భారతదేశంలో గత 20 ఏళ్ల 'హంగ్' అసెంబ్లీలు.. తమిళనాడులో చక్రం తిప్పేదెవరు?

by Muthe.Rajitha |   (  Updated:2026-05-08 05:43:02  IST  )

భారత్ లో గత రెండు దశాబ్దాల్లో ఏర్పడ్డ హంగ్ అసెంబ్లీలు, వాటి వెనకాల నాటకీయత, ప్రస్తుతం తమిళనాడులో జరిగేదేమిటి సమగ్ర విశ్లేషణ.

భారతదేశంలో గత 20 ఏళ్ల హంగ్ అసెంబ్లీలు.. తమిళనాడులో చక్రం తిప్పేదెవరు?
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు పూటకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. టీవీకే పార్టీ భారీగా సీట్లు సాధించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజారిటీ సంఖ్యను చేరుకోలేదు. కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పటికీ ఆ పార్టీకి ఇంకో 6 సీట్లు అవసరం అవుతాయి. అందుకోసం విజయ్ చిన్న పార్టీల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. అయితే దేశంలో హంగ్ ప్రభుత్వాలు ఏర్పడటం కొత్తేమి కాదు. గత 20 ఏళ్లలో అనేక రాష్ట్రాల్లో హంగ్ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. అయితే ఈ ఏర్పాట్ల వెనకాల లెక్కలేనన్ని తర్జనభర్జనలు, రాజకీయ డ్రామాలు జరిగాయి. అధికార పంపిణీ కూడా అత్యంత క్లిష్టంగా మారింది.

కర్ణాటక 2008 : 2008లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను గమనిస్తే, అక్కడ 224 సీట్లకు గాను బీజేపీ 110 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మెజారిటీ మార్కు 113 కు కేవలం మూడు సీట్ల దూరంలో నిలిచిన బీజేపీ, ఆరుగురు స్వతంత్రులను కలుపుకుని 'ఆపరేషన్ కమల'కు నాంది పలికింది. బి.ఎస్. యడ్యూరప్ప నేతృత్వంలో దక్షిణాదిలో తొలి బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఒక సంచలనం.

ఢిల్లీ 2013 : 2013లో ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు భారత రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టించాయి. అప్పుడు బీజేపీ 31 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచినా ప్రభుత్వం ఏర్పాటుకు నిరాకరించగా, కేవలం 28 సీట్లు ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), కాంగ్రెస్ బయటి నుండి ఇచ్చిన మద్దతుతో అధికారాన్ని చేపట్టింది. సిద్ధాంతపరంగా విభేదించే పార్టీలు కూడా అధికారం కోసం ఎలా ఏకమవుతాయో చెప్పడానికి ఈ హంగ్ నిదర్శనం.

మహారాష్ట్ర 2014 : 2014 ఎన్నికల ఫలితాలు మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద మార్పును తీసుకువచ్చాయి. అప్పటి వరకు మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ-శివసేన, కాంగ్రెస్-ఎన్‌సీపీ వేర్వేరుగా పోటీ చేశాయి. ఫలితంగా ఏ పార్టీకీ మ్యాజిక్ ఫిగర్ 145 అందలేదు. బీజేపీ 122 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచినా, ప్రభుత్వం ఏర్పాటుకు మరో 23 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమైంది. మొదట ఎన్‌సీపీ (NCP) బయటి నుండి బేషరతు మద్దతు ప్రకటించడంతో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అయితే, ఆ తర్వాత సుదీర్ఘ చర్చలు, బేరసారాల అనంతరం పాత మిత్రపక్షమైన శివసేన ప్రభుత్వంలో చేరడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది.

