భారీ హవాలా రాకెట్‌ గుట్టురట్టు.. రూ.2 కోట్ల నగదు, నేపాల్ కరెన్సీ స్వాధీనం

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-23 03:55:47  IST  )

భారీ హవాలా రాకెట్‌ గుట్టురట్టైన ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది.

భారీ హవాలా రాకెట్‌ గుట్టురట్టు.. రూ.2 కోట్ల నగదు, నేపాల్ కరెన్సీ స్వాధీనం
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ (Kanpur)లో పోలీసులు భారీ హవాలా రాకెట్‌ను గుట్టురట్టు చేశారు. నగరంలోని ధన్‌కుటి (Dhankuti) ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న అక్రమ వ్యాపారాలపై మెరుపు దాడులు నిర్వహించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్‌లో భారీగా నగదు, వెండి, విదేశీ కరెన్సీ పట్టుబడటం స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే.. ధన్‌కుటి పరిసరాల్లో హవాలా లావాదేవీలతో పాటు అక్రమ బెట్టింగ్, ట్రేడింగ్ జరుగుతున్నట్లుగా పోలీసులకు పక్కా సమాచారం అందింది. అనంతరం రంగంలోకి దిగిన ఏడీసీపీ సుమిత్ రామ్‌టేకే టీమ్ నిందితుల స్థావరాలపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో నిందితుల నుంచి సుమారు రూ.2 కోట్ల కరెన్సీ నోట్లు, 61 కిలోల స్వచ్ఛమైన వెండి, భారీ మొత్తంలో నేపాల్ దేశ కరెన్సీ లభ్యమైంది. అరెస్టయిన ఐదుగురు వ్యక్తులు హవాలా మార్గంలో డబ్బును తరలిస్తూ.. బెట్టింగ్ మాఫియాతో సంబంధాలు కలిగి ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ముఖ్యంగా వారి వద్ద నేపాల్ కరెన్సీ లభించడంతో ఈ రాకెట్‌కు సరిహద్దులు దాటి అంతర్జాతీయ ముఠాలతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా సుమిత్ రామ్‌టేకే మాట్లాడుతూ.. అక్రమ ట్రేడింగ్, బెట్టింగ్ కార్యకలాపాలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ దాడులు చేశామని అన్నారు. పట్టుబడిన నగదు, వెండికి సంబంధించి నిందితులు ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారని ఆయన వెల్లడించారు.

Next Story