భోజన శాలలు ఇలా.. భోజనం చేసేది ఎలా..!

by Kodari Anjali |

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మౌళిక వసతులు కల్పనకు ప్రభుత్వం అన్నివిధాలుగా కృషి చేస్తోంది.

భోజన శాలలు ఇలా.. భోజనం చేసేది ఎలా..!
X

దిశ, చొప్పదండి: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మౌళిక వసతులు కల్పనకు ప్రభుత్వం అన్నివిధాలుగా కృషి చేస్తోంది. పాఠశాల విద్యావ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రణాళికలు చేస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చూడుతూ పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా విద్యాబోధన అందించాలనే దృడ సంకల్పంతో పాఠశాలలలో విద్యార్థులకు అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చేసేందుకు సౌకర్యంగా ఉండేందుకు డైనింగ్ హల్ లను మంజూరు చేసింది. మన ఊరు-మన బడి పథకం ద్వారా పట్టణంలో జిల్లా పరిషత్ బాలుర, బాలికల హై స్కూల్ తో పాటు మండలంలోని వెదురుగట్ట, గుమ్లాపూర్, రాగంపేట ప్రభుత్వ పాఠశాలలలో డైనింగ్ హల్ లను ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే వాటి నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. నిలిచిపోయిన నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. అధికారులు తగిన చర్యలు తీసుకొని వినియోగంలోకి తీసుకురాక అవి నిరూపయోగంగా మారాయి. ప్రభుత్వ పాఠశాలలలో చదువుకునే విద్యార్థులకు ఎంతో సదుపాయమని భావించి లక్షల నిధులు వెచ్చించి నిర్మాణాలు చేపట్టిన అవి ఉపయోగానికి దూరంగా ఉన్నాయి.

భోజన సమయంలో విద్యార్థుల తిప్పలు..

డైనింగ్ హల్ లు ఉపయోగపడక విద్యార్థులు మధ్యాహ్న భోజన సమయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోతుల బెడద నుంచి రక్షణ,ఎండకు ఉపశమనం, గాలి వీచినప్పుడు దుమ్ము, వర్షం కురిసినప్పుడు సమస్యలు లేకుండా పరిశుభ్రతతో క్రమపద్ధతిలో విద్యార్థులు ఒకే చోట భోజనం చేయడానికి డైనింగ్ హల్ లు దోహదం చేస్తాయి. అయితే ఈ అసంపూర్తితో ఉన్న డైనింగ్ హల్ లను వినియోగంలోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు ప్రారంభించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

డ్రైనింగ్ హల్‌ను ప్రారంభించాలి: అమ్మ ఆదర్శ కమిటీ చైర్ పర్సన్ అనుజ

విద్యార్థులకు కావలసిన అన్ని వసతులు ఉంటాయని భావించి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నారు. దీంతో పాఠశాలల్లో హాజరు శాతం పెరుగుతున్నాయి. విద్యార్థుల సౌకర్యం కోసం నిర్మించిన డైనింగ్ హల్ ను ప్రారంభించడానికి అధికారులు కృషి చేయాలని కోరుతున్నాం .

వర్షంతో విద్యార్థులకు ఇబ్బందులు: కడారి శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు, జిల్లా పరిషత్ బాలికల హై స్కూల్, చొప్పదండి

భోజన శాల పూర్తి కాకపోవడంతో అందులో భోజనం చేస్తున్న సమయంలో వర్షం వస్తే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. హల్ ను పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి అవసరమైన సామగ్రి సమకూర్చుతే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థుల సౌకర్యం కోసం దాతల సహాయంతో ఫ్యాన్ లు ఏర్పాటు చేశాం.

నీటి వసతి ఏర్పాటు చేయాల్సి ఉంది: జలీల్, ప్రధానోపాధ్యాయులు, జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్

డైనింగ్ హల్ పూర్తి స్థాయిలో నిర్మాణం అయింది. నీటి వసతి ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ డైనింగ్ హల్ ప్రాంతంలో ప్రహరీ గోడ లేనందున ఆ వైపు నుంచి మూత్ర విసర్జనకు లోనికి ప్రవేశించి అపరిశుభ్రత చేస్తున్నారు. పెండింగ్ పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకు రావలని కోరుతూ ఉన్నతాధికారులకు వినతి పత్రం అందజేశాం.

Next Story