- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్‌లో ఘోర విషాదం
నిజామాబాద్ జిల్లా మెండోరా మండల పరిధిలోని శ్రీరాంసాగర్ (ఎస్సారెస్పీ) ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ వద్ద ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది.

దిశ, మెండోరా : నిజామాబాద్ జిల్లా మెండోరా మండల పరిధిలోని శ్రీరాంసాగర్ (ఎస్సారెస్పీ) ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ వద్ద ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. విహారయాత్రకు వచ్చిన నలుగురు యువకులు నీటిలో గల్లంతుకాగా, వారిలో ముగ్గురు మృతి చెందారు. మరో యువకుడి కోసం గాలింపు కొనసాగుతోంది. పోలీసుల వివరాల ప్రకారం, మహారాష్ట్రలోని బోకర్ గ్రామానికి చెందిన ఆర్హాన్ (17), నిజామాబాద్ నగరంలోని ఆటోనగర్‌కు చెందిన కలీం (24), అమ్ము అలియాస్ నజావత్ (24), అజీమ్ (24) కలిసి ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్ ప్రాంతానికి విహారయాత్రకు వచ్చారు. ఈ సందర్భంగా వరద కాలువ సమీపంలో స్నానం చేస్తుండగా లోతైన గుంతలో చిక్కుకుని నీటిలో గల్లంతయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు, గజ ఈతగాళ్లు, స్థానికుల సహాయంతో వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో నజావత్, ఆర్హాన్ (రేహన్‌గా కూడా పిలుస్తారు), కలీం మృతదేహాలను వెలికితీశారు. మరో యువకుడు అజీమ్ కోసం గజ ఈతగాళ్లు, పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. చీకటి పడటంతో రెస్క్యూ ఆపరేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేసి, సోమవారం ఉదయం తిరిగి గాలింపు చేపడతామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే సీపీ సాయి చైతన్యతో పాటు సీఐ జాన్ రెడ్డి, ముప్కాల్ ఎస్‌ఐ కిరణ్ కుమార్, మెండోరా ఎస్‌ఐ సుహాసిని సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ విషాద ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
రీల్స్ కోసం ప్రాణాలను పణంగా పెట్టొద్దు : సీపీ సాయి చైతన్య
వర్షాకాలంలో ప్రాజెక్టులు, బ్యాక్‌వాటర్ ప్రాంతాలు, వరద కాలువలు, చెరువులు, నదుల వద్ద సెల్ఫీలు దిగడం, రీల్స్ చిత్రీకరించడం లేదా ఈతకు దిగడం అత్యంత ప్రమాదకరమని సీపీ సాయి చైతన్య హెచ్చరించారు. నీటి లోతు, ప్రవాహం తెలియని ప్రాంతాల్లోకి వెళ్లకూడదని, ప్రాణ భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రకృతిని ఆస్వాదించేందుకు వచ్చే పర్యాటకులు, యువత మరింత అప్రమత్తంగా ఉండాలని, ఈత రాని వారు నీటి సమీపంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పోలీసులు, సంబంధిత శాఖలు జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.






