వాట్సాప్ ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌.. కేంద్రం నోటీసులపై ‘Meta’ షాకింగ్ రిప్లై!

by Kema Shiva Kumar |

వాట్సాప్ తీసుకొస్తున్న ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌పై కేంద్రం నోటీసులకు మెటా (Meta) సమాధానం ఇచ్చింది.

వాట్సాప్ ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌.. కేంద్రం నోటీసులపై ‘Meta’ షాకింగ్ రిప్లై!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ (Whatsaap)లో యాజమాన్యం మెటా (Meta) తీసుకురాబోతున్న యూజర్ నేమ్ (User Name) ఫీచర్‌పై ఇటీవల కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ నోటీసులకు తాజాగా ‘మెటా’ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం వారి వివరణను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ (Union Ministry of IT) పరిశీస్తున్నట్లుగా అధికారిక వర్గాలు పేర్కొన్నారు. అయితే, ‘యూజర్ నేమ్’ ఫీచర్ ఇంకా లైవ్ కాలేదని, ఈ ఏడాది చివర్లో దశలవారీగా అందుబాటులోకి తెస్తామని వాట్సాప్ ప్రతినిధులు వారి వివరణలో తెలిపారు. యాప్ దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి తాము పలు రకాల రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు.

ఫోన్ నెంబర్ హైడ్ చేయవచ్చు..

తాము తీసుకురాబోయే యూజర్ నేమ్ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ ఫోన్ నంబర్‌ను ఇతరులకు షేర్ చేయకుండానే హైడ్ చేసి చాట్ చేయవచ్చని పేర్కొన్నారు. కానీ, కొత్త వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ఫోన్ నంబర్ తప్పనిసరి అని తెలిపారు. అయితే, యూజర్ నేమ్ విషయంలో ఇప్పటికే ప్రభుత్వ సంస్థలు, సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, వెరిఫైడ్ ఖాతాల పేర్లను వాట్సాప్ ముందే రిజర్వ్ చేసింది. దీంతో పేర్లతో ఫేక్ అకౌంట్ల (Fake Accounts)ను ఎవరూ కూడా క్రియేట్ చేయలేరని వాట్సాప్ తన వివరణలో చెప్పుకొచ్చింది. ఒక అకౌంట్ నుంచి కొత్తగా ఎంతమందికి మెసేజ్ పంపాలో పరిమితి ఉంటుందని.. అలాగే యూజర్‌ నేమ్‌లను పదే పదే ఊహించి టైప్ చేసే ప్రయత్నాలను కూడా అడ్డుకుంటామని తెలిపారు. ఇక ఎవరైనా కొత్త యూజర్‌ నేమ్ ద్వారా మెసేజ్ పంపితే, సదరు అకౌంట్ కొత్తదా.. పాతదా? మీ ఇద్దరికీ కామన్ గ్రూపులు ఉన్నాయా? లేదా అది వేరే దేశానికి చెందిన అకౌంటా? అనే వివరాలను వాట్సాప్ స్క్రీన్‌పై చూపిస్తుందని ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

కాగా, వాట్సాప్ ప్రతిపాదించిన ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌తో ఆన్‌లైన్ మోసాలు, ఫిషింగ్, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు, ఇతరుల పేర్లతో నకిలీ ప్రొఫైళ్లు సృష్టించి మోసం చేసే నేరాలు పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం ఇటీవల మాతృ సంస్థకు ‘మెటా’ సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ వాట్సాప్ ఇచ్చిన సమధానం చర్చనీయాంశంగా మారింది.

Next Story