గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం

by Batti.Sumithra |

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని మర్తిడి గ్రామంలో మంగళవారం గ్యాస్ సిలిండర్ పేలడంతో ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది.

గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం
X

దిశ, బెజ్జూర్ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని మర్తిడి గ్రామంలో మంగళవారం గ్యాస్ సిలిండర్ పేలడంతో ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం బెజ్జూర్ మండలం మర్తిడి గ్రామానికి చెందిన ఆత్రం మహేష్ ఇంట్లో మంగళవారం గ్యాస్ సిలిండర్ పేలింది. ఉదయం మహేష్ భార్య బుజ్జక్క వంట చేసి వ్యవసాయ పనులకు వెళ్లిపోయింది. అనంతరం ఇంట్లో పెద్ద శబ్దం రావడంతో గ్రామస్థులు మహేష్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మహేష్ వ్యవసాయ పనులు వదిలి సంఘటన స్థలానికి చేరుకోగా, ఇంట్లో ఎవరూ లేని సమయంలో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు పూర్తిగా దగ్ధమైనట్లు గుర్తించారు.

ఈ ఘటనలో ఇంట్లో ఉన్న రూ.60,000 నగదు, అర తులం బంగారం, యూరియా బస్తాలు, బియ్యం బస్తాలు, దుస్తులు, ఇతర గృహోపకరణాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. మొత్తం సుమారు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, కాగజ్‌నగర్ అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో మరింత పెద్ద ప్రమాదం తప్పింది. సంఘటనా స్థలాన్ని బెజ్జూర్ తహసీల్దార్ రామ్మోహన్‌రావు, ఎస్‌ఐ సర్తాజ్ పాషా, స్థానిక సర్పంచ్ మన్నెంపెల్లి మల్లేష్, కాంగ్రెస్ నాయకుడు భూస శంకర్ యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆత్రం రాజారాం సందర్శించి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తమకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.

Next Story