జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. చెట్లు నాటే కూలీలపైకి దూసుకెళ్లిన కారు

by Jakkula.Mamatha |

గండీడ్ మండలంలోని కొంరెడ్డిపల్లి–అంచన్పల్లి గ్రామాల మధ్య జాతీయ రహదారి–167పై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. చెట్లు నాటే కూలీలపైకి దూసుకెళ్లిన కారు
X

దిశ, మహమ్మదాబాద్/గండీడ్: గండీడ్ మండలంలోని కొంరెడ్డిపల్లి–అంచన్పల్లి గ్రామాల మధ్య జాతీయ రహదారి–167పై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారి పక్కన చెట్లను నాటుతున్న కూలీలపైకి ఓ కారు అదుపుతప్పి దూసుకెళ్లడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన కూలీలు జాతీయ రహదారి వెంట మొక్కలు నాటే పనులు నిర్వహిస్తుండగా, కొంరెడ్డిపల్లి వైపు నుంచి వచ్చిన ఓ కారు అజాగ్రత్తగా అదుపుతప్పి పనులు చేస్తున్న కూలీలను బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీల కాళ్లు, చేతులు, నడుము భాగాల్లో తీవ్ర గాయాలై, ఎముకలు విరిగినట్లు సమాచారం. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించి, క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. క్షతగాత్రుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story