స్టాక్ మార్కెట్ల భారీ పతనం.. ఇన్వెస్టర్ల రూ. 5 లక్షల కోట్ల సంపద ఆవిరి

by Malleboina Mahesh |

నేడు స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 850, నిఫ్టీ 240 పాయింట్లు నష్టపోయాయి. అంతర్జాతీయ యుద్ధ భయాలే ఈ పతనానికి ప్రధాన కారణం.

స్టాక్ మార్కెట్ల భారీ పతనం.. ఇన్వెస్టర్ల రూ. 5 లక్షల కోట్ల సంపద ఆవిరి
X

దిశ, వెబ్ డెస్క్: అంతర్జాతీయంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితులు స్టాక్ మార్కెట్ల(Stock markets)ను భారీగా దెబ్బ తీశాయి. ఈ రోజు(24-02-2026) ఉదయం నుంచి ప్రతికూల సంకేతాలతో ప్రారంభమైన సెన్సెక్స్, ఒక దశలో వెయ్యి పాయింట్లకు పైగా పతనమై ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేసింది. చివరకు సెన్సెక్స్ సుమారు 850 పాయింట్లు నష్టపోయి 76,200 వద్ద నిలిచింది. మరోపక్క నిఫ్టీ 240 పాయింట్లు పడిపోయి 23,150 స్థాయికి చేరుకుంది. దీంతో ఈ ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ. 5 లక్షల కోట్ల మేర ఆవిరైనట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కాగా స్టాక్ మార్కెట్ల పతనానికి అంతర్జాతీయ పరిణామాలు (International developments) ప్రధాన కారణమయ్యాయి. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్త మార్కెట్లలో అనిశ్చితిని సృష్టించాయి. దీనికి తోడు క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఉండటం, అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపుపై ఫెడరల్ రిజర్వ్ ఎటువంటి సానుకూల నిర్ణయం తీసుకోక పోవడం వంటి అంశాలు విదేశీ ఇన్వెస్టర్లను అమ్మకాల వైపు నడిపించాయి. ఈ క్రమంలో దేశీయంగా బ్యాంకింగ్, ఐటీ , ఆటో రంగాల షేర్లు భారీగా నష్టపోయి మార్కెట్‌ను కిందకు లాగాయి.

స్టాక్ మార్కెట్లు తాజా పతనంపై మార్కెట్ నిపుణులు.. ఒక తాత్కాలిక సవరణగా (Correction) అభివర్ణిస్తున్నారు. గరిష్ట స్థాయిల్లో ఉన్న మార్కెట్లలో మదుపర్లు లాభాలను స్వీకరించడం (Profit Booking) సహజమని, కానీ ప్రస్తుత గ్లోబల్ పరిస్థితులను బట్టి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో మార్కెట్లలో మరింత ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉన్నందున, చిన్న పెట్టుబడిదారులు నాణ్యమైన షేర్లలో విడతల వారీగా పెట్టుబడి పెట్టాలని, స్టాప్-లాస్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Next Story