నేడు సోమవతి అమావాస్య.. కేతకి సంగమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు!

by Jakkula.Mamatha |

అష్టతీర్థాల సంగమంగా, దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానానికి సోమవారం అమావాస్య సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

నేడు సోమవతి అమావాస్య.. కేతకి సంగమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు!
X

దిశ, ఝరాసంగం: అష్టతీర్థాల సంగమంగా, దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానానికి సోమవారం అమావాస్య(సోమవతి అమావాస్య) సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి వేలాదిమంది భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ, రుద్రాభిషేకం, బిల్వార్చన ప్రత్యేక అలంకరణ, మహామంగళహారతి అమ్మవారికి కుంకుమార్చన, మహామంగళహారతి అనంతరం ఉదయం 3.25 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతి కల్పించారు.

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా స్వామి వారి పుష్కరిణిలో పవిత్ర స్నానాలు ఆచరించి, అనంతరం క్యూలైన్లలో నిలబడి స్వామివారి దర్శనం చేసుకున్నారు. భక్తుల “హర హర మహాదేవ”, “శంభో శంకర”, “ఓం నమః శివాయ” పంచాక్షరి నామస్మరణలతో కేతకి వనం మార్మోగింది. భక్తుల రద్దీ దృశ ధర్మ దర్శనానికి సుమారు 2 గంటల సమయం పట్టింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ప్రత్యేక దర్శనం, స్పర్శ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు.

సంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి వేర్వేరుగా దేవాలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వారికి దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి శివరుద్రప్ప, అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ఘన స్వాగతం పలికి, స్వామి వారి ఆశీర్వచనాలతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. దేవస్థానంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, క్యూలైన్, నిత్యాన్నదానం ఏర్పాట్లు చేశారు.

Next Story