జమ్మూకాశ్మీర్ 2014 : 2014లో జరిగిన జమ్మూకాశ్మీర్ ఎన్నికలు ఒక విలక్షణమైన తీర్పును ఇచ్చాయి. మొత్తం 87 స్థానాలు ఉన్న అసెంబ్లీలో మెజారిటీ మార్కు 44. ఫలితాలు వెలువడ్డాక ఏ పార్టీకీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం రాలేదు. ప్రాంతీయ పార్టీ అయిన పీడీపీ (PDP) 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలవగా, బీజేపీ 25 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. నేషనల్ కాన్ఫరెన్స్ (15), కాంగ్రెస్ (12) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సిద్ధాంతపరంగా ఉత్తర-దక్షిణ ధ్రువాల వంటి పీడీపీ, బీజేపీ చేతులు కలపడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. సుమారు రెండు నెలల పాటు సాగిన సుదీర్ఘ చర్చల తర్వాత, 'మిత్రధర్మం' పేరుతో ఒక ఉమ్మడి ప్రణాళికను సిద్ధం చేసుకుని ముఫ్తీ మహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

గోవా, మణిపూర్ 2017 : ఈశాన్య రాష్ట్రాలు, గోవా వంటి చిన్న రాష్ట్రాల్లో హంగ్ ఏర్పడినప్పుడు రాజకీయాలు పరిణామాలు వేగంగా మారాయి. 2017లో గోవా, మణిపూర్లలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, బీజేపీ తన చాకచక్యంతో చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలను అంటే గోవాలో MGP, GFP వంటి వాటిని, స్వతంత్రులను ఏకం చేసి అనూహ్యంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. అప్పుడు 'అతిపెద్ద పార్టీ'ని ఆహ్వానించాలా లేక 'మెజారిటీ నిరూపించగల కూటమి'ని ఆహ్వానించాలా అనే దానిపై పెద్ద ఎత్తున న్యాయపరమైన చర్చలకు దారితీసింది. జమ్ముకాశ్మీర్, గోవా, మణిపూర్ పరిణామాలు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ లోని ఫిరాయింపుల నిరోధక చట్టం, గవర్నర్ విచక్షణాధికారాల ప్రాముఖ్యత అంశాలు చర్చకు దారి తీశాయి.

కర్ణాటక 2018 : 2018లో కర్ణాటకలో జరిగిన హంగ్ అనేక మలుపులు, రాజకీయ నాటకీయ పరిణామాలకు దారి తీసింది. ఇక్కడ 224 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, ఫలితాలు అత్యంత ఉత్కంఠభరితంగా వచ్చాయి. బీజేపీ 104 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 78, జేడీఎస్ (JD-S) 37 సీట్లు సాధించాయి. స్వతంత్రులు, ఇతరులు 3 స్థానాల్లో గెలిచారు. అయితే అధికారంచేజిక్కించుకోడానికి కాంగ్రెస్ ఒక అనూహ్య నిర్ణయం తీసుకుంది. కేవలం 37 సీట్లు ఉన్న జేడీఎస్‌కు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేస్తూ మద్దతు ప్రకటించింది. తద్వారా కాంగ్రెస్+జేడీఎస్ కలిపి 115 (78+37) సీట్లతో మెజారిటీ మార్కును దాటాయి. అయితే, అప్పటి గవర్నర్ వాజూభాయ్ వాలా 'అతిపెద్ద పార్టీ' సూత్రాన్ని అనుసరిస్తూ, మొదట బీజేపీకి అవకాశం ఇచ్చారు. బి.ఎస్. యడ్యూరప్పను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించి, మెజారిటీ నిరూపించుకోవడానికి 15 రోజుల సమయం ఇచ్చారు.

దీనిని సవాలు చేస్తూ కాంగ్రెస్ అర్ధరాత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిస్తూ.. 15 రోజుల సమయం చాలా ఎక్కువ అని, కేవలం 24 గంటల్లోనే ఫ్లోర్ టెస్ట్ (Floor Test) నిర్వహించాలని ఆదేశించింది. అవసరమైన సంఖ్యాబలం లేకపోవడంతో యడ్యూరప్ప బలపరీక్షకు ముందే రాజీనామా చేశారు. ఆ తర్వాత హెచ్.డి. కుమారస్వామి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది.

