కోరుట్లలో ఘోరం.. భర్త చేతిలో యూట్యూబర్‌ వైష్ణవి దారుణ హత్య

by Malleboina Mahesh |   (  Updated:2026-03-17 10:05:44  IST  )

కోరుట్ల మండలం మాదాపూర్‌లో యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య. గర్భిణి అని చూడకుండా కత్తితో దాడి చేసిన భర్త హరిబాబు. నిందితులకు ఉరిశిక్ష వేయాలని బాధితుల కుటుంబం డిమాండ్.

కోరుట్లలో ఘోరం.. భర్త చేతిలో యూట్యూబర్‌ వైష్ణవి దారుణ హత్య
X

దిశ, వెబ్ డెస్క్/కోరుట్ల రూరల్: కట్టుకున్న భర్త గర్భవతి అయిన భార్యను హత్య చేశాడు. ఈ షాకింగ్ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని మాదాపూర్ గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా యూట్యూబర్‌గా గుర్తింపు పొందిన వైష్ణవి (YouTuber Vaishnavi) తన భర్త చేతిలోనే దారుణ హత్య (Brutal murder)కు గురైంది. సుమారు రెండేళ్ల క్రితం చిత్తారి హరిబాబు అనే యువకుడిని వైష్ణవి ప్రేమ వివాహం చేసుకుంది. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా చిన్నపాటి మనస్పర్థలు వస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి దంపతుల మధ్య గొడవ జరగగా, అది కాస్తా తీవ్రంగా మారినట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలో నిందితుడు హరిబాబు ఆగ్రహంతో ఊగిపోయి, గర్భిణి అని కూడా చూడకుండా తన భార్య వైష్ణవి పై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేయడంతో.. కడుపులో ఉన్న బిడ్డతో సహా వైష్ణవి ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తమ కుమార్తెను హరిబాబు, అతని తల్లిదండ్రులు నిరంతరం వేధించేవారని, ఇప్పుడు పక్కా పథకం ప్రకారమే హత్య చేశారని వైష్ణవి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైష్ణవి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కోరుట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా భార్యను చంపిన హరిబాబు పరారీలో ఉన్నాడు. ఇదిలా ఉంటే నిందితులకు ఉరిశిక్ష పడే వరకు తాము వదిలిపెట్టమని, లేదంటే తామే వారిని చంపేస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మాదాపూర్ గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణ నెలకొనగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు మోహరించారు.

Next Story