దేశంలోని ఇళ్లల్లో, ఆలయాల్లో ఎంత బంగారం ఉందో తెలిస్తే షాక్ అవుతారు!

by Muthe.Rajitha |

భారతీయుల ఇళ్లల్లో ఉన్న బంగారం ప్రపంచంలోనే ఏ దేశ ప్రభుత్వం వద్ద లేనంత భారీ స్థాయిలో సుమారు 30 వేల టన్నులు ఉన్నట్లు అంచనా.

దేశంలోని ఇళ్లల్లో, ఆలయాల్లో ఎంత బంగారం ఉందో తెలిస్తే షాక్ అవుతారు!
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో ఉన్న బంగారంపై ఇటీవల కేంద్రమంత్రి పి.పి. చౌదరి చేసిన వ్యాఖ్యలు వార్తల్లో నిలిచాయి. భారత్ లోని కుటుంబాలు, ఆలయాల్లో ఉన్న 10 ట్రిలియన్ డాలర్ల విలువైన బంగారం నిల్వలను వినియోగంలోకి తేవాలి అని అధికారులకు సూచించడం సంచలనం రేపింది. అయితే ఈ క్రమంలో అసలు భారతీయ కుటుంబాల వద్ద ఉన్న బంగారం నిల్వలు ప్రపంచంలోనే ఏ దేశ ప్రభుత్వం వద్ద లేనంత భారీ స్థాయిలో ఉన్నట్టు తెలుస్తోంది. తాజా గణాంకాల ప్రకారం, భారతీయ ఇళ్లల్లో సుమారు 25,000 నుండి 30,000 టన్నుల బంగారం ఉన్నట్లు అంచనా. ప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్ ధరల దీని విలువ సుమారు 10 ట్రిలియన్ డాలర్లు అంటే దాదాపు 950 లక్షల కోట్ల వరకు ఉండవచ్చు అని అంచనా. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ వంటి అభివృద్ధి చెందిన దేశాల అధికారిక బంగారు నిల్వలను కలిపినా, భారతీయ గృహిణుల వద్ద ఉన్న బంగారం ముందు అవి తక్కువే. భారతదేశంలోని నగలు ధరించడంపై మక్కువ ఉండటం, షేరు మార్కెట్లపై అవగాహన లేకపోవడం వల్ల డబ్బును బంగారం రూపంలో దాచుకుంటారు. ఇలా దేశంలోని మొత్తం బంగారంలో దాదాపు 60% గ్రామీణ భారతంలోనే నిక్షిప్తమై ఉంది. భారతీయులు తమ పొదుపు మొత్తంలో కనీసం 10-15% బంగారు ఆభరణాల రూపంలో దాచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు.

ఇక భారతదేశంలోని వేల ఏళ్ల నాటి పురాతన ఆలయాలు ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆధ్యాత్మిక కేంద్రాలుగా వెలుగొందుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాల వద్ద సుమారు 3,000 నుండి 4,500 టన్నుల బంగారం ఉన్నట్లు వివిధ సర్వేలు చెబుతున్నాయి. ప్రధానంగా కేరళంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం నేలమాళిగల్లో(Vaults) ఉన్న పురాతన బంగారు నాణేలు, వజ్రాలు పొదిగిన విగ్రహాలు, ఆభరణాల విలువ సుమారు రూ.1,00,000 కోట్లకు పైగా ఉంటుందని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిన గణాంకాలు సూచిస్తున్నాయి. అలాగే ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద సుమారు 11.5 నుండి 12.5 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. భక్తులు హుండీ ద్వారా సమర్పించే బంగారాన్ని టీటీడీ 'గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్' కింద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తుంది. దీని ద్వారా ఏటా వందల కిలోల బంగారం వడ్డీ రూపంలోనే ఆలయానికి లభిస్తుంది. అంతేకాదు నాసిక్ లోని షిరిడీ సాయిబాబా ఆలయం వద్ద సుమారు 380 కిలోల బంగారం, ముంబైలోని సిద్ధవినాయక ఆలయం వద్ద 160 కిలోలకు పైగా, అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్ వద్ద వందల కిలోల బంగారం ఆభరణాల రూపంలోనూ, గాలిగోపురాల తాపడం రూపంలోనూ ఉన్నాయి. ఇవే కాకుండా పూరీ జగన్నాథ ఆలయం, మదురై మీనాక్షి ఆలయాల వద్ద కూడా భారీగా ప్రాచీన బంగారు ఆభరణాలు భద్రపరచబడి ఉన్నాయి.

ఇళ్లల్లో, ఆలయాల్లోనే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడే అధికారిక నిల్వలు కూడా గణనీయంగానే ఉన్నాయి. అంతర్జాతీయ అనిశ్చితిని తట్టుకోవడానికి ఆర్‌బీఐ తన బంగారు నిల్వలను నిరంతరం పెంచుకుంటూ వస్తోంది. ప్రస్తుతం ఆర్‌బీఐ వద్ద సుమారు 880 నుండి 900 టన్నుల బంగారం ఉంది. ఇందులో అధిక భాగం విదేశీ బ్యాంకుల్లో (Bank of England) భద్రపరచగా, కొంత భాగం స్వదేశంలోనే ఉంది. ఆధునిక కాలంలో ఫిజికల్ గోల్డ్ కంటే గోల్డ్ ఈటీఎఫ్‌లు (ETFs), సావరిన్ గోల్డ్ బాండ్ల (SGB) రూపంలో సుమారు 100 టన్నుల బంగారం పెట్టుబడిగా ఉంది. మొత్తంగా చూస్తే, భారతదేశం యొక్క సగటు బంగారు నిల్వలు అంటే ఇళ్లు, ఆలయాలు, బ్యాంకులు, ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కలిపి సుమారు 45,000 నుండి 50,000 టన్నుల వరకు ఉండవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

Next Story