హర్యానా 2019 : 2019లో హర్యానాలోని 90 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, మెజారిటీ మార్కు 46. అప్పటి అధికార పార్టీ అయిన బీజేపీ 40 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది, కానీ మెజారిటీకి 6 సీట్ల దూరంలో ఆగింది. కాంగ్రెస్ 31 సీట్లు సాధించగా, దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని కొత్తగా ఏర్పడిన జననాయక్ జనతా పార్టీ (JJP) 10 కీలకమైన సీట్లను గెలుచుకుని 'కింగ్ మేకర్‌'గా అవతరించింది. సుదీర్ఘ చర్చల తర్వాత, బీజేపీ, జేజేపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రిగా, దుష్యంత్ చౌతాలా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

మేఘాలయ 2023 : మేఘాలయలోని 59 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మెజారిటీ మార్కు 31. ఫలితాల్లో కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) 26 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే మెజారిటీకి 5 సీట్ల దూరంలో ఆగింది. గతంలో మిత్రపక్షంగా ఉన్న UDP 11 సీట్లతో కీలక శక్తిగా ఎదిగింది. చివరకు NPP తన పాత మిత్రపక్షాలైన UDP, PDF, బీజేపీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

సర్కారియా కమిషన్ సూచనలు

భారతదేశం వంటి ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమతుల్యతను కాపాడటానికి 1983లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సర్కారియా కమిషన్ సిఫార్సులు ఇప్పటికీ రాజ్యాంగ విలువలలు కాపాడటంలో దిక్సూచిలా ఉన్నాయి. ముఖ్యంగా ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని 'హంగ్' పరిస్థితుల్లో గవర్నర్ తన విచక్షణాధికారాన్ని ఎలా ఉపయోగించాలో ఈ కమిషన్ అత్యంత స్పష్టంగా 'ప్రాధాన్యత క్రమాన్ని' నిర్దేశించింది. దీని ప్రకారం గవర్నర్ మొదటగా ఎన్నికల ముందస్తు కూటమికి (Pre-poll Alliance) అవకాశం ఇవ్వాలి, ఎందుకంటే ప్రజలు ఆ కూటమిని ఒకే యూనిట్‌గా భావించి ఓటు వేశారని కమిషన్ అభిప్రాయపడింది. ఒకవేళ అటువంటి కూటమి లేకపోతే, అతిపెద్ద పార్టీ (Single Largest Party) ని ఆహ్వానించి, ఇతర పార్టీల మద్దతుతో వారు స్థిరమైన ప్రభుత్వాన్ని ఇవ్వగలరో లేదో పరిశీలించాలి. ఆ తర్వాత మాత్రమే ఎన్నికల అనంతరం ఏర్పడిన కూటమి (Post-poll Alliance)ని పరిగణనలోకి తీసుకోవాలి. వీటి వల్ల రాజకీయ అస్థిరత తగ్గడమే కాకుండా, గవర్నర్ నిర్ణయం పక్షపాతరహితంగా ఉండే అవకాశం ఉంటుందని కమిషన్ పేర్కొంది.

అంతేకాకుండా గవర్నర్ పదవిని రాజకీయ పునరావాస కేంద్రంగా కాకుండా, ఆ పదవిలో నియమితుడయ్యే వ్యక్తి రాజకీయాలకు అతీతంగా ఉండాలని, నియామక ప్రక్రియలో సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరపాలని సర్కారియా కమిషన్ గట్టిగా నొక్కి చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 దుర్వినియోగం కాకుండా, రాష్ట్రపతి పాలనను కేవలం 'చివరి అస్త్రం'గా మాత్రమే వాడాలని సూచించింది. రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని గౌరవిస్తూనే, కేంద్ర-రాష్ట్రాల మధ్య నిరంతరం చర్చలు జరపడానికి ఆర్టికల్ 263 కింద ఇంటర్-స్టేట్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలన్న కమిషన్ ప్రతిపాదన 1990లో కార్యరూపం దాల్చింది.

