- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రంగారెడ్డి జిల్లా గిరిజన సంక్షేమ శాఖలో భారీ కుంభకోణం
రంగారెడ్డి జిల్లా గిరిజన సంక్షేమ శాఖలో రూ.33 లక్షల గోల్‌మాల్. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యతో ముడిపడిన కేసు.. ఆదిభట్ల పోలీసుల విచారణ ముమ్మరం!

దిశ, రంగారెడ్డి బ్యూరో/ఇబ్రహీంపట్నం : జిల్లా గిరిజన సంక్షేమ శాఖ లో రూ.33లక్షల గోల్‌మాల్ వ్యవహారంలో హైడ్రామా నడుస్తోంది. చెక్కులపై తన సంతకాన్ని ఫోర్జరీ చేసి నిధులను పక్కదారి పట్టించారని ఆ శాఖ జిల్లా అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. తప్పంతా ఆత్మహత్య చేసుకున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిపైకి నెట్టేసి అవినీతి నుంచి అధికారులు ఎస్కేప్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మృతుని కుటుంబీకులు సైతం ఇదే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు సమగ్ర విచారణ జరిపి అసలు సూత్రధారులను తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పక్కా ప్లాన్‌తోనే..
నిధులు పొరపాటున పక్కదారి పట్టలేదు. పక్కా ప్లాన్‌తోనే పక్కదారి పట్టించారు. లావాదేవీలు లేక క్లోజ్ అయిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఖాతాను మళ్లీ పునరుద్దరించి మరీ నిధుల గోల్‌మాల్‌కు పాల్పడ్డారు. జిల్లాలో ఏ బ్యాంకు నుంచి డ్రా చేసినా అవినీతి బండారం బయటపడుతుందని భావించి ఇతర జిల్లాల్లోని బ్యాంకులకు నిధులను తరలించి కాజేశారు. ప్రైవేటు వ్యక్తుల పేరున ఆరు చెక్కులను రాసి అక్రమానికి పాల్పడ్డారు. గత యేడాది డిసెంబర్ నెలలోనే అదిలాబాద్ జిల్లా హుస్నాబాద్, భువనగిరి, పీర్జాదిగూడలలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకుల నుంచి రూ.33 లక్షల నిధులను పలు దఫాలుగా డ్రా చేశారు. ఆయా బ్యాంకుల మేనేజర్లు సైతం గుడ్డిగా ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి మళ్లించడం చర్చనీయాంశం అవుతోంది. ఈ పరిణామాలను పరిశీలిస్తే.. పక్కా స్కెచ్‌తోనే నిధులను పక్కదారి పట్టించినట్లు స్పష్టమవుతోంది.
విచారణలో తేలేనా..?
కలెక్టరేట్‌లోని గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఖాతా శంషాబాద్ బ్రాంచ్‌లో ఉంది. పదేళ్ల క్రితమే లావాదేవీలు నిలిచిపోయిన ఈ ఖాతాలో రూ.20 లక్షల నగదు ఉంది. ఖాతా పునరుద్ధరణ తర్వాత వడ్డీతో కలిపి రూ.33 లక్షల 5 వేల నగదు ఖాతాలో జమ అయి ఉంది. శంషాబాద్ హోం బ్రాంచ్ నుంచే నిధులు వివిధ జిల్లాల్లోని బ్యాంకులకు ట్రాన్స్ఫర్ అయ్యాయి. దీనిపై అంతర్గత విచారణ జరుగుతున్న తరుణంలోనే గిరిజన సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి శ్రీధర్ జూన్ 1న తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతనిపై అధికారి ఒత్తిళ్ల మేరకే శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నట్లు అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ వస్తున్నారు. అయితే ఈనెల 10న గిరిజన సంక్షేమ జిల్లా అధికారి రామేశ్వరి దేవి నుంచి పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆమె ఫిర్యాదుతో నిధుల పక్కదారి వ్యవహారానికి శ్రీధర్ ఆత్మహత్య ముడిపడి ఉందన్న విషయం వెలుగులోకి వచ్చింది.
చెక్కులపై తన సంతకాన్ని ఫోర్జరీ చేసి నిధులను దారి మళ్లించారంటూ డీటీడబ్ల్యూవో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు బ్యాంకు మేనేజర్లపై కేసు నమోదు చేయాలని ఆమె ఫిర్యాదులో కోరారు. ఇదే క్రమంలో గిరిజన సంక్షేమ శాఖలోని జూనియర్ అసిస్టెంట్ పై సస్పెన్షన్ వేటు పడింది. రూ.33 లక్షల స్కాంలో అధికారులు ఆత్మహత్యకు పాల్పడ్డ శ్రీధర్‌ను బాధ్యుడిగా చేస్తుండగా.. అతన్ని ఈ కేసులో ఇరికించి అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని శ్రీధర్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆదిభట్ల పోలీసులు విచారణ జరుపుతున్నారు. చెక్కులను వడ్త్య సరోజ, మీనాక్షి ఎంటర్ ప్రైజెస్ పేరున రాసి నిధులను పక్కదారి పట్టించారు. సంబంధిత వ్యక్తుల ప్రమేయం తో పాటు బ్యాంకు అధికారులు, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారుల పాత్రపై పోలీసులు కూలంకుషంగా విచారణ చేస్తున్నట్లు తెలిసింది. గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఇతర ఉద్యోగుల ప్రమేయం లేనిదే ఇంత పెద్ద మొత్తంలో నిధులు పక్కదారి పట్టే అవకాశం ఉండదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా పోలీసుల విచారణలో సూత్రధారులు, పాత్రధారులు ఎవరన్నది త్వరలోనే తేలనుంది.






