బాబోయ్ స్కూల్ బ్యాగులో 'బుస'.. మూడో తరగతి బాలిక పుస్తకాల మధ్య భారీ నాగుపాము

by Malleboina Mahesh |

మూడో తరగతి చదువుతున్న బాలిక స్కూల్ బ్యాగులో పుస్తకాల మధ్య దూరిన నాగుపామును స్నేక్ క్యాచర్ శ్యామ్ సురక్షితంగా పట్టుకున్నారు. బాలిక సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బ్యాగులు, షూస్ వంటి వస్తువులను వాడే ముందు ఒకసారి తనిఖీ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

బాబోయ్ స్కూల్ బ్యాగులో బుస.. మూడో తరగతి బాలిక పుస్తకాల మధ్య భారీ నాగుపాము
X

దిశ, వెబ్ డెస్క్: స్కూల్ ముగించుకొని ఇంటికొచ్చిన మూడో తరగతి విద్యార్థి బ్యాగ్ నుంచి బుసలు కొడుతున్న శబ్ధం రావడంతో తెరచి చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. విద్యార్థి బ్యాగులో పుస్తకాల మధ్యలో భారీ నాగుపాము బుసలు గొడుతూ కనిపించింది. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని మైసూరు జిల్లా యలవాల పరిధిలో వెలుగుచూసింది. మథురానగర్ ప్రాంతానికి చెందిన రుచిత అనే మూడో తరగతి బాలిక, స్కూలు ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత తన బ్యాగును పుస్తకాలు తీసేందుకు తెరవగా.. బుసలు కొడుతూ.. లోపల ఏదో కదులుతున్నట్లు గమనించింది. అప్రమత్తమైన ఆ చిన్నారి వెంటనే బ్యాగును పక్కకు పడేసి తల్లిదండ్రులకు సమాచారం అందించింది. వారు బ్యాగు లోపలికి పరిశీలించగా, పుస్తకాల మధ్యలో కుదురుగా కూర్చుని ఉన్న భారీ నాగుపామును చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

ప్రమాదాన్ని పసిగట్టిన కుటుంబ సభ్యులు వెంటనే మైసూరుకు చెందిన ప్రముఖ ఉరగ సంరక్షకుడు (Snake Catcher) శ్యామ్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న శ్యామ్ చాకచక్యంగా ఆ స్కూల్ బ్యాగును తెరిచి సుమారు 2.5 అడుగుల పొడవున్న విషపూరితమైన నాగుపామును బయటకు తీశాడు. బాలిక సమయస్ఫూర్తితో బ్యాగును వదిలేయడం వల్ల పెను ప్రమాదం తప్పిందని, లేదంటే ఆ విష సర్పం కాటు వేసే అవకాశం ఉండేదని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆ పామును సురక్షితంగా సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

ఈ సందర్భంగా 'స్నేక్' శ్యామ్ విద్యార్థులకు, తల్లిదండ్రులకు కీలక సూచనలు చేశారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో చల్లదనం కోసం పాములు ఇలాంటి చీకటి ప్రదేశాల్లోకి దూరే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యంగా పిల్లలు ఆటస్థలాల్లో లేదా తరగతి గదుల్లో స్కూల్ బ్యాగులను నిర్లక్ష్యంగా తెరచి ఉంచకూడదని, బ్యాగ్ వేసుకునే ముందు ఒకసారి పుస్తకాలను సరిచూసుకోవాలని సూచించారు. స్కూల్ బ్యాగులకు ఎప్పుడూ జిప్ వేసి ఉంచడం ద్వారా ఇలాంటి ప్రమాదాల నుండి రక్షించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.

Next Story