మానేరుపై బ్రిడ్జి శంకుస్థాపన జరిగేనా..?

by Kodari Anjali |

మానేరు నదిపై బ్రిడ్జి నిర్మాణం చేపడితే గన్నేరువరం మండలంతో పాటు ఇల్లంతకుంట బెజ్జంకి మండలాల ప్రజలకు జిల్లా కేంద్రం కరీంనగర్ దగ్గరవుతుందని కన్న కలలు కలలుగానే మిగిలిపోతున్నాయి.

మానేరుపై బ్రిడ్జి శంకుస్థాపన జరిగేనా..?
X

దిశ, గన్నేరువరం: మానేరు నదిపై బ్రిడ్జి నిర్మాణం చేపడితే గన్నేరువరం మండలంతో పాటు ఇల్లంతకుంట బెజ్జంకి మండలాల ప్రజలకు జిల్లా కేంద్రం కరీంనగర్ దగ్గరవుతుందని కన్న కలలు కలలుగానే మిగిలిపోతున్నాయి. అసలు బ్రిడ్జి నిర్మాణం చేపడతారా లేదా అని ప్రజలు సంక్షేస్తున్నారు. దశాబ్ద కాలంగా మానేరు పై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని బ్రిడ్జి జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమం సాగగా అది కాస్త ఎన్నికల వాగ్దానమై అది నెరవేర్చుకునే క్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్ చొరవతో బ్రిడ్జి నిర్మాణానికి 70 కోట్లు నిధులు మంజూరు అవగా బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందని మండల ప్రజలకు విశ్వాసం కలిగింది. దీనికి తోడుగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అప్పటి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బ్రిడ్జి నిర్మాణానికి చొక్కా రావు పల్లె నుంచి ఖాజీపూర్ వరకు బ్రిడ్జి నిర్మాణం కోసం స్థల పరిశీలన చేపట్టారు కొంత కాలయాపన జరగడంతో అక్కడ నిర్మించకూడదని బ్రిడ్జి జేఏసీ నాయకులు మైలారం మైసమ్మ గుట్ట నుండి నిర్మించాలని ఉద్యమించారు.

శంకుస్థాపన కార్యక్రమం ఆగిపోవడంతో..

ఈ క్రమంలో మండల సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో మెజారిటీ సర్పంచులు మైలారం మైసమ్మ గుట్ట వద్ద నుండి బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ తీర్మాన పత్రాలు ఇరిగేషన్ డీఈకి అందజేసి వారి సమ్మతిని తెలిపారు. అయితే చొక్కారావుపల్లి లేదంటే మైలారం నుండి బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందని ప్రజలంతా భావిస్తే అనూహ్యంగా అధికారులు మాత్రం గన్నేరువరం నుండి ఎలగందులకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టడానికి సర్వే నిర్వహించి ఏకంగా మట్టి పరీక్షలు నిర్వహించారు. ఆరో తేదీన శంకుస్థాపనకు ఏర్పాట్లు చేశారు. బ్రిడ్జి శంకుస్థాపన కార్యక్రమం అనివార్య కారణాలవల్ల ఆగిపోయినట్లు ప్రచారం జరిగింది. శంకుస్థాపన కార్యక్రమం ఆగిపోవడంతో బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందా లేదా అని మండల ప్రజలు సంకోచిస్తున్నారు. మొదటి నుంచి మైలారం మైసమ్మ గుట్ట నుండి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఉద్యమించిన బ్రిడ్జ్ జేఏసీ నాయకులు గన్నేరువరం నుండి బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందని తెలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలుపడంతో పాటు మైసమ్మ గుట్ట వద్ద వంటావార్పు నిర్వహించారు. ఒకవైపు సర్పంచులు తీర్మానం మైలారం నుండి జరగాలని ఇచ్చినప్పటికీ గన్నేరువరం నుండి జరగడం ఏందని బాహాటంగా ప్రశ్నిస్తున్నారు.

గ్రానైట్ వ్యాపారానికి అనుకూలం.. బ్రిడ్జి జేఏసీ చైర్మన్ సంపత్ ఉదయ్ కుమార్

అధికారులు బడా రాజకీయ నాయకులు కుమ్మక్కై గ్రానైట్ వ్యాపారులకు వారి వాహనాల రవాణాకు అనుకూలంగా బ్రిడ్జి నిర్మాణం ఎలగందుల నుంచి గన్నేరువరానికి చేపడుతున్నారు. దశాబ్ద కాలంగా మైలారం మైసమ్మ గుట్ట నుండి నిర్మించాలని పోరాటం చేస్తే వచ్చిన బ్రిడ్జి తీరా గ్రానైట్ వ్యాపారుల అవసరాలకు మారడం శోచనీయం. వెంటనే అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండే మైలారం నుంచి నిర్మించాలి లేనిపక్షంలో మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.

Next Story