులు, ఛత్తీస్‌గఢ్ పోలీసుల సహకారంతో ముగ్గురినీ గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ప్రాథమిక విచారణలో చిన్నారులు అమ్మా, నాన్నల గొడవల కారణంగా ఇంటి నుంచి వెళ్లిపోయామని స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు వెల్లడించారు. సఖి భరోసా సెంటర్‌లో అన్ని వైద్య పరీక్షలు, కౌన్సెలింగ్ నిర్వహించి, పూర్తి విచారణ అనంతరం రెండు రోజుల్లో తల్లిదండ్రులకు అప్పగిస్తామని డీసీపీ స్పష్టం చేశారు. పిల్లలు మాటల కంటే తల్లిదండ్రుల ప్రవర్తనను చూసే ఎక్కువగా నేర్చుకుంటారని, పిల్లలకు తల్లిదండ్రుల నుంచి స్పష్టమైన ప్రేమ, ఆప్యాయత, భరోసా ఉండాలని డీసీపీ సూచించారు. ఈ కేసును అంకితభావంతో విజయవంతంగా ఛేదించిన దోమలగూడ ఇన్‌స్పెక్టర్ మహ్మద్ అంజత్ అలీ, ఏఎస్‌ఐ జి. మధుమోహన్‌రావు, కానిస్టేబుళ్లు కె. నాగరాజు, మొహమ్మద్ జలీల్, జి. సూర్యప్రకాశ్, ఎస్.ఆర్. ఉదయ్ కుమార్, సికింద్రాబాద్ టాస్క్‌ఫోర్స్ బృందం పోలీసులను డీసీపీ రక్షిత కృష్ణమూర్తి అభినందించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ నరసయ్య, ఏసీపీ ఎ. యాదగిరి పాల్గొన్నారు.






