బాలిని ముంచెత్తిన వరదలు.. వీధుల్లోకి కొట్టుకు వస్తున్న భారీ పైథాన్లు!

by Muthe.Rajitha |

ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఇండోనేషియాలోని బాలి ద్వీపాన్ని భారీ వరదలు ముంచెత్తాయి.

బాలిని ముంచెత్తిన వరదలు.. వీధుల్లోకి కొట్టుకు వస్తున్న భారీ పైథాన్లు!
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఇండోనేషియాలోని బాలి ద్వీపాన్ని భారీ వరదలు ముంచెత్తాయి. వరుసగా మూడు రోజుల పాటు కురిసిన కుండపోత వర్షాలకు నదులు ఉప్పొంగి.. కుటా, సెమిన్యాక్, లెగియన్, చాంగు వంటి ప్రధాన పర్యాటక ప్రాంతాలు మోకాళ్లోతు నీటిలో మునిగిపోయాయి. రోడ్లన్నీ నదులను తలపిస్తుండటంతో స్థానిక విల్లాలు, నివాస సముదాయాల్లోకి వరద నీరు చేరింది. సాధారణంగా బాలిలో పాములు ఎక్కువగా ఉండటం వలన, వరదల ధాటికి అవి వీధుల్లోకి కొట్టుకు వస్తున్నాయి. అయితే భారీ పైథాన్లు కూడా వీధుల్లోకి వస్తుండటంతో స్థానికులు, పర్యాటకులు బెంబేలెత్తుతున్నారు.

వీధుల్లోకి పైథాన్లు!

ఈ వరదల నేపథ్యంలో బాలీలో ఒక భయాందోళన కలిగించే దృశ్యం వెలుగుచూసింది. అడవులు, బురద ప్రాంతాల్లో ఉండే భారీ రెటిక్యులేటెడ్ పైథాన్ (Reticulated Pythons) పాములు వరద ఉధృతికి కొట్టుకువచ్చి నివాస ప్రాంతాల్లో దర్శనమిచ్చాయి. దాదాపు 15 అడుగుల వరకు పెరిగే ఈ కొండచిలువలు వీధుల్లో, విల్లాల ముంగిట వరద నీటిలో అలవోకగా ఈత కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

ప్రజల్లో భయాందోళన

ఈ భారీ పైథాన్లు జనాల మధ్య తిరుగుతుండటంతో స్థానిక ప్రజలు, విదేశీ పర్యాటకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కొందరు పర్యాటకులు తమ విల్లాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. అయితే, ఈ సంఘటనల్లో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.

Next Story