- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ" : ప్రచురించబడని పుస్తకం ప్రతులు పార్లమెంటులోకి ఎలా వచ్చాయి?
భారత మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణే రాసిన పుస్తకం ఇప్పుడు దేశంలో పెద్ద వివాదంగా మారింది.

దిశ, వెబ్ డెస్క్ : భారత మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణే రాసిన పుస్తకం ఇప్పుడు దేశంలో పెద్ద వివాదానికి కారణం అయింది. ఈ పుస్తకం పేరు "ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ". ఇది నరవణే తన జీవిత అనుభవాలు, ఆర్మీ చీఫ్‌గా పనిచేసిన సమయంలో జరిగిన విషయాల గురించి రాసిన ఆత్మకథ. ఈ పుస్తకం 2024లోనే విడుదల కావాల్సి ఉంది. పబ్లిషర్ ప్రచురణకు సిద్ధం కాగా ప్రీ-ఆర్డర్లు కూడా మొదలయ్యాయి. కానీ కేంద్ర రక్షణ శాఖ నుంచి అనుమతి రాకపోవడంతో పుస్తకం విడుదల ఆగిపోయింది. ఇప్పటికీ (2026లో కూడా) ఈ పుస్తకం అధికారికంగా బయటకు రాలేదు. కారణం ఏమిటంటే.. ఇందులో గల్వాన్ ఘర్షణ, పుల్వామా ఘటన లాంటి సున్నితమైన విషయాలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇవి జాతీయ భద్రతకు సంబంధించినవి కావడంతో అనుమతి ఇవ్వలేదు.
ఇలాంటి పరిస్థితిలో ఈ పుస్తకం ప్రతులు పార్లమెంట్‌లో కనిపించడం బిగ్ షాకింగ్ గా మారింది. ఫిబ్రవరి 2026లో లోక్‌సభ బడ్జెట్ సమావేశాల సమయంలో పార్లమెంటులో కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఈ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని చూపిస్తూ.. పుస్తకంలోని కొన్ని భాగాలను చదవాలని ప్రయత్నించారు. అందులో గల్వాన్ ఘర్షణ సమయంలో కేంద్ర నాయకత్వం సరైన నిర్ణయాలు తీసుకోలేదని, స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదని ఉన్నట్లు రాహుల్ చెప్పారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. స్పీకర్ వెంటనే కలుగజేసుకొన.. "విడుదల కాని పుస్తకంలోని వ్యాఖ్యాలను చదవకూడదు" అని చెప్పారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా స్పందిస్తూ.. “ఈ పుస్తకం ఇంకా అధికారికంగా ఉనికిలోనే లేదు” అన్నారు. అనంతరం పుస్తకంలోని అంశాలపై పార్లమెంటులో చర్చకు ప్రతిపక్ష నేతలు పట్టుబట్టడంతో, సభలో గందరగోళం నెలకొని 8 మంది ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు.
ఇక్కడ బిగ్ మిస్టరీ ఏంటంటే?... ప్రచురణకు అనుమతి రాని పుస్తకం పార్లమెంట్‌కు ఎలా వచ్చింది? ఈ పుస్తకం PDF రూపంలో సోషల్ మీడియాలో కొంతకాలంగా తిరుగుతోందని తెలుస్తోంది. కానీ రాహుల్ గాంధీ చూపింది పూర్తి ప్రింట్ చేసిన హార్డ్‌కవర్ పుస్తకం. ఇది ఎలా బయటకు వచ్చిందన్నదే పెద్ద మిస్టరీగా మారింది. ఇది పబ్లిషింగ్ సంస్థ నుంచి లీక్ అయిందా, లేక ఇంకెక్కడైనా నుంచి వచ్చిందా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ అంశంపై ఢిల్లీ పోలీసులు FIR కూడా నమోదు చేశారు. సున్నితమైన సైనిక సమాచారాన్ని లీక్ చేశారనే కోణంలో విచారణ జరుగుతోంది.
ఈ వివాదం రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపింది. బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆయన సైన్యం గౌరవాన్ని దెబ్బతీశారని, పార్లమెంట్ నిబంధనలు ఉల్లంఘించారని అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం కేంద్ర ప్రభుత్వం చర్చకు భయపడుతోందని, నిజాలు బయటకు రాకుండా అడ్డుకుంటోందని విమర్శిస్తోంది. ఈ మొత్తం వ్యవహారం గల్వాన్ ఘర్షణపై మళ్లీ దేశవ్యాప్తంగా చర్చ మొదలయ్యేలా చేసింది. ఒక విడుదల కాని ఆర్మీ చీఫ్ పుస్తకం ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.