ఎస్.ఆర్. బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏం చెబుతోంది?

భారత రాజ్యాంగ చరిత్రలో, ముఖ్యంగా రాష్ట్రాల స్వయంప్రతిపత్తి, గవర్నర్ల అధికారాల విషయంలో 'ఎస్.ఆర్. బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1994)' కేసు అత్యంత కీలకమైన మైలురాయి. 1989లో కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న ఎస్.ఆర్. బొమ్మై నేతృత్వంలోని జనతాదళ్ ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే కొద్ది నెలలకే.. కొంతమంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో అప్పటి గవర్నర్ పి. వెంకటసుబ్బయ్య.. ప్రభుత్వానికి మెజారిటీ ఎమ్మెలేలు లేరని, రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందని రాష్ట్రపతికి నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 356ను ఉపయోగించి బొమ్మై ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసింది. తన మెజారిటీని నిరూపించుకోవడానికి అసెంబ్లీని సమావేశపరచాలని బొమ్మై కోరినప్పటికీ గవర్నర్ నిరాకరించారు. దీనిని సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

1994లో తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసులో ఇచ్చిన తీర్పు భారత రాజకీయాల్లో కీలక పరిణామం అని చెప్పవచ్చు. సర్కారియా కమిషన్ నివేదికను ఉటంకిస్తూ.. ఏ ప్రభుత్వానికైనా మెజారిటీ ఉందో లేదో తేల్చాల్సింది రాజ్‌భవన్‌లో గవర్నర్ కాదు, అసెంబ్లీ హాల్‌లో ఎమ్మెల్యేల ఓటింగ్ ద్వారానే అని, ప్రభుత్వ 'బలాబలాల నిర్ణయానికి ఏకైక వేదిక అసెంబ్లీ మాత్రమే' అని కోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రపతి పాలన విధించే అధికారం కేంద్రానికి ఉన్నప్పటికీ, అది న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని.. అంటే, కేంద్రం ఏ కారణాలతో ఒక ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసిందో ఆ కారణాలు సరైనవో కాదో కోర్టులు పరిశీలించవచ్చని తెలిపింది.

ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం మతపరమైన రాజకీయాలు చేస్తూ రాజ్యాంగ విలువులకు విరుద్ధంగా నడిస్తే, అప్పుడు ఆర్టికల్ 356ను ఉపయోగించడం సరైనదేనని కానీ కేవలం కేంద్రంలో ఉన్న పార్టీకి వ్యతిరేక పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉందని లేదా రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు నచ్చలేదని ఆర్టికల్ 356ను ఉపయోగించకూడదు అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేయడంతో.. తిరిగి బొమ్మై ప్రభుత్వం కొలువుదీరింది.

ప్రస్తుతం తమిళనాడు పరిస్థితి?

ప్రస్తుతం తమిళనాడు గవర్నర్ TVK పార్టీ నుండి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు కోరడం వెనుక ఉన్న ఉద్దేశ్యం.. సర్కారియా కమిషన్ సూచించినట్లుగా 'సుస్థిర ప్రభుత్వం' (Stable Government) ఏర్పాటు సాధ్యమేనా అని నిర్ధారించుకోవడం అయినప్పటికీ.. ఎస్.ఆర్. బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఆధారంగా.. మెజారిటీ లేదని ప్రభుత్వ ఏర్పాటును తిరస్కరించే హక్కు గవర్నర్ కు లేదని స్పష్టం అవుతోంది. ప్రభుత్వ బలాబలాలు అసెంబ్లీలో తేలాల్సి ఉంది. ఎక్కువ సీట్లు గెలిచినా టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు ముందే ఆ మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు విజయ్. మరి తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా లేదంటే బద్ద విరోధి పార్టీలైన డీఎంకే, AIDMK కలిసిపోయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా అనేది తేలాల్సి ఉంది.

Next Story