రైతు స్వేదం... వ్యాపారికి సౌధం

by Ajay Maddhiboyina |   (  Updated:2026-07-10 02:22:18  IST  )

ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెట్టే రైతును అన్ని వర్గాలు మోసం చేస్తున్నాయి. పంట పెట్టుబడి సాయం మొదలుకొని పంట దిగుబడి వచ్చిన తర్వాత అమ్ముకునే సమయంలోను రైతాంగాన్ని మోసగిస్తున్న పరిణామాలు రైతాంగంలో తీవ్ర నిరాశతో పాటు ఆగ్రహాన్ని పెంచుతున్నాయి.

రైతు స్వేదం... వ్యాపారికి సౌధం
X

దిశ ప్రతినిధి, నిర్మల్: ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెట్టే రైతును అన్ని వర్గాలు మోసం చేస్తున్నాయి. పంట పెట్టుబడి సాయం మొదలుకొని పంట దిగుబడి వచ్చిన తర్వాత అమ్ముకునే సమయంలోను రైతాంగాన్ని మోసగిస్తున్న పరిణామాలు రైతాంగంలో తీవ్ర నిరాశతో పాటు ఆగ్రహాన్ని పెంచుతున్నాయి. అండగా నిలవాల్సిన అధికారులు, ప్రజా ప్రతినిధులు మోసకారుల వంత పాడుతుండడంతో రైతులు మోసపోవడం ఒక ఆనవాయితీగా మారిపోతున్నది. దీన్ని నిలువరించాల్సిన యంత్రాంగంలో చలనం లేకపోవడంతో ప్రతి ఏడాది రైతాంగానికి అన్యాయం జరుగుతూనే ఉన్నది. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అన్న సామెత... నిజమో కాదో అంతు చిక్కనిదిగా తయారవుతున్నది.

నకిలీ విత్తనం..ఎరువుల అక్రమం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ వర్షాకాలం సీజన్ ప్రారంభం నుండి రైతాంగాన్ని నకిలీ విత్తనాలు వెంటాడుతున్నాయి. మరోవైపు రైతులకు ఇవ్వాల్సిన ఎరువులు విషయంలో బ్లాక్ మార్కెట్ తరలించి ఎక్కువ ధరలతో అమ్ముకున్న వ్యవహారం భాదిస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ ఆదిలాబాద్ మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో సుమారు 7 లక్షల ఎకరాల్లో పత్తి పంట నాలుగు లక్ష ల ఎకరంలో సోయా పంట సాగు చేస్తున్నారు. అలాగే వరి పంట కూడా నిర్మల్ మంచిర్యాల జిల్లాలలో పెద్ద మొత్తంలో రైతులు సాగు చేస్తారు. అయితే రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాల్సిన వ్యాపారులు సొంత లాభం కోసం ప్రతిసారి నకిలీ విత్తనాలు అడ్డగడుతూ రైతులను మోసం చేస్తున్నారు. ఈ విషయంలో కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అసలు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు రైతాంగంలో ఉన్నాయి. ప్రధానంగా మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు పెద్ద మొత్తంలో పట్టుబడుతున్నప్పటికీ ఈ విషయంలో లోతుగా విచారించాల్సిన వ్యవసాయ శాఖ అసలు పట్టించుకోవడం లేదు. పోలీసులు టాస్క్ ఫోర్స్ అధికారులు నకిలీ విత్తనాలపై కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ శాశ్వతంగా నకిలీ విత్తనాలను అరికట్టడంలో వ్యవసాయ శాఖ విఫలం అవుతున్నదన్న ఆరోపణలు ఉన్నాయి ఇక నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రతిసారి జరిగినట్టుగానే సోయా విత్తనాల వ్యవహారంలో ఈసారి కూడా అక్రమాలు జరిగాయి నకిలీ విత్తనాలు అంటగట్టుతున్నప్పటికీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.

తేజస్వి విత్తనాలపై చర్యలు ఏవి..?

నిర్మల్ జిల్లాకు సంబంధించి బైంసా ప్రాంతంలో ఈ ఏడాది నకిలీ సోయాబీన్ విత్తనాలు పెద్ద మొత్తంలో సరఫరా అయినట్లు రైతులు ఆరోపిస్తున్నారు తేజస్వి బ్రాండ్ సోయాబీన్ విత్తనాలు పెద్ద మొత్తంలో బైంసా కుబీర్ తానూర్ మండలాల్లో రైతులకు అంటగట్టారు. దీనిపై వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి . బైంసాకు చెందిన వ్యాపారి ఒకరు రైతులకు నకిలీ సోయా విత్తనాలు అమ్మినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో రైతులు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోవడంలో అధికారులు వెనకడుగు వేయడం పై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఆ ప్రాంతం రాజకీయ నాయకులు పరోక్షంగా వ్యాపారికి సహకరించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. నష్టపోయిన రైతులకు మరోసారి విత్తనాలు ఇస్తానని వ్యాపారి చెప్పగా... తమకు జరిగిన నష్టం ఎవరు పూడుస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో రైతులకు అండగా నిలవాల్సిన యంత్రాంగం పరోక్షంగా వ్యాపారులకు సహకరించడంపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. అయితే అధికార పార్టీకి చెందిన ఒక మార్కెట్ నేత మాత్రం రైతుల వైపున నిలబడినట్లు చెబుతున్నారు.

ఎరువుల విషయంలో దగా...

మరోవైపు రైతులకు సేద్యం చేసే విషయంలో అత్యంత కీలకమైన ఎరువులు అందించే సందర్భంలో కూడా అనేక అక్రమాలు జరుగుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు అధికారులు ఎరువులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని అక్రమాలకు తావు లేకుండా సరఫరా చేస్తున్నామని చెబుతుండగా కొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు ఎరువుల పంపిణీలో అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి ఆసిఫాబాద్ జిల్లాలో రైతులు ఎక్కువ ధరలతో ఎరువులు అమ్ముతున్నారు అన్న వ్యవహారంపై కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు అయినప్పటికీ అధికారులు అలాంటి వ్యాపారులపై కఠినంగా వ్యవహరించకపోవడం పట్ల ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి ఇకనైనా రైతాంగానికి అధికార యంత్రాంగం అండగా నిలవాల్సిన అవసరం ఉంది.

Next Story