- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేదల ఇల్లు.. ప్రభుత్వ బాధ్యత: మంత్రి పొన్నం ప్రభాకర్
"పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం" అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

దిశ, హుస్నాబాద్: "పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం" అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆదివారం హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, వడ్డీ లేని రుణాలు, చీరల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ముందుగా సిద్దిపేట రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ‘నమస్తే స్టాచ్యూ’ ను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ రహదారిపై ఏర్పాటు చేస్తున్న క్రీడాకారుల విగ్రహాల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన 372 మందికి ఇళ్ల మంజూరు పత్రాలు అందజేసిన మంత్రి.. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఇల్లు కట్టుకునే వారికి 8 ట్రాక్టర్ల ఇసుక ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించారు.
మహిళా సాధికారతలో భాగంగా 3,520 మందికి రూ. 1.13 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులను, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు గ్రామాల్లో స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేశామని, ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే క్యాన్సర్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. హుస్నాబాద్ ముఖచిత్రాన్ని మార్చేలా 250 పడకల ఆసుపత్రి, ఇంజనీరింగ్ కాలేజీ, ఎల్లమ్మ చెరువు వద్ద అద్దాల బ్రిడ్జి, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కరీంనగర్ నుంచి ఫోర్-లేన్ రోడ్డు, గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






