ఖైతాపురం దళితవాడలో సమస్యల పై ఇంటింటి సర్వే

by Batti.Sumithra |

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామంలోని దళితవాడలో ప్రజాసమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (సీపీఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు గంగదేవి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఖైతాపురం దళితవాడలో సమస్యల పై ఇంటింటి సర్వే
X

దిశ, చౌటుప్పల్ టౌన్ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామంలోని దళితవాడలో ప్రజాసమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (సీపీఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు గంగదేవి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం చౌటుప్పల్ మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం దళితవాడలో ఇంటింటి సర్వే నిర్వహించి ప్రజల సమస్యలను నమోదు చేశారు. సర్వే సందర్భంగా గ్రామస్తులు గత మూడు నుంచి నాలుగు సంవత్సరాలుగా తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. గ్రామంలోని వాటర్ ఫిల్టర్ మరమ్మతులకు నోచుకోకపోవడంతో తాగునీటి కోసం ప్రతి క్యాన్‌కు రూ.10 చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఈ సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. అలాగే గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధిలైట్లు వంటి మౌలిక వసతులు కల్పించాలని, అర్హులైన దళిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు అందించాలని గ్రామస్తులు కోరారు. ఈ సందర్భంగా గంగదేవి సైదులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం అందిస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు బోయ యాదయ్య, యాట బాలరాజు, మండల సహాయ కార్యదర్శి నేరేడు మహేష్, మండల నాయకుడు తగరం ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story