CNG కోసం ఆటోలు, క్యాబ్స్ భారీ క్యూ

by Muthe.Rajitha |

ఇంధన సంక్షోభంతో దేశంలో తలెత్తిన CNG కొరత వలన ఆటోలు, క్యాబ్స్ పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ కట్టాయి.

CNG కోసం ఆటోలు, క్యాబ్స్ భారీ క్యూ
X

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమాసియా యుద్ధం(Operation Epic Fury) ప్రభావం హైదరాబాద్ రోడ్లపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర పోరు కారణంగా గల్ఫ్ దేశాల నుండి చమురు సప్లై చైన్ దెబ్బతినడంతో.. దేశంలో LPG, CNG కొరత ఏర్పడింది. ముఖ్యంగా అది మెట్రోలో నగరాలపై పడింది. తాజాగా హైదరాబాద్‌లో సీఎన్‌జీ స్టేషన్ల వద్ద కిలోమీటర్ల మేర ఆటోలు, క్యాబ్‌లు బారులు తీరిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

హైదరాబాద్‌లో సీఎన్‌జీ సంక్షోభం

హైదరాబాద్ నగరంలో రోజువారీ సీఎన్‌జీ వినియోగం సుమారు 2.1 లక్షల కిలోలుగా ఉంటుంది. అయితే యుద్ధం వల్ల దిగుమతులు తగ్గడంతో సరఫరా దాదాపు 50 శాతానికి పడిపోయింది. నగరవ్యాప్తంగా ఉన్న 70కి పైగా సీఎన్‌జీ స్టేషన్ల వద్ద ఆటోలు, క్యాబ్‌లు, ఇతర ప్రైవేట్ వాహనాలు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. డ్రైవర్లు ఒక్కోసారి 6 నుండి 8 గంటల పాటు క్యూలో ఉంటున్నారు. ఇది వారి దైనందిన సంపాదనపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆవేదన చెందుతున్నారు.

సోషల్ మీడియాలో వీడియోలు వైరల్

ఎక్స్‌ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌లో నగరంలోని పెట్రోల్ బంకుల వద్ద ఉన్న లాంగ్ క్యూలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. వార్ వలన CNG సరఫరాలో వచ్చిన అంతరాయాన్ని నెటిజన్స్ ఎత్తి చూపుతున్నారు. కొన్ని చోట్ల ఆటో డ్రైవర్లు గ్యాస్ దొరకక ఆవేదన వ్యక్తం చేస్తుండగా, మరికొన్ని చోట్ల ఆటో సిలిండర్లలో వంట గ్యాస్‌ను నింపుకుంటున్న దృశ్యాలు నెటిజన్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

డ్రైవర్ల ఆవేదన - అక్రమ వసూళ్లు

తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) నివేదికల ప్రకారం.. గ్యాస్ కొరతను సాకుగా చూపి కొన్ని స్టేషన్లలో కిలోపై అదనంగా రూ.10 వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సంపాదన లేక ఒకవైపు, క్యూలో ట్రాఫిక్ ఇబ్బందులతో మరోవైపు డ్రైవర్లు సతమతమవుతుంటే ఈ అక్రమ వసూళ్లతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు తయారైంది.

ప్రభుత్వ చర్యలు

భారత్ తన ఎల్‌పీజీ/సీఎన్‌జీ అవసరాల్లో 90% గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. యుద్ధం వల్ల హార్ముజ్ జలసంధి గుండా రవాణా కష్టతరం కావడంతో ఈ సమస్య తలెత్తింది. అలాగే కేంద్ర ప్రభుత్వం Essential Commodities Act కింద గృహ అవసరాల ఎల్‌పీజీ (Domestic LPG)కి మొదటి ప్రాధాన్యత ఇచ్చింది. దీనివల్ల ఆటోమొబైల్, కమర్షియల్ రంగాలకు సరఫరా తగ్గింది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నప్పటికీ, పశ్చిమాసియాలో యుద్ధం ముగిసి సరఫరా మార్గాలు సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ తిప్పలు తప్పేలా లేవు. కాబట్టి ప్రయాణికులు ప్రత్యామ్నాయ ప్రయాణ సాధనాలు వెతుక్కోవడం మంచిదని సూచిస్తున్నారు.

Next Story