భూ భారతి ఆపరేటర్లకు ఉద్వాసన..14 నెలల వేతనాలు బకాయిలు

by Ajay Maddhiboyina |

మానుకోట జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల్లో ఏళ్లుగా సేవలందిస్తున్న భూ భారతి ఆపరేటర్ల (ఎఫ్ టీఎస్) భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. వారిని దశలవారీగా తొలగించేందుకు ఉన్నతాధికారులు చర్యలు ప్రారంభించినట్లు సమాచారం.

భూ భారతి ఆపరేటర్లకు ఉద్వాసన..14 నెలల వేతనాలు బకాయిలు
X

దిశ, మహబూబాబాద్ ప్రతినిధి: మానుకోట జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల్లో ఏళ్లుగా సేవలందిస్తున్న భూ భారతి ఆపరేటర్ల (ఎఫ్ టీఎస్) భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. వారిని దశలవారీగా తొలగించేందుకు ఉన్నతాధికారులు చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. ఎన్నో ఏళ్లుగా తాత్కాలిక ఉద్యోగాలకే పరిమితమై, శాశ్వత ఉపాధిపై ఆశలు పెట్టుకున్న ఉద్యోగులు ఒక్కసారిగా ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజలకు రెవెన్యూ సేవలు అందించడంలో కీలక పాత్ర పోషించిన తమను, ఎన్నికల విధులు మొదలుకొని ప్రభుత్వం అప్పగించిన ప్రతి బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించినా ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా విధుల నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తక్కువ రిజిస్ట్రేషన్ల సాకుతో తొలగింపు..

మానుకోట జిల్లాలోని 18 మండలాలకు ప్రస్తుతం 19 మంది ఎఫ్ టీఎస్ లు సేవలందిస్తున్నారు. అయితే చిన్న మండలాల్లో పనిచేస్తున్న ఎఫ్ టీఎస్ లను తొలగించి, కొన్ని పెద్ద మండలాల్లో మాత్రమే భూభారతి ఆపరేటర్లను కొనసాగించే ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. కొంతకాలం క్రితం పరిపాలనా అవసరాల మేరకు చిన్న మండలాలకు బదిలీ చేసిన ఉద్యోగులను ఇప్పుడు అక్కడ రిజిస్ట్రేషన్లు తక్కువగా ఉన్నాయనే కారణంతో తొలగించడం అన్యాయమని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. వారి స్థానంలో జూనియర్ అసిస్టెంట్లు లేదా రికార్డు అసిస్టెంట్లతో విధులు నిర్వహించే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే వీరిని విధుల్లోకి తీసుకోకపోతే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో స్థానిక తహసీల్దార్లకు ఇబ్బందులు తప్పవన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్రవ్యాప్త సమస్య..!

ఇది ఒక్క మహబూబాబాద్ జిల్లాకు మాత్రమే పరిమితమైన అంశం కాదు. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 632 మంది ఎఫ్ టీఎస్ లు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చాలా ఏళ్లుగా అవుట్‌ సోర్సింగ్ విధానంలో రెవెన్యూ శాఖకు సేవలందిస్తున్న వీరు కంప్యూటర్ ఆధారిత రికార్డుల నిర్వహణ, దరఖాస్తుల ప్రాసెసింగ్, రిజిస్ట్రేషన్ సేవలు, ఎన్నికల విధులు, ప్రత్యేక ప్రభుత్వ కార్యక్రమాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. గతంలో వీరి సేవలు అవసరమని అధికారులే నివేదికలు పంపినప్పటికీ, ఇప్పుడు వారిని కొనసాగించవద్దన్న నిర్ణయం ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది.

14 నెలల వేతనాలు బకాయి...

జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఎఫ్ టీఎస్ లకు గతేడాది నుంచి ఇప్పటి వరకు సుమారు 14 నెలల వేతనాలు బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. వేతనాలు చెల్లించకుండా విధులు చేయించుకున్న ప్రభుత్వం, ఇప్పుడు ఉద్యోగాల నుంచి తప్పించేందుకు సిద్ధమవడంపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు జీతాలు లేక,మరోవైపు ఉద్యోగ భద్రత లేక కుటుంబాలను ఎలా పోషించాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.న్యాయంగా రావాల్సిన వేతనాలు ఎప్పుడు వస్తాయో, అసలు వస్తాయో లేదో కూడా తెలియని పరిస్థితి ల్లో ఉన్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పోరుబాటకు సిద్ధం..

ఉద్యోగాల కొనసాగింపు, 14నెలల బకాయి వేతనాల చెల్లింపు, ఉద్యోగ భద్రత, పేస్కేల్ అమలు, ఆరోగ్య బీమా, మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎఫ్ టీఎస్ లు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్‌ తో పాటు సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పించిన వారు త్వరలో రాష్ట్రస్థాయి అధికారులను కలిసి సమస్యలను వివరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సేవలను యథావిధిగా కొనసాగించాలని,లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.

ప్రభుత్వం పునరాలోచన చేయాలి..

చాలాఏళ్లుగా చాలీచాలని వేతనాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నాం. ఎప్పటికైనా పర్మినెంట్ కాకపోతుందా అన్న ఆశతో ఉన్నాం. ఇప్పుడు వద్దు అంటే కుటుంబ నిర్వహణ బాధ్యతతో ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. ఇప్పటి కైనా మా విషయం పై ప్రభుత్వం పునరాలోచించాలి.

–ఎఫ్ టీఎస్ మానుకోట జిల్లా అధ్యక్షుడు ఉదయ్

Next